ఇక ‘లక్ష’ణంగా ఆడపిల్ల పెళ్లి!

Financial assistance is increased to the kalyana lakshmi and shadhi Mubarak - Sakshi

     కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు ఆర్థిక సాయం పెంపు 

     రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచాలని నిర్ణయం 

     వచ్చే బడ్జెట్‌లో తగినన్ని నిధుల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: పేదింటి ఆడపిల్లకు ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనుంది. పెళ్లి కానుకగా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పేరుతో ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఈ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీలకు చెందిన నిరుపేద కుటుంబాల్లోని ఆడ పిల్లలకు పెళ్లి కోసం ప్రభుత్వం రూ.75,116 అందిస్తోంది. త్వరలోనే ఈ సాయాన్ని రూ.లక్షకు పెంచనుంది. వచ్చే బడ్జెట్‌లో అందుకు తగిన నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

సంక్రాంతి తర్వాత సీఎం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ముస్లిం కుటుంబాలకు షాదీ ముబారక్, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కల్యాణలక్ష్మి పేరుతో అమలు చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని బీసీలు, అగ్ర కులాల్లోని పేదలకూ విస్తరించింది. తొలుత రూ.51 వేల ఆర్థిక సాయా న్ని ఆడపిల్లల తల్లి పేరుతో చెక్కు రూపంలో అందించారు. 2017–18 బడ్జెట్‌లోనే ఈ ఆర్థిక సాయాన్ని రూ.75,116 కు పెంచింది.  

3 లక్షల మందికి కానుక.. 
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 3,02,856 మంది ఆడపిల్లలు పెళ్లి కానుక అందుకున్నారు. తొలి ఏడాది బడ్జెట్‌లో రూ.70 కోట్లతో ప్రారంభించిన ఈ పథకానికి ప్రభు త్వం లబ్ధిదారులు పెరిగిన కొద్దీ సరిపడా నిధులు కేటాయించింది. 2015–16లో రూ.388.66 కోట్లు, 2016–17లో రూ.530. 17 కోట్లు, 2017–18లో ఇప్పటి వరకు రూ.818.5 కోట్లు ఖర్చు చేసింది.

మొత్తం రూ.1807.33 కోట్లు వెచ్చించింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ఈ పథకం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారు. రాజకీయంగా కూడా ప్రయోజనకరంగా ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. అందుకే సాయాన్ని రూ.లక్షకు పెంచేందుకు సీఎం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top