
భారమైనా చట్టప్రకారం వెళ్లాల్సిందే
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటు విషయంలో కష్టమైనా, నష్టమైనా, భారమైనా చట్టాన్ని అనుసరించే వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టంచేశారు.
తెలంగాణ సర్కారుకు చంద్రబాబు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటు విషయంలో కష్టమైనా, నష్టమైనా, భారమై నా చట్టాన్ని అనుసరించే వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టంచేశారు. విభజనచట్టంలోనే కాకుండా ఇతర చట్టాల్లోనూ అన్నీ స్పష్టంగా ఉన్నాయని, వాటికి భిన్నంగా వెళ్లేందుకు వీల్లేదని చెప్పారు. క్యాంపుకార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ఎంసెట్ అడ్మిషన్లపై తెలంగాణ సీఎంకు ఒక లేఖ రాశాను. ఆలస్యమైతే ఏపీ, తెలంగాణ పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవకాశముంది. దీనివల్ల ఆయా సంస్థలు దెబ్బతింటాయని లేఖలో స్పష్టం చేశాను’’ అని వివరించారు. తాను వచ్చేవారం నుంచి వారానికి రెండురోజులు జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు.