కీలక ‘హోదా’ల్లో నగరవాసులే! | 'status' in the city's inhabitants! | Sakshi
Sakshi News home page

కీలక ‘హోదా’ల్లో నగరవాసులే!

Jun 29 2016 10:57 PM | Updated on Sep 4 2017 3:43 AM

కీలక ‘హోదా’ల్లో  నగరవాసులే!

కీలక ‘హోదా’ల్లో నగరవాసులే!

ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన ఉగ్రవాద సంస్థల్లో కీలక హోదాల్లో సిటీకి చెందిన వారే ఉంటున్నారు.

‘జునూద్’ ఫైనాన్స్ చీఫ్‌గా నఫీజ్ ఖాన్
ఏయూటీ దక్షిణ భారత అధిపతిగా ఇబ్రహీం


సిటీబ్యూరో: ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన ఉగ్రవాద సంస్థల్లో కీలక హోదాల్లో సిటీకి చెందిన వారే ఉంటున్నారు. మొన్నటికి మొన్న జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ మాడ్యుల్, తాజాగా చిక్కిన అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ) మాడ్యుల్ ఈ విషయాలనే స్పష్టం చేస్తున్నాయి. ‘జునూద్’ మాడ్యుల్‌కు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఈ ఏడాది జనవరిలో నగరంలో అరెస్టు చేసిన నలుగురిలో ఒకడైన నఫీజ్ ఖాన్ ఆ సంస్థలోనే కీలక వ్యక్తని పోలీసులు గుర్తిం చారు. ప్రస్తుతం సిరియా  కేంద్రంగా ఐసిస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ మాడ్యుల్ యాక్టివ్‌గా పని చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దీనికి ముంబైలో పట్టుబడిన ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్ చీఫ్‌గా ఉన్నాడని, ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన రిజ్వాన్ అలీ డిప్యూటీ చీఫ్‌గా, కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన నజ్మల్ హుడా మిలటరీ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారని గుర్తించారు.


హైదరాబాద్‌లో పట్టుబడిన నఫీజ్ ఖాన్ ఈ మాడ్యుల్ ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షించే ఫైనాన్స్ చీఫ్‌గా ఉన్నాడని నిర్థారించారు. ‘జునూద్’లోకి రిక్రూట్‌మెంట్, ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణ కోసం షఫీ ఆర్మర్ నుంచి ముదబ్బీర్‌కు రూ.8 లక్షల హవాలా రూపంలో అందాయని, వీటి నుంచి రూ.2 లక్షల్ని హైదరాబాద్‌లో ఉన్న నఫీజ్‌కు పంపాడని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. బుధవారం చిక్కిన ఏయూటీ మాడ్యుల్ ప్రస్తుతానికి నగరానికే పరిమితమైంది. అయితే భవిష్యత్తులో దక్షిణ భారత దేశ వ్యాప్తంగా విస్తరించడానికి షఫీ ఆర్మర్ పథక రచన చేశాడు. ఈ బాధ్యతల్ని చెత్తాబజార్‌కు చెందిన మహ్మద్ ఇబ్రంహీం యజ్దానీకి అప్పగించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి సౌత్ ఇండియా చీఫ్‌గా నియమించాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement