ఆ డాక్టరేట్‌కు ఎంతో గౌరవం

ఆ డాక్టరేట్‌కు ఎంతో గౌరవం


- ఇప్పటివరకు 47 మందికి ఓయూ గౌరవ డాక్టరేట్లు

- ఠాగూర్‌ నుంచి నెహ్రూ దాకా ఎందరో ప్రముఖులు..




సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా.. అంతర్జాతీయ ఖ్యాతిని తన సిగలో ఇముడ్చుకున్న విశ్వవిద్యాలయం! ఈ వర్సిటీ డిగ్రీకి మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ చదువుకునేందుకు దేశ విదేశీయులు సైతం క్యూ కడుతుంటారు. మరి అలాంటి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ అందుకోవడమంటే  అషామాషీ కాదు. ఎంతో నిపుణత ఉండాలి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన శాస్త్ర, సాంకేతిక నిపుణులు, మేధావులు, రాజకీయ, సాహితీవేత్తల సేవలను గుర్తించి వారిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించడం అనవాయితీగా వస్తోంది. 1917లో ప్రెసిడెన్సీ కాలేజీ బెంగాల్‌ లఖ్‌నవ్‌ కాలేజీలో అరబిక్‌ ప్రొఫెసర్‌గా పని చేసిన నవాజ్‌ ఇమాదుల్‌ ముల్క్‌ బహదూర్‌ ముల్క్‌కు తొలి గౌరవ డాక్టరేటు(డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌)ను ప్రధానం చేసింది.



ఆ తర్వాత సాహితీవేత్త రవీంద్రనాధ్‌ ఠాగూర్, భారత మాజీ ప్రధాని పండిత్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ, సి.రాజగోపాలాచారి సహా మొత్తం 47 మందికి గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేసింది. 2001లో చివరి సారిగా అరుణ్‌ నేత్రావలికి(డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ విభాగం)గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఆ తర్వాతి నుంచి ఇప్పటివరకు గౌరవ డాక్టరేట్లను ఎవరికి ప్రకటించలేదు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేయడంతోపాటు మరో 51 మంది నిపుణులను ఘనంగా సన్మానించాలని భావించింది. ఆ మేరకు ఆయా రంగాల్లోని ప్రముఖులను ఎంపిక చేసింది. అయితే ఈ ఎంపికపై విద్యార్థులు, మేధావుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు వర్సిటీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, అభిప్రాయబేధాలు వల్ల గౌరవ డాక్టరేట్‌ ప్రదానంతో పాటు సన్మానాలను వాయిదా వేసింది.



ఓయూ గౌరవ డాక్టరేట్లు పొందిన కొందరు ప్రముఖులు..

1. రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ (డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌) 1938

2. సి.రాజగోపాలాచారి (డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌)1944

3. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ (డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌)1947

4. బాబూ రాజేంద్రప్రసాద్‌ (డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌)1951

5. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌) 1953

6. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ (డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌)1953

7. బూర్గుల రామకృష్ణరావు (డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌)1956

8. యాసర్‌ అరాఫత్‌ (డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌) 1982

9. డాక్టర్‌ వై.నాయుడమ్మ (డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌) 1982

10. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ (డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌) 1996

11. డాక్టర్‌ అరుణ్‌ నేత్రావలి (డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌) 2001

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top