
పన్ను కట్టు..బహుమతి పట్టు
మే నెలలో చివరి మూడు రోజుల్లో ఆస్తిపన్ను చెల్లించిన వారికి లక్కీడ్రా ద్వారా రూ. 5 లక్షల విలువైన నగదు
ఆస్తిపన్ను చెల్లింపుదార్లకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్
జూన్‌లో ప్రతివారం లక్కీడ్రా
మే నెలలో రూ.లక్ష గెలుచుకున్న బాపిరెడ్డి
సిటీబ్యూరో: మే నెలలో చివరి మూడు రోజుల్లో ఆస్తిపన్ను చెల్లించిన వారికి లక్కీడ్రా ద్వారా రూ. 5 లక్షల విలువైన నగదు బహుమతులు అందజేస్తున్న జీహెచ్‌ఎంసీ ప్రజల్లో వార్షిక సంవత్సరం ఆరంభంలోనే ఆస్తిపన్ను చెల్లించేలా అలవాటు చేసేందుకు జూన్ నెలలో వారం వారం లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఇకపై ప్రతివారం ఆస్తిపన్ను చెల్లించిన వారి పేర్లను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి వారానికి రూ. 3లక్షల మేర నగదు బహుమతులు అందజేయనున్నారు. జూన్ 1 నుంచి 7వ తేదీ లోగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 8న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. మేనెల 29, 30, 31 తేదీల్లో ఆస్తిపన్ను చెల్లించిన వారికి బుధవారం సాయంత్రం లక్కీడ్రా నిర్వహించగా, రూ. 51 ఆస్తిపన్ను బకాయి చెల్లించిన మల్కాజిగిరి సర్కిల్‌లోని నేరెడ్‌మెట్ కాకతీయనగర్‌కు చెందిన జి. బాపిరెడ్డి రూ. లక్ష బంపర్ ప్రైజ్ దక్కించుకున్నారు. మొదటి బహుమతికి ఆబిడ్స్ (9ఎ) సర్కిల్ పరిధిలోని డయారా ప్రాంతానికి చెందిన పి. ఆశ ఎంపికయ్యారు. రెండో బహుమతి రూ. 25 వేల చొప్పున చార్మినార్ సర్కిల్ (4బి)లోని సరూర్ నగర్‌కు చెందిన ఎం. సునీత, ఖైరతాబాద్ (సర్కిల్ 10ఎ) ఎల్లారెడ్డిగూడకు చెందిన వారు ఎంపికయ్యారు.
రూ.10వేల చొప్పున మూడో బహుమతి ఐదుగురికి, రూ. 5వేల చొప్పున, నాలుగో బహుమతి 10 మందికి, రూ. 2వేల చొప్పున, 100 మంది కన్సొలేషన్ బహుమతులకు గాను ఆన్‌లైన్‌లో ర్యాండమైజేషన్ ద్వారా డ్రా తీశారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి విజేతల పేర్లను ప్రకటించారు. వారం వారం తీసే డ్రాలో బంపర్ బహుమతిగా రూ. లక్ష పాటు రూ. 25,000 , రూ.12,500, రూ.5, 000, రూ. 1,000 చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రజలు ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్స్‌ఫీజులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. జూన్ నెలాఖరులోగా ఆస్తిపన్ను చెల్లించని పక్షంలో జూలై ఒకటి నుంచి ప్రతినెలా రెండు శాతం చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు విద్యుత్,నీటి బిల్లుల మాదిరిగా ఆస్తిపన్నును కూడా నెలనెలా చెల్లించే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మేనెలలో రూ. 12.92 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాగా, ఈ ఏడాది మేలో రూ. 24. 37 కోట్లు వసూలయ్యాయన్నారు. ట్రేడ్ లెసైన్సు ఫీజులు రూ. 29.20 కోట్లు వసూలైనట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు సురేంద్రమోహన్, రామకృష్ణారావు, శంకరయ్య, కెనెడి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.