మూడుగంటల్లో ముచ్చెమటలు | Cardon Search in borabanda | Sakshi
Sakshi News home page

మూడుగంటల్లో ముచ్చెమటలు

Apr 11 2016 12:54 AM | Updated on Sep 3 2017 9:38 PM

మూడుగంటల్లో ముచ్చెమటలు

మూడుగంటల్లో ముచ్చెమటలు

200 మంది పోలీసు బలగాలు....ఉన్నట్టుండి ఆ ప్రాంతాన్ని నలువైపులా చట్టేశాయి. గడప గడపనూ తట్టి అణువణువూ సోదాలకు దిగారు

సమయం :      ఆదివారం తెల్లవారుజామున 3 గంటలు...
ప్రాంతం   :      బోరబండ సమీపంలోని అల్లాపూర్...



200 మంది పోలీసు బలగాలు....ఉన్నట్టుండి ఆ ప్రాంతాన్ని నలువైపులా చట్టేశాయి.  గడప గడపనూ తట్టి అణువణువూ సోదాలకు దిగారు.....అప్పటివరకు నిద్రలో ఉన్న  బస్తీ మొత్తం  క్షణాల్లో మేల్కొంది...స్థానికులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి...మూడంటే మూడు గంటల్లోనే 64 బైక్‌లు..20 ఆటోలు...ఒక జీపు...మొత్తం 71 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడం పోలీసు వర్గాలనే విస్తుగొల్పింది. ఇదీ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోరబండ అల్లాపూర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో నెలకొన్న దృశ్యాలు. వివరాలు ఇలా ఉన్నాయి. సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు 15 రోజులకోమారు నిర్వహించే కార్డన్‌సెర్చ్‌లో భాగంగా అల్లాపూర్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ నంద్యాల నర్సింహ్మరెడ్డి, సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డిల ఆధ్వర్యంలో క్రైమ్, ఎస్‌ఓటీ, సీసీఎస్‌లకు చెందిన 200 మంది పోలీసు సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి సోదాలు జరిపారు. ఇందులో ధృవపత్రాలు లేని మొత్తం 85 ద్విచక్ర, త్రీవీలర్స్ ఫోర్‌వీలర్స్ వాహనాలను పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.


71 మందిని అదుపులోకి తీసుకోగా ఇందులో ఒక రౌడీషీటర్, ఒక చైన్‌స్నాచర్, ఇద్దరు మట్కా జూదరులు, నలుగురు దోపిడీదారులు, ఐదుగురు దొంగలు, 20 మంది ఆటో, 38 మంది బైక్ దొంగలుగా అనుమానిస్తూ వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే ధ్రువపత్రాలు చూపించిన వారికి తమ వాహనాలను అప్పగించగా, మిగిలిన వాహనాలను పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కార్డన్ సెర్చ్‌తో సామాన్య ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని తెలిపారు. పాత నేరస్థులు సైతం కార్డన్‌సెర్చ్ ద్వారా వెలుగులోకి వస్తున్నారని తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉమెన్స్ కానిస్టేబుల్స్‌తోనే ఇళ్ళలో సోదాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి తనిఖీలు ద్వారా తమ బస్తీలు, కాలనీల్లో ఉండే నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటున్నందున ప్రజలు కూడా పూర్తిగా తమకు సహకారం అందిస్తున్నారన్నారు. స్థానికులు కూడా కాలనీ, బస్తీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే అటువంటి వారిపై పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement