చెక్కు...చిక్కు! | new head aches in property tax collection | Sakshi
Sakshi News home page

చెక్కు...చిక్కు!

Mar 22 2016 3:29 AM | Updated on Sep 3 2017 8:16 PM

చెక్కు...చిక్కు!

చెక్కు...చిక్కు!

జీహెచ్‌ఎంసీ అధికారులకు ‘చెక్కు’లు చుక్కలు చూపిస్తున్నాయి. పన్నుల చెల్లింపునకు కొంతమంది ఇస్తున్న చెక్కులు చెల్లడం లేదు.

చెల్లని చెక్కులతో అధికారులకు ఇక్కట్లు
ఆస్తిపన్ను వసూళ్లలో కొత్త తలనొప్పులు
సంబంధిత వ్యక్తులకు నోటీసులు


సిటీబ్యూరో:  జీహెచ్‌ఎంసీ అధికారులకు ‘చెక్కు’లు చుక్కలు చూపిస్తున్నాయి. పన్నుల చెల్లింపునకు కొంతమంది ఇస్తున్న చెక్కులు చెల్లడం లేదు.    వాటిని అందుకునేటపుడు సంతోషిస్తున్న అధికారులు... తీరా అవి బౌన్స్ అవుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీకి అందిన చెక్కుల్లో దాదాపు రూ.150 కోట్ల మేర చెల్లనివి ఉన్నట్లు తెలిసింది. చెక్కుల రూపంలో పన్ను చెల్లించిన వారిలో సుమారు 27,600 మంది ఇచ్చినవి బౌన్సయ్యాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామంటూ లాయర్ నోటీసులు పంపించగా... రూ.137 కోట్లు తిరిగి వసూలయ్యాయి. ఇంకా రూ.13 కోట్లు  రావాల్సి ఉంది. మరో 3,650 మంది నుంచి పన్నులు వసూలు కావాల్సి ఉంది. లాయర్ నోటీసులిప్పించేందుకు జీహెచ్‌ఎంసీ ఒక్కో కేసుకు దాదాపు రూ.135 ఖర్చు చేస్తోంది.


ఈ మొత్తాన్ని సంబంధిత వ్యక్తులనుంచే వసూలు చేయనున్నారు. ఆస్తిపన్ను చెల్లించామని చెప్పి కొంతకాలం తప్పించుకునేందుకు సదరు వ్యక్తులు ఇలా జీహెచ్‌ఎంసీకి టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. లాయర్ నోటీసులతో బెంబేలెత్తి తిరిగి చెల్లింపులు ప్రారంభించారు. ఇలాంటి చెల్లని చెక్కులు ఇంకా ఎన్ని ఉన్నాయో ఈ నెల దాటితే కానీ తెలియదు. చెక్‌బౌన్స్ కేసుల్లో ఎక్కువ మొత్తం రావాల్సిన సర్కిళ్లలో ఖైరతాబాద్, అబిడ్స్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1100 కోట్లు. ఇప్పటి వరకు దాదాపు రూ.790 కోట్లు వసూలయ్యాయి. మిగతా టార్గెట్ పూర్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల అధికారులు శ్రమిస్తున్నారు. మిగిలిన పది రోజుల్లో ఎంతమేరకు లక్ష్యం సాధిస్తారనేది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement