బెంజీన్ ముప్పు | The reason for the increased traffic pollution | Sakshi
Sakshi News home page

బెంజీన్ ముప్పు

Oct 19 2013 3:11 AM | Updated on Sep 1 2017 11:45 PM

గ్రేటర్‌పై ‘బెంజీన్’ భూతం కోరలు చాస్తోంది. వాతావరణంలో ఈ మూలకం మోతాదు శ్రుతి మించుతోంది. ‘సిటీ’జనుల్లో క్యాన్సర్, గుండెపోటు,

 

=గేటర్ గజగజ
 =పెరుగుతున్న వాహన కాలుష్యమే కారణం
 =క్యాన్సర్, గుండెపోటు, టీబీ వ్యాధులు ప్రబలే అవకాశం

 
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌పై ‘బెంజీన్’ భూతం కోరలు చాస్తోంది. వాతావరణంలో ఈ మూలకం మోతాదు శ్రుతి మించుతోంది. ‘సిటీ’జనుల్లో క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలడానికి కారణమవుతోంది. క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు దాటకూడని ఈ మూలకం వార్షిక మోతాదు గ్రేటర్‌లో ఇపుడు 8.4 మైక్రోగ్రాములకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మహానగరంలో వాహనాల సంఖ్య 38 లక్షలకు చేరుకోవడం.. ఇందులో పదేళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు సుమారు 10 లక్షల మేర ఉండడంతో నగరం పొగచూరుతోంది. మరోవైపు కల్తీ ఇంధనాల వాడకం పెరగడం, పెట్రోలు, డీజీలు వంటి పెట్రో ఉత్పత్తులను విచక్షణారహితంగా వినియోగిస్తుండటం వెరసి బెంజీన్ భూతం జడలు విప్పుతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
అవధులు దాటితే అనర్థమే


తీయటి వాసన గల బెంజీన్ మూలకం మోతాదు అవధులు దాటితే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అతి త్వరగా గాలిలో ఆవిరిగా మారుతుంది. దీనికి మండే స్వభావమూ అధికమే. ఈ మూలకం విచ్ఛిన్నం అయ్యేందుకు 10-30 ఏళ్లు పడుతుంది. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుందన్నమాట. ఇది గాలి ప్రవాహం ద్వారా ఒక చోట నుంచి మరొక చోటకు తరలి వెళుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం అధికంగా ఉన్న చోట క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలుతాయని పీసీబీ శాస్త్రవేత్త వీరన్న ‘సాక్షి’కి తెలిపారు.

 వాహన కాలుష్యంతోనే ముప్పు

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం అన్నిరకాల వాహనాలు (ద్విచక్రవాహనాలు, కార్లు, జీపులు, బస్సులు, ఆటోలు) కలిపి 38 లక్షలున్నాయి. ఇందులో పదేళ్లకు పైబడిన వాహనాలు పదిలక్షల మేర ఉన్నాయి. ఈ వాహనాల సామర్థ్యం దెబ్బతినడంతో వీటి నుంచి విపరీతంగా పొగ వెలువడుతుంది. ఫలితంగా నగరంలో కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. అలాగే సిటీలో పెట్రోలుతో నడిచే వాహనాలకు ఏటా 5400 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ వాహనాలకు 12వేల లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. పైగా వాహనాల జాబితాలో ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి.

ప్రతిరోజు 600 కొత్త వాహనాలు రిజిష్టర్ అవుతున్నట్లు రవాణా అధికారుల అంచనా. కానీ మహానగరంలో రహదారులు 8 శాతం మేరకే అందుబాటులో ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ఇంధన వినియోగం అధికమౌతోంది. కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఈ వాయుకాలుష్యంలో బెంజీన్ మోతాదు కూడా ఏటేటా పెరుగుతూ ఉంది. కాగా 2015 నాటికి వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరుకోనున్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలతో పోల్చుకుంటే ప్రస్తుతానికి నగరంలో వాహనాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వాహన సాంద్రత మాత్రం ఎక్కువగానే ఉంది.

 పరిశ్రమలు సైతం..

 ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమిసంహారకాలు, రబ్బరు, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లోనూ బెంజీన్ మోతాదు ఎక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కళ్లుగప్పి పారిశ్రామికవర్గాలు విడుదల చేస్తున్న వాయువుల్లో బెంజీన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
 
 క్యాన్సర్ ప్రబలడం తథ్యం
 బెంజీన్ కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, మూత్రకోశ క్యాన్సర్‌లు ప్రబలే ప్రమాదం ఉంది. నగరంలో ఇటీవల ఈ క్యాన్సర్‌ల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మాస్క్‌లు ధరించినా అవి గాలిని పూర్తిగా ఫిల్టర్ చేయలేవు. కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చేయాలి. కల్తీ ఇంధనాల వినియోగం తగ్గించాలి. వాహనాల్లో యూరో-4 ప్రమాణాలను తప్పనిసరి చేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది.
 - డాక్టర్ మోహనవంశీ,  క్యాన్సర్ వైద్యనిపుణుడు, ఒమేగా ఆసుపత్రి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement