కశ్మీర్ కొండల్లో నేలకొరిగిన తెలుగుతేజం | Hussain tahir Khan pilot died | Sakshi
Sakshi News home page

కశ్మీర్ కొండల్లో నేలకొరిగిన తెలుగుతేజం

Published Fri, Feb 13 2015 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

కశ్మీర్ కొండల్లో  నేలకొరిగిన తెలుగుతేజం

కశ్మీర్ కొండల్లో నేలకొరిగిన తెలుగుతేజం

కశ్మీర్ కొండల్లో తెలుగు తేజంఆరిపోయింది. బందిపొరా జిల్లాలో బుధవారం సైన్యానికి చెందిన ధ్రువ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నగరానికి చెందిన పైలట్ తాహీర్‌హుస్సేన్‌ఖాన్  దుర్మరణం చెందారు. దీంతో  కుత్బుల్లాపూర్‌కు చెందిన సూరారంలో విషాదఛాయలు అలముకున్నాయి.
 
కుత్బుల్లాపూర్: ఆర్మీ పైలట్ అకాల మరణంతో రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ బిడ్డ ఇక  లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాలివీ... సర్వర్ ఉస్సేన్ ఖాన్, అఫ్సర్ బేగంలకు మేజర్ హుస్సేన్ ఖాన్, తాహీర్ హుస్సేన్ ఖాన్, మహ్మద్ హుస్సేన్ ఖాన్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండోకుమారుడు తాహీర్ హుస్సేన్ ఖాన్(28) ప్రస్తుతం కశ్మీర్‌లో మేజర్ ర్యాంక్‌లో ఉంటూ ఆర్మీ పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా వీరు వెళ్లిన హెలికాప్టర్ బుధవారం రాత్రి 7 గంటలకు కూలిపోయినట్టు 7.45 గంటల ప్రాంతంలో ఆర్మీ సిబ్బందికి సమాచారం అందింది. సూరారంలో ఉంటున్న తండ్రి సర్వర్ హుస్సేన్‌కు అదే రోజు రాత్రి వారు విషయాన్ని చెప్పారు. తాహీర్ అకాల మరణ వార్త విన్న కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. 2002-03లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరిన తాహీర్ హుస్సేన్ 2010లో ఆర్మీలో చేరారు.
 
దేశ సేవకే అంకితం


సర్వర్ హుస్సేన్ ఖాన్ రాజస్థాన్ కోటాబందిలో ఆర్మీలో సిపాయిగా పని చేస్తున్న సమయంలో చేతికి దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఆర్మీ అధికారులు 2002లో అతనికి రిటైర్‌మెంట్ ప్రకటించి... రామగుండం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశం కల్పించారు. భార్య అఫ్సర్ బేగంతో కలసి బిడ్డలను ఉన్నత చదువులు చదివించారు. ఆర్మీపై మక్కువతో సర్వర్ తన బిడ్డలనూ అదే దిశగా నడిపించాడు. మొదటి కుమారుడు మేజర్ హుస్సేన్ ఖాన్ ప్రస్తుతం గ్వాలియర్‌లో ఆర్మీ అడ్మినిస్ట్రేటర్ గా పని చేస్తుండగా...రెండో కుమారుడు తాహీర్ హుస్సేన్ ఖాన్(28) కశ్మీర్‌లో పెలైట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మూడో కుమారుడు మహ్మద్ హుస్సేన్ ఖాన్ బోయిన్‌పల్లి ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పని చేస్తున్నారు. సర్వర్ హుస్సేన్ అన్నదమ్ముల కుమారులు సైతం ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలోని వివిధ విభాగాల్లో పని చేస్తుండడం విశేషం.

పెళ్లయి ఏడాది తిరగకుండానే...

తాహీర్ హుస్సేన్ ఖాన్‌కు 2014 మే 30న నసీమ్‌సుల్తానాతో వివాహమైంది. ఇంతలోనే హెలికాప్టర్ ప్రమాద రూపంలో మృత్యువు అతన్ని బలిగొందనే వార్తను ఈ ప్రాంతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement