ఆర్టీసీ ‘ప్రైవేటు’యోచనలో ఏపీ సర్కారు! | ap government thinks privatization of RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ‘ప్రైవేటు’యోచనలో ఏపీ సర్కారు!

Aug 20 2014 1:42 AM | Updated on Jul 29 2019 5:31 PM

ఆర్టీసీ ‘ప్రైవేటు’యోచనలో ఏపీ సర్కారు! - Sakshi

ఆర్టీసీ ‘ప్రైవేటు’యోచనలో ఏపీ సర్కారు!

నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని వదిలించుకునే యోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆర్టీసీని తీసుకోవడానికి గతంలో రిలయన్స్ సంస్థ చేసిన ప్రతిపాదనలపై మళ్లీ ప్రభుత్వవర్గాల్లో చర్చ మొదలైంది.

రిలయన్స్ ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి!

సాక్షి, హైదరాబాద్: నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని వదిలించుకునే యోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆర్టీసీని తీసుకోవడానికి గతంలో రిలయన్స్ సంస్థ చేసిన ప్రతిపాదనలపై మళ్లీ ప్రభుత్వవర్గాల్లో చర్చ మొదలైంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సర్కారు స్వాధీనం చేసుకోవడం లేదా ప్రైవేటు పరం చేయడమే ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనలని, వాటిలో ఏదో ఒకటి అనుసరించక తప్పదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
 
నష్టాల్లో ఉన్న సంస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని, అందువల్ల ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతోందని ఆ వర్గాలు తెలిపాయి. అధికారవర్గాల కథనం ప్రకారం.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టీసీని తీసుకోవడానికి రిలయన్స్ సంస్థ షరతులతో కూడిన ప్రతిపాదనలు చేసింది. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లను మాత్రమే తీసుకుంటామని, మిగతా పైస్థాయిలో ఉద్యోగుల అవసరం లేదని చెప్పింది. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు మరింత మెరుగైన వేతనాలిచ్చేందుకు ప్రతిపాదించిది. ఆర్టీసీలో మొత్తం 65 వేల మంది ఉద్యోగులున్నారు.
 
వీరిలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు 30 వేల మంది ఉంటారు. మిగతా 35 వేల మంది పైస్థాయిలో ఉద్యోగులే. పైస్థాయి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే వీఆర్‌ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) ఇవ్వాలని ఆ సంస్థ సూచించింది. వీరికి రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఎస్ ఇవ్వాలంటే రూ. 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలే ఉన్నందున ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఆమేరకు వీఆర్‌ఎస్ ఖర్చూ తగ్గుతుంది. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున, రిలయన్స్ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పరిశీలించే అవకాశముంది.
 
ఆర్టీసీకి రెండు నెలల క్రితం రోజుకు రూ.2.5 కోట్లు నష్టం వచ్చేదని, ఇప్పుడది రోజుకు రూ. 3 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాలు రూ. 2,600 కోట్లకు చేరాయని అధికారవర్గాలు తెలిపాయి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే ఆర్టీసీని ప్రైవేటు పరం  చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేసిన విషయాన్ని అధికారులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ప్రపంచ బ్యాంకు సంస్కరణల జాబితాలో ఆర్టీసీని, సింగరేణిని కూడా చేర్చారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇప్పుడు మళ్లీ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు చేసి మరీ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు వెనుకాడరని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement