బెంబేలెత్తిస్తున్న క్యాన్సర్

బెంబేలెత్తిస్తున్న క్యాన్సర్


- ప్రభుత్వ ఉద్యోగుల క్లెయిమ్‌లలో అత్యధికం ఈ వ్యాధివే..

- మొత్తం 40వేల కేసుల్లో క్యాన్సర్ బాధితులు 12 వేలు..

- 80 శాతం బాధితులు మహిళలు..

- రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అధికం

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో కేన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అధికంగా దీని బారిన పడుతున్నట్లు తేలింది. వైద్యవిద్యా శాఖకు వస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులను బట్టి చూస్తే అత్యధికంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్టు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొంది ఆ తర్వాత ఆ డబ్బును రీయింబర్స్ చేసుకోవడం కోసం వైద్య విద్యా సంచాలకులకు పరిశీలనకు దరఖాస్తులు పంపిస్తారు.



ఇలాంటి దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా ఏటా 40 వేలకుపైగా వస్తున్నాయి. ఇందులో 12 వేలు కేవలం క్యాన్సర్‌వే ఉండటం గమనార్హం. ఈ 12వేల కేసుల్లో 8 వేల మంది మహిళా ఉద్యోగులే ఉన్నారు. ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో వైద్యం పొందిన వారు ఉన్నారు. ఇక పురుషుల్లో ఓరల్ క్యాన్సర్ అంటే గుట్కాలు, కిల్లీలు, పాన్‌మసాలాల కారణంగా నోటి క్యాన్సర్ బాధితులు, ఊపిరితి త్తుల క్యాన్సర్ బాధితులు 4వేల మంది ఉన్నా రు. వయసుల వారీగా చూస్తే మహిళల్లో ఎక్కు వ మంది 40 నుంచి 50 ఏళ్లలోపు వారున్నారు. పురుషుల్లో 45 ఏళ్లు పైబడిన వారున్నారు.



 గుండె, మూత్రపిండాల వ్యాధులూ అధికం

 మొత్తం 40 వేల మందిలో 12 వేల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉండగా.. మూత్ర పిండాల వ్యాధులు, గుండె జబ్బు బాధితులు తర్వాతి స్థానంలో ఉన్నారు. ఏటా 8 వేల నుంచి 9 వేల వరకూ కిడ్నీ జబ్బులతోనూ, 10 వేల గుండె జబ్బుల బాధితులు దరఖాస్తులూ ఇక్కడకు వస్తున్నాయి. కిడ్నీ, గుండె జబ్బుల బాధితుల్లో 15 శాతం మహిళలుండగా, 85 శాతం పురుషులున్నారు. ఇక గుండె జబు బాధితుల్లో 40 ఏళ్లలోపు వయసున్న వారే అధికం. రాష్ట్రంలో మధుమేహ వ్యాధి అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతూండటంతో ఎక్కువ మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. వీరిలో 50 ఏళ్ల వయసువారు ఎక్కువగా ఉన్నారు. వీళ్లందరూ డయాలసిస్ దశలో చికిత్స పొందుతున్న వారే. క్యాన్సర్, గుండె, మూత్రపిండాల వ్యాధులకు చెందిన వారే 30 వేలుండగా, మిగతా వ్యాధులతో చికిత్స పొంది దరఖాస్తు చేసుకున్న వారు 10 వేల మంది. దీన్నిబట్టి ఈ మూడు జబ్బుల తీవ్రత ఏంటో అర్థమైపోతుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top