‘మింట్‌’కే ముద్రణ బాధ్యతలు | print responsibilitys to mint | Sakshi
Sakshi News home page

‘మింట్‌’కే ముద్రణ బాధ్యతలు

Feb 12 2018 2:56 AM | Updated on Feb 12 2018 4:16 AM

print responsibilitys to mint - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త పాస్‌ పుస్తకాల ముద్రణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సెంట్రల్‌ సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. ఎంవోయూలో పేర్కొన్న మేరకు రాష్ట్రంలోని రైతులకు అవసరమైన 72 లక్షల ఈ–పట్టాదారు పాస్‌ పుస్తకాలు కమ్‌ టైటిల్‌ డీడ్‌లను సెంట్రల్‌ సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ అందజేయనుంది. ఇందుకుగానూ ప్రతి పాస్‌ పుస్తకానికి రూ.200 (పన్నులు అదనం) చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

నామినేషన్‌ పద్ధతిలో ఖరారు చేసిన ఈ కాంట్రాక్టుకు కేబినెట్‌ కూడా షార్ట్‌ సర్క్యులేషన్‌ పద్ధతిలో ఆమోదం తెలపడంతో కొత్త పాస్‌ పుస్తకాల ముద్రణ ప్రారంభమైందని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. సమయం తక్కువగా ఉన్నందున హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని ప్రెస్‌తో పాటు దేవాస్‌(మధ్యప్రదేశ్‌), నాసిక్‌(మహారాష్ట్ర), నోయిడా(ఉత్తరప్రదేశ్‌)లోని ప్రెస్‌లను కూడా ఏకకాలంలో వినియోగించనున్నారు. రోజుకు 2.5 లక్షల పాస్‌ పుస్తకాలను నాలుగు ప్రెస్‌లలో ముద్రించేలా ప్రణాళిక రూపొందించారు. మార్చి 11వ తేదీ కల్లా కొత్త పాస్‌ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు ‘ధరణి’బాధ్యతలు
భూరికార్డుల నిర్వహణకు ఉద్దేశించిన ధరణి వెబ్‌సైట్‌ నిర్వహణ బాధ్యతలను ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఐఎల్‌ఎఫ్‌ఎస్‌)కు అప్పగించారు. ఈ వెబ్‌సైట్‌ నిర్వహణకు పిలిచిన టెండర్లలో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఎల్‌1గా నిలవడంతో కాంట్రాక్టును ఖరారు చేశారు. ధరణి వెబ్‌ డిజైన్, సైట్‌ అభివృద్ధి, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పేందుకు షార్ట్‌ సర్క్యులేషన్‌ పద్ధతిలో కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

దీంతో మూడేళ్లకు రూ.116.05 కోట్ల ఖర్చు అంచనాతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్లు, తహసీల్దార్‌ కార్యాలయాల డాటాను అనుసంధానం చేయనున్నారు. రైతుల పట్టాదారు పాస్‌ పుస్తకాలను జీపీఎస్‌ పద్ధతిలో వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనున్నారు. కాగా, ధరణి వెబ్‌సైట్‌ రూపకల్పనపై సోమవారం సీసీఎల్‌ఏ కార్యాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు.  

చిరునవ్వులు.. దుక్కి దున్నుడు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇస్తున్న కొత్త పాస్‌ పుస్తకాలను కొన్ని ప్రత్యేక లక్షణాలతో తయారు చేస్తున్నారు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాస్‌ పుస్తకంపై కాకతీయ  తోరణం, చార్మినార్, భారీ నీటి ప్రాజెక్టులు, ఎరువులు చల్లుతూ, దుక్కి దున్నుతున్న రైతులు, చిరునవ్వులు చిందిస్తున్న రైతు కుటుంబాల మహిళల చిత్రాలు ముద్రించనున్నారు.

‘రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. బంగారు తెలంగాణ మన స్వప్నం–మన లక్ష్యం’అనే నినాదాలను కూడా రాయనున్నారు. మొత్తం 18 భద్రతా ప్రమాణాలతో పాస్‌ పుస్తకాలను ముద్రిస్తున్నారు. ప్రతి పుస్తకంలో 20 పేజీలుంటాయి. ఇందులో పట్టాదారు మొబైల్‌ నంబర్, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తదితర వివరాలు, హద్దులతో కూడిన పట్టాదారు భూమి మ్యాప్, లావాదేవీలు, క్రయ విక్రయాల వివరాలు ఉండనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement