
లక్ష్యం రూ.1587 కోట్లు
జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను లక్ష్యం రూ.1587 కోట్లు. ఇప్పటి వరకూ వసూలైన మొత్తం రూ.804 కోట్లు. బకాయిలనేవి లేకుండా చేయాలనేది కమిషనర్ ధ్యేయం.
పన్నుల వసూలుకు జీహెచ్‌ఎంసీ భారీ కసరత్తు
ముగుస్తున్న ఆర్థిక సంవత్సరం
నెలాఖరులోగా లక్ష్యం సాధించే యత్నం
వివిధ విభాగాల భాగస్వామ్యం
చలించని మొండి బకాయిదారులు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను లక్ష్యం రూ.1587 కోట్లు. ఇప్పటి వరకూ వసూలైన మొత్తం రూ.804 కోట్లు. బకాయిలనేవి లేకుండా చేయాలనేది కమిషనర్ ధ్యేయం. ఈ నేపథ్యంలో లక్ష్య సాధనకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం రెండు నెలలుగా ముమ్మర కసరత్తు చేస్తోంది. వందల మందిని రంగంలోకి దింపింది. సర్కిళ్ల వారీగా నోడల్ ఆఫీసర్లను, వారిపైన సూపర్‌వైజర్లను ఉన్నతాధికారులు నియమించారు. ఆస్తి పన్ను వసూలు చేసే రెవెన్యూతో పాటు ఇతర విభాగాల సిబ్బందిని భాగస్వాములను చేశారు. ఈసారి పన్నులతో పాటు బకాయిల వసూలుకు అధికారులు కొంత దూకుడు చూపించారు.ఇళ్ల ముందు చెత్త డబ్బాలు ఉంచడం... విద్యుత్ కనెక్షన్లు తొలగించడం... వ్యాపారాల సంస్థలను మూసివేయడం వంటివి చేశారు. దీనికి న్యాయస్థానాల నుంచి అక్షింతలూ వేయించుకున్నారు. అయినప్పటికీ మహా మొండి బకాయిసురులు దిగి రావడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు గడువు 18 రోజులు (మార్చి 31 వరకు) ఉంది. వసూలు కావాల్సిన ఆస్తిపన్ను మొత్తం ఇంకా రూ.783 కోట్లు. మరి గడువులోగా అంత మొత్తం సాధించడం ఎంతవరకూ సాధ్యమవుతుందో చూడాలి.
వసూళ్లలో నిమగ్నమైన అధికారులు...
పర్యవేక్షక అధికారులు : 24 మంది
నోడల్ అధికారులు : 33 మంది
ఔట్‌రీచ్ సిబ్బంది : 1500 మంది
వీరంతా కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు. నిత్యం కమిషనర్‌కుసమాచారం ఇవ్వడం... సమీక్షలు... బకాయిల వసూలుకు కొత్త దారులు ఎన్నుకోవడం...ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొండొకచో బడాబాబుల వైపు పోకుండా చిరుజీవులపై ప్రతాపం కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్కిళ్ల వారీగా టాప్ -1000 బకాయిదారులపైనే ప్రతాపం చూపమంటే.. ఎవరు పడితే వారిపై జులుం చెలాయిస్తున్నారనే చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గృహస్తుల పైనా ఆరోపణలూ ఉన్నాయి. దాంతోఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వారి ఉత్సాహాన్ని నీరుగార్చలేక మౌనంగా ఉంటున్నారు.
మాఫీపై ఆశలు
పన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆశించిన ప్రగతి సాధించకపోవడానికి కారణాలనేకం. బకాయిలు చెల్లించకపోయినా తమనెవరూ ఏమీ చేయలేరనే బడాబాబుల ధీమా... దిగువ మధ్య తరగతి వరకూ ఆస్తిపన్ను మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన .... వసూళ్లపై కొంత ప్రభావం చూపుతోంది. సమస్యంతా మొండి బకాయిసురులతోనేనని అధికారులు సైతం అంటున్నారు. సకల సదుపాయాలు అనుభవించే వారే పన్ను చెల్లింపులకు దూరంగా ఉండడం విస్తుగొల్పుతోంది. మరోవైపు ఏది ఏమైనా గడువులోగా వసూలు చేయగలమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల వినూత్న ప్రదర్శన
గచ్చిబౌలి: ఆస్తి పన్ను బకాయిల వసూలుకు జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్-11 అధికారులు వినూత్న రీతిలో వ్యవహరించారు. మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ ఎదుట ప్ల కార్డులతో మౌన ప్రదర్శన చేపట్టారు. జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుతో హోటల్ యాజామాన్యం ఆగమేఘాల మీద రూ.50 లక్షల చెక్‌ను అందజేశారు. ఈ హోటల్ యాజమాన్యం 2014-15 సంవత్సరానికి రూ.1.47 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉంది. ఇప్పటికే రూ.40 లక్షలు చెల్లించారు. రూ.కోటి 7 లక్షలు బకాయి ఉన్నారు. దీనికోసం నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్ రిసెప్షన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే రూ.50 లక్షల చెక్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్-11 అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ కుమార్, లెసైన్స్ ఆఫీసర్ రవికుమార్, ఉప వైద్యాధికారి రవి, వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ వకీల్, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు సురేందర్‌రెడ్డి, సంజయ్, ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.