అన్ని జిల్లాల్లో షీ-టీమ్‌లు | SHE teams for all Telangana districts | Sakshi
Sakshi News home page

అన్ని జిల్లాల్లో షీ-టీమ్‌లు

Mar 28 2016 8:05 PM | Updated on Sep 3 2017 8:44 PM

తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈవ్‌టీజింగ్, చైన్‌స్నాచింగ్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.

- జంట నగరాలతో పాటు అన్ని జిల్లాల్లో షీ-టీమ్‌లు
- సభలో హోంమంత్రి నాయిని వెల్లడి
- ఈవ్‌టీజర్లు, చైన్‌స్నాచర్లపై పీడీ కేసులు పెడుతున్నామని వివరణ
- షీ-టీమ్‌లను మరింత పెంచాలని కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి సూచన


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈవ్‌టీజింగ్, చైన్‌స్నాచింగ్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జంట నగరాల్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో షీ-టీమ్‌లను ఏర్పాటు చేసి వారికి భద్రత కల్పిస్తున్నారు. సోమవారం షీ-టీమ్‌ల ఏర్పాటుపై టీఆర్‌ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అడిగిన స్వల్ఫకాలిక ప్రశ్నకు హోంమంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో రెండు షీ-టీమ్‌లను ఏర్పాటు చేశామని, అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ ఇవి ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే షీ-టీమ్‌ల ద్వారా 315 కేసులు నమోదు చేశామని, 1725 మందిని అరెస్ట్ చేశామని, 2,400ల మందికి కౌన్సిలింగ్ నిర్వహించామని వివరించారు.

కొందరిపై పీడీ కేసులు సైతం పెడుతున్నామన్నారు. ఈవ్‌టీజర్లలో మైనర్లు సైతం ఉన్నారన్నారు. వీరిని సక్రమ మార్గంలో తీసుకువచ్చేందుకు ప్రత్యేకె కౌన్సెలింగ్‌లు ఇస్తున్నామని తెలిపారు. పదే పదే తప్పులు చేసే వారిపై నిర్భయ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో పోలిస్తే చైన్‌స్నాచింగ్ కేసులు సైతం 14శాతం తగ్గాయని హోంమంత్రి తెలిపారు. ఈ విషయంలోనూ పీడీ కేసులు పెడుతున్నామన్నారు.

షీ-టీమ్‌లను పెంచండిః గీతారెడ్డి
షీ-టీమ్‌లను హైదరాబాద్‌లో మరిన్ని పెంచాలని కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి సూచించారు. చైన్ స్నాచింగ్‌లు సైతం పెరుగుతున్నాయని, అవి జరుగకుండా భయం కలిగేలా చర్యలుండాలన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక యువతి అత్యాచారం కేసులో షీ-టీమ్‌లు ఎందుకు స్పందించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

రౌడీషీట్‌లు తెరవాలిః కొండా సురేఖ
ఈవ్టీజర్లపై రౌడీషీట్‌లను తెరవాలని టీఆర్‌ఎస్ సభ్యురాలు కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఉమెన్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలన్నారు. షీ-టీమ్‌లలో పనిచేస్తున్న వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.

తక్షణ సాయానికి ఫైర్ మోటార్ సైకిళ్లుః హోంమంత్రి
కాగా అంతకుముందు అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుపై టీఆర్‌ఎస్ సభ్యుడు గాదరి కిశోర్ అడిగిన ప్రశ్నకు హోమంత్రి సమాధానమిస్తూ, అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వేగంగా చేరుకునేందుకు ఫైర్ మోటార్ సైకిళ్లను ప్రవేశపెట్టామని తెలిపారు. వీటితో పాటు అగ్నిమాపక కేంద్రాల ఆధునికీకరణకు ప్రత్యేక శ్రధ్ద తీసుకుంటున్నామని, ఈ బడ్జెట్‌లో రూ.111.72కోట్లు కేటాయించామని వివరించారు. ఈ విభాగంలో ఉన్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement