breaking news
Dhruv helicopter
-
భారత్ ‘ధ్రువ’ మాకొద్దు : మాల్దీవులు
న్యూఢిల్లీ : మిత్రబంధానికి నిదర్శనంగా భారత్ ఇచ్చిన ధ్రువ హెలికాప్టర్‌ను వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాల్దీవులు కోరింది. సముద్ర తలంపై నిఘా, తప్పిపోయిన నౌకలను వెతికేందుకు రెండు హెలికాప్టర్లను( వీటిలో ధ్రువ హెలికాప్టర్ ఒకటి) భారత్ మాల్దీవులకు ఇచ్చింది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఒప్పందాన్ని పొడిగించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. తాజాగా గడువు ముగియడంతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మాల్దీవులు భావిస్తోంది. ధ్రువ్ హెలికాప్టర్‌కు బదులు డార్నియర్ రవాణా విమానాన్ని ఇవ్వాలని మాల్దీవులు కోరుతున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. హిందూ మహా సముద్రంలో మన లక్షదీవులకు చేరువలో మాల్దీవులు ఉంది. భారత్‌కు రక్షణపరంగా ఎంతో వ్యూహాత్మకంగా ఉన్న మాల్దీవుల్లో 1100లకు పైగా దీవులు ఉన్నాయి. భారత్ మాల్దీవులకు ఎప్పటినుంచో రక్షణ కల్పిస్తూ వస్తోంది. అయితే, మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ యమీన్ గయూమ్ గద్దెనెక్కిన నాటి నుంచి చైనాతో సంబంధాలకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని దీవులను చైనాకు లీజుకు కూడా ఇచ్చారు. ప్రతిపక్ష నేతలను విడుదల చేయమని సుప్రీం కోర్టు తీర్పు అనంతరం మాల్దీవుల్లో 45 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి మధ్యవర్తిగా భారత్ మధ్యవర్తిత్వాన్ని ఆ దేశం తిరస్కరించింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం మాల్దీవుల్లో పాకిస్తాన సైన్యాధికారి జావేద్ బాజ్వా పర్యటించారు. కాగా, హెలికాప్టర్లను తిరిగి ఇవ్వడంపై మాల్దీవులతో భారత్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ధ్రువ హెలికాప్టర్లను శత్రువులపై వినియోగించకుండా ఉండే ఒప్పందంపై భారత్ ఇజ్రాయెల్‌కు కూడా లీజ్‌కు ఇచ్చింది. -
కశ్మీర్ కొండల్లో నేలకొరిగిన తెలుగుతేజం
కశ్మీర్ కొండల్లో తెలుగు తేజంఆరిపోయింది. బందిపొరా జిల్లాలో బుధవారం సైన్యానికి చెందిన ధ్రువ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నగరానికి చెందిన పైలట్ తాహీర్హుస్సేన్ఖాన్ దుర్మరణం చెందారు. దీంతో కుత్బుల్లాపూర్‌కు చెందిన సూరారంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుత్బుల్లాపూర్: ఆర్మీ పైలట్ అకాల మరణంతో రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ బిడ్డ ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాలివీ... సర్వర్ ఉస్సేన్ ఖాన్, అఫ్సర్ బేగంలకు మేజర్ హుస్సేన్ ఖాన్, తాహీర్ హుస్సేన్ ఖాన్, మహ్మద్ హుస్సేన్ ఖాన్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండోకుమారుడు తాహీర్ హుస్సేన్ ఖాన్(28) ప్రస్తుతం కశ్మీర్లో మేజర్ ర్యాంక్‌లో ఉంటూ ఆర్మీ పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా వీరు వెళ్లిన హెలికాప్టర్ బుధవారం రాత్రి 7 గంటలకు కూలిపోయినట్టు 7.45 గంటల ప్రాంతంలో ఆర్మీ సిబ్బందికి సమాచారం అందింది. సూరారంలో ఉంటున్న తండ్రి సర్వర్ హుస్సేన్‌కు అదే రోజు రాత్రి వారు విషయాన్ని చెప్పారు. తాహీర్ అకాల మరణ వార్త విన్న కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. 2002-03లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరిన తాహీర్ హుస్సేన్ 2010లో ఆర్మీలో చేరారు. దేశ సేవకే అంకితం సర్వర్ హుస్సేన్ ఖాన్ రాజస్థాన్ కోటాబందిలో ఆర్మీలో సిపాయిగా పని చేస్తున్న సమయంలో చేతికి దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఆర్మీ అధికారులు 2002లో అతనికి రిటైర్మెంట్ ప్రకటించి... రామగుండం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశం కల్పించారు. భార్య అఫ్సర్ బేగంతో కలసి బిడ్డలను ఉన్నత చదువులు చదివించారు. ఆర్మీపై మక్కువతో సర్వర్ తన బిడ్డలనూ అదే దిశగా నడిపించాడు. మొదటి కుమారుడు మేజర్ హుస్సేన్ ఖాన్ ప్రస్తుతం గ్వాలియర్‌లో ఆర్మీ అడ్మినిస్ట్రేటర్ గా పని చేస్తుండగా...రెండో కుమారుడు తాహీర్ హుస్సేన్ ఖాన్(28) కశ్మీర్లో పెలైట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మూడో కుమారుడు మహ్మద్ హుస్సేన్ ఖాన్ బోయిన్పల్లి ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పని చేస్తున్నారు. సర్వర్ హుస్సేన్ అన్నదమ్ముల కుమారులు సైతం ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలోని వివిధ విభాగాల్లో పని చేస్తుండడం విశేషం. పెళ్లయి ఏడాది తిరగకుండానే... తాహీర్ హుస్సేన్ ఖాన్‌కు 2014 మే 30న నసీమ్సుల్తానాతో వివాహమైంది. ఇంతలోనే హెలికాప్టర్ ప్రమాద రూపంలో మృత్యువు అతన్ని బలిగొందనే వార్తను ఈ ప్రాంతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.