
తడిసి మోపెడవుతున్న కరెన్సీ ముద్రణ ఖర్చు
2024–25లో రూ.6,373 కోట్లకు చేరిక
ఏడాదిలో 25 శాతం పెరిగిన వ్యయం
చెలామణిలోకి 3,030 కోట్ల నోట్లు
ఒక రూపాయి బిళ్ల తయారవడానికి ఒక రూపాయి 11 పైసలు కావాలి. అదే 10 రూపాయల బిళ్లకైతే రూ.5.54. రూ.10 నోటు మన చేతిలోకి రావడానికి సుమారు ఒక రూపాయి ఖర్చవుతోంది. కరెన్సీ తయారవ్వాలన్నా కరెన్సీ కావాల్సిందే. ఈ ఖర్చు ఏటా భారీగా పెరిగిపోతోంది. 2024–25లో కరెన్సీ ముద్రణకు ఏకంగా రూ.6,373 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. నాలుగేళ్లలో ఖర్చు 58.8 శాతం పెరిగిపోయింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
కరెన్సీ నోట్లను కొంత మంది పర్సులోనో, జేబులోనో కుక్కిపెడతారు. పాడవుతాయన్న పట్టింపు ఉండదు. చినిగిపోయినా ఏముందిలే ఏ షాపులోనైనా తీసుకుంటారు అన్న ధీమా. లేదంటే బ్యాంకులో మార్చుకోవచ్చని తేలిగ్గా తీసుకుంటారు. మా డబ్బులు మా ఇష్టం అని కొట్టిపారేయకండి. కరెన్సీ నోటు కూడా ఖర్చు పెట్టి తయారుచేయాల్సిందే. ఎందుకంటే తయారీ, పంపిణీ వ్యయాన్ని జోడిస్తే ఆ కరెన్సీ విలువ మీకు కనిపించే అంకెను మించి ఉంటుంది.
కరెన్సీ తయారీలో వాడే సిరా, కాగితం వంటి ముడి సరుకు వ్యయాలకుతోడు సిబ్బంది వేతనాలూ పెరిగాయి. దీని ఫలితంగా ముద్రణ ఖర్చు పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతేగాక నకిలీ నోట్లను చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు నూతన సెక్యూరిటీ ఫీచర్లను జోడించడం కూడా ఖర్చును పెంచిందని ఆర్‌బీఐ చెబుతోంది.
పెరిగిన నోట్ల సరఫరా
ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. 2020–21లో నోట్ల ముద్రణకు రూ.4,012 కోట్ల ఖర్చు అయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం కాస్తా రూ.6,373 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలో 58.8 శాతం ఎగసిందన్నమాట. 2023–24లో కరెన్సీ ముద్రణ ఖర్చులు రూ.5,101 కోట్లు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. నాలుగేళ్లలో దేశంలో నోట్ల సరఫరా దాదాపు 2,233 కోట్ల నుంచి 35.7 శాతం పెరిగి 3,030 కోట్లకు చేరింది.
ఆర్‌బీఐకి కరెన్సీ నోట్లు నాలుగు ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి వస్తాయి. ఇందులో నాసిక్ (మహారాష్ట్ర), దేవాస్ (మధ్యప్రదేశ్) ప్రెస్‌లు భారత ప్రభుత్వానికి చెందినవి. మైసూర్ (కర్ణాటక), సల్బోని (పశ్చిమ బెంగాల్) ప్రెస్‌లు రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్నాయి.
మూడు రకాల కరెన్సీ
చెలామణిలో ఉన్న కరెన్సీలో భారత్‌లో ప్రస్తుతం బ్యాంకు నోట్లతోపాటు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ), నాణేలు ఉన్నాయి. 2024–25లో దేశంలో చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ 6 శాతం, పరిమాణం (నోట్ల సంఖ్య) 5.6 శాతం పెరిగింది. 2023 మేలో రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. నాటి నుంచి రూ.3.56 లక్షల కోట్లలో 98.2% విలువైన నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి.
రూ.500 నోట్ల హవా
గత ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా రూ.500 నోట్ల వాటా ఏకంగా 86 శాతంగా ఉంది. ఏడాదిలో వీటి విలువ స్వల్పంగా తగ్గింది. పరిమాణం పరంగా రూ.500 నోట్ల వాటా 40.9 శాతం ఉంది. చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో రూ.500 నోట్ల వాటాయే అత్యధికం. పరిమాణం పరంగా తరువాతి స్థానాన్ని రూ.10 నోట్లు కైవసం చేసుకున్నాయి.
వీటి వాటా మొత్తం పరిమాణంలో 16.4 శాతం. చెలామణిలో ఉన్న నోట్లలో రూ.10, రూ.20, రూ.50 నోట్ల మొత్తం వాటా 31.7 శాతం. గత ఆర్థిక సంవత్సరం చెలామణిలో ఉన్న నాణేల విలువ 9.6 శాతం, సంఖ్య 3.6 శాతం దూసుకెళ్లింది. 2025 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నాణేల పరిమాణంలో రూ.1, రూ.2, రూ.5 నాణేల వాటా 81.6 శాతం. విలువ పరంగా ఈ నాణేల వాటా 64.2 శాతానికి చేరింది.
ఈ–రుపీ కొత్త రికార్డు
2024–25లో చెలామణిలో ఉన్న ఈ–రుపీ విలువ 334 శాతం పెరిగింది. 2025 మార్చి 31 నాటికి ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విలువ రిటైల్ రూపంలో (చెలామణిలో) నాలుగు రెట్లు పెరిగి రూ.1,016.46 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం రూ.234 కోట్లు. ఈ–రుపీ డిజిటల్ రూపంలో పనిచేసే నగదు. వినియోగదారులు దీన్ని నిల్వ చేయడంతోపాటు బదిలీ కూడా చేయొచ్చు. 2025 మార్చి నాటికి 17 బ్యాంకులు డిజిటల్ వాలెట్స్ ద్వారా ఈ–రుపీని అందిస్తున్నాయి. దీన్ని 60 లక్షల మంది వినియోగిస్తున్నారు.
పెరిగిన నకిలీ రూ.500 నోట్లు
2024–25లో బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ.500 నోట్ల సంఖ్య 37.3 శాతం పెరిగిందని ఆర్‌బీఐ వెల్లడించింది. రూ.5.88 కోట్ల విలువైన 1.18 లక్షల నకిలీ రూ.500 నోట్లు (కొత్త డిజైన్) కనుక్కొన్నారు. 2023–24లో రూ.4.28 కోట్ల విలువైన 85,711 నకిలీ నోట్లు గుర్తించారు. నకిలీ రూ.200 నోట్లు 13.9% పెరిగాయి.
రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ. 2000 నోట్లలో నకిలీవి.. గతేడాదితో పోలిస్తే వరుసగా 32.3, 14, 21.8, 23 శాతం పెరిగాయి. నకిలీ రూ.2000 నోట్ల సంఖ్య ఏడాదిలో 26,035 నుంచి 3,508 నోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 2.17 లక్షలు. అంత క్రితం ఏడాది ఈ సంఖ్య 2.22 లక్షల నోట్లు.
