
ఎంబీటీ అధ్యక్షుడు ఖయ్యూం కన్నుమూత
మజ్లిస్-తెహరిక్-బచావో(ఎంబీటీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఖయ్యూం ఖాన్ (54) కన్నుమూశారు.
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్-తెహరిక్-బచావో(ఎంబీటీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఖయ్యూం ఖాన్ (54) కన్నుమూశారు. గురువారం అర్ధరాత్రి గుండెపోటుకు గురికాగా హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. ఖయ్యూం ఖాన్ ఎంబీటీ వ్యవస్థాపక అధ్యక్షుడైన దివంగతనేత, మాజీ ఎమ్మెల్యే అమానుల్లాఖాన్ పెద్దకుమారుడు. తండ్రి మరణాంతరం పార్టీని తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించారు.
చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరసగా మూడు పర్యాయాలు బరిలో దిగి ఆయన మజ్లిస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. ఈయనకు ఇద్దరు సంతానం. చంచల్‌గూడలోని స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని ప్రజలు పెద్దఎత్తున సందర్శించారు. పాతబస్తీలోని మక్కా మసీదులో ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు భౌతిక కాయాన్ని ఉంచారు. శుక్రవారం నమాజ్-ఏ-జనాజా ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ, ఫారూక్ ఖాన్, ఎంిపీ ఎం.ఎ.ఖాన్ తదితరులు పాల్గొన్నారు.