తెలంగాణ వాహనాలకు టీజీ సిరీస్ కేటాయింపు | It is clear the allocation of TG series for vehicles | Sakshi
Sakshi News home page

తెలంగాణ వాహనాలకు టీజీ సిరీస్ కేటాయింపు

May 30 2014 2:20 AM | Updated on Sep 2 2017 8:02 AM

తెలంగాణ రాష్ట్రంలోని వాహనాలకు కేంద్రప్రభుత్వం ‘టీజీ’ సిరీస్‌ను కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్ర , శనివారాల్లో ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ ప్రచురించనున్నారు.

నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వాహనాలకు కేంద్రప్రభుత్వం ‘టీజీ’ సిరీస్‌ను కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్ర , శనివారాల్లో ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ ప్రచురించనున్నారు. తెలంగాణ ఆంగ్ల పదం పొడి అక్షరాలుగా టీజీ ఉండనున్నా... జిల్లాల వారీగా ప్రస్తుతం అమలులో ఉన్న నంబర్లనే కొనసాగించనున్నారు. ఈ నంబర్లు అవే ఉండాలా, కొత్తవి కేటాయించాలా అన్న అధికారాన్ని కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దఖలుపరిచింది.
 
కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆ నిర్ణయం వెలువడే వరకు టీజీ సిరీస్‌లో పాత నంబర్లనే అధికారులు కేటాయిస్తారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సిరీస్‌తో ఒక్కో జిల్లాకు ఒక్కో నంబరు అమలులో ఉంది. ఖైరతాబాద్‌కు ఎపి-09, మెహిదీపట్నంకు ఎపి-13, వరంగల్‌కు ఎపి-36 ఇలా ఆయా ప్రాంతాల అక్షరక్రమం ఆధారంగా నంబర్ కొనసాగుతోంది. కొత్తగా తెలంగాణకు టీజీ సిరీస్ వచ్చినా జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న నంబర్లే అమలులో ఉంటాయి. తెలంగాణలోని జిల్లాలకు మళ్లీ 01 నుంచి వరుసగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఆమేరకు కొత్త నంబర్లు అమలులోకి వస్తాయి.
 
 అయితే అది ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించటం లేదు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను విడగొట్టి 25కు పెంచాలని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఆ విభజన జరిగితేనే నంబర్ల కేటాయింపు సాధ్యమవుతుంది. ప్రస్తుత పది జిల్లాల అక్షర క్రమం ఆధారంగా ఇప్పుడే కేటాయిస్తే జిల్లాల విభజన తర్వాత అయోమయం తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పాత వాహనాల నంబర్లను మార్చుకోవాలా, ఏపీ సిరీస్‌తోనే కొనసాగవచ్చా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement