నీళ్లకూ దిక్కులేదు! | No Toilets in 3 310 schools | Sakshi
Sakshi News home page

నీళ్లకూ దిక్కులేదు!

Dec 16 2016 3:43 AM | Updated on Sep 4 2017 10:48 PM

నీళ్లకూ దిక్కులేదు!

నీళ్లకూ దిక్కులేదు!

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశా లలను మౌలిక సదుపాయాల కొరత పీడిస్తోంది. ఏళ్ల తరబడి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

13 వేల ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లకు నీళ్లు లేవు
మరో 3,310 స్కూళ్లలో టాయిలెట్లు లేవు
తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
ఇంకా 7,517 తరగతి గదుల కొరత
ఉన్నత పాఠశాలల్లో అరకొరగానే సైన్స్‌ ల్యాబ్‌లు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశా లలను మౌలిక సదుపాయాల కొరత పీడిస్తోంది. ఏళ్ల తరబడి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ప్రతి పాఠశాలనూ ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. టీచర్లు ఉన్న స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఉండవు. మౌలిక సదుపాయాలున్న చోట టీచర్లు ఉండరు. ఇటీవలి వరకు పాఠశాలల్లో టాయిలెట్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడగా... ఇప్పుడు టాయిలెట్లు ఉన్నా నీటి సౌకర్యం లేక వినియోగించుకోలేని దుస్థితి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 13,892 పాఠశాలల్లోని టాయిలెట్లకు నీటి సదుపాయం లేదని విద్యా శాఖే తేల్చింది. ఇక 3,310 స్కూళ్లలో టాయిలెట్లు లేవు. దీంతో విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఇక ప్రతి ఉన్నత పాఠశాలలో సైన్స్‌ల్యాబ్‌ కచ్చితంగా ఉండాలి. కానీ 75 శాతం ఉన్నత పాఠశాలల్లో సైన్స్‌ ల్యాబ్‌లే లేవు. సరిపడా తరగతి గదులు లేవు. సరిపడా ఫర్నీచర్, విద్యుత్‌ సదుపాయం లేవు. లైబ్రరీ, కాంపౌండ్‌ వాల్‌ లేకపోవడం వంటి సమస్యలూ ఉన్నాయి.



ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేసినా..
ప్రతి నియోజకవర్గంలో రూ.5 కోట్లతో పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిం చినా ఆచరణలోకి రాలేదు. ఒక్కో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.కోటి, జిల్లా కలెక్టర్‌ అత్యవసర నిధి నుంచి రూ.కోటి, పాఠశాల విద్యా శాఖ రూ.3 కోట్లు ఇవ్వ డం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసేలా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఇందుకు ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలుంటే... ఇప్పటి వరకు 45 మంది మాత్రమే తమ నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు వచ్చారని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎన్నెన్నో సమస్యలు
ప్రస్తుతం రాష్ట్రంలో 25,966 పాఠశాలలు (ప్రాథమిక 18,139, ప్రాథమికోన్నత 3,244, ఉన్నత 4,583) ఉండగా.. వాటిలో ఇంకా 7,517 తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. ఇందుకు రూ.589 కోట్లు అవసరం.

3,310 పాఠశాలల్లో టాయిలెట్ల వసతి కల్పించాల్సి ఉంది. ఇందుకు రూ.64 కోట్లు అవసరం. ఇక ఇప్పటికే నిర్మించిన 13,892 టాయిలెట్లకు నీటి సదుపాయం కల్పించేందుకు రూ.138 కోట్లు అవసరం.

2,286 స్కూళ్లకు విద్యుత్‌ సదుపాయం కల్పిం చాల్సి ఉంది. అందుకు రూ.80 కోట్లు కావాలి.

పాఠశాలల్లో 9,23,853 బల్లలు (ఫర్నీచర్‌) అవసరం. ఇందులో ప్రాథమిక పాఠశాలలకు 4,27,061, ప్రాథమికోన్నత స్కూళ్లకు 1,34,017, ఉన్నత పాఠశాలలకు 3,62,775 బల్లలు అవసరం.
వీటితోపాటు ఇతర ఫర్నీచర్‌కు కలిపి రూ.415 కోట్లు కావాలి.

3,877 ఉన్నత పాఠశాలల్లో సైన్స్‌ ల్యాబ్‌లు లేవు. ఏర్పాటు చేసేందుకు రూ.19.38 కోట్లు అవసరం.

92 ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటుకు రూ.23 కోట్లు కావాలి.

10,275 పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించేందుకు రూ.585 కోట్లు అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement