రహదారులపై మద్యం షాపులను తొలగించాలని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంబటి
జస్టిస్ అంబటి లక్ష్మణరావు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రహదారులపై మద్యం షాపులను తొలగించాలని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు కోరారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఆదాయ వనరుగా భావించరాదని ప్రభుత్వానికి సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అప్సా, మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో ‘రహదారులు-మద్యం షాపులు’ అనే అంశంపై శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉన్న దాదాపు 1500 మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
రహదారి భద్రతపై సుప్రీం కోర్టు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ డిసెంబర్ 31లోగా అన్ని రాష్ట్రాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనున్న మద్యం షాపులను తొలగించి... రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలతోనే మద్య నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. బిహార్, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారని.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. చీప్ లిక్కర్‌ను తీసుకువచ్చేందుకు గుడుంబాను అరికట్టే ప్రయత్నం చేశారని, దీనివల్ల కల్తీ కల్లు పెరిగి అనేక మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంతో రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. దీన్ని ఇంకా పెంచుకోవాలని చూస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని విమర్శించారు.
స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ తాగుడు వల్ల అవినీతి పెరిగిపోయిందని అన్నారు. మద్య నిషేధఉద్యమానికి పెద్ద ఆయుధాలు అక్కర లేదని... అగ్గి పుల్ల ఉంటే చాలని వ్యాఖ్యానించారు. మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ అధ్యక్షుడు వి.లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి ఎం.పద్మనాభరెడ్డి, మన తెలంగాణ ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డి, ట్రాన్స్‌పోర్టు మాజీ అడిషనల్ కమిషనర్ సి.ఎల్.ఎన్. గాంధీ, అప్సా డెరైక్టర్ ఎస్.శ్రీనివాస్ రెడ్డి, బడుగుల చైతన్య సమితి అధ్యక్షురాలు జి.శారద గౌడ్ పాల్గొన్నారు.