‘బ్లాక్’ ముఠా ఆటకట్టు | 120 Quintals ration rice cought in ramgopal pet | Sakshi
Sakshi News home page

‘బ్లాక్’ ముఠా ఆటకట్టు

Dec 8 2015 4:16 AM | Updated on Apr 3 2019 4:10 PM

‘బ్లాక్’ ముఠా ఆటకట్టు - Sakshi

‘బ్లాక్’ ముఠా ఆటకట్టు

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్ తరలిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌పోర్స్ పోలీసులు రట్టు చేశారు.

120 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
 గ్యాంగ్‌లోని నలుగురి అరెస్టు
 రాంగోపాల్‌పేట్:
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్ తరలిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌పోర్స్ పోలీసులు రట్టు చేశారు. గ్యాంగ్‌లోని నలుగురిని అరెస్టు చేసి 120 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  సోమవారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...  కిషన్‌బాగ్‌కు చెందిన ఆటోడ్రైవర్ సయ్యద్ ఫిరోజ్, మున్వర్ (కిషన్‌బాగ్)లు హమాలీ మహ్మద్ ఇమ్రాన్, ఫరీద్ (జహీరాబాద్), మహ్మద్ అబ్దుల్ అల్మాస్ (కాలాపత్తర్)లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు.  
 
 వీరు మంగళ్‌హాట్ జెన్సీచౌరాకు చెందిన రేషన్ డీలర్ ఓంప్రకాశ్‌తో పాటు నగరంలోని పలువురు రేషన్ డీలర్ల నుంచి కిలో రూపాయి బియ్యాన్ని రూ.14 చొప్పున కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. డీలర్ ఓంప్రకాశ్ ప్రభుత్వం నుంచి తనకు వచ్చే కోటా బియ్యంలో సగం మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేసి.. మిగతా ‘సరుకు’ను మున్వర్, ఫిరోజ్‌లకు విక్రయిస్తున్నాడు. అలాగే కొందరు కార్డుదారులు రేషన్ బియ్యాన్ని కిలో రూ.10కి కిరాణాషాపుల్లో విక్రయిస్తున్నారు. వీటిని కూడా మున్వర్, ఫిరోజ్ ధ్వయం కిరాణా యజమానుల నుంచి కొనుగోలు చేస్తోంది. వివిధ మార్గాల్లో సేకరించిన బియ్యాన్ని జహీరాబాద్‌లో ఉన్న గోడౌన్‌కు తరలిస్తారు.
  ఆ గోడౌన్ ఇన్‌చార్జిగా మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వ్యవహరిస్తున్నాడు. ఇతనికి స్థానికుడు ఫరీద్  సహకరిస్తున్నాడు.
 
 ఇతర రాష్ట్రాలకు విక్రయం:ఇలా పెద్ద మొత్తంలో బియ్యాన్ని సేకరించి ఏడాది పాటు భద్రపరుస్తారు.  బియ్యానికి రేటు రాగానే రైస్ మిల్లులకు తరలించి వాటిని పాలిష్ పట్టి  సన్న బియ్యంగా మారుస్తారు. ఈ బియ్యాన్ని అధిక ధరకు కర్ణాటక, జహీరాబాద్, బోధన్ తదితర ప్రాంతాలకు తరలించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల కిషన్‌బాగ్‌లోని ఓ గోడౌన్‌లో రేషన్ బియ్యం అక్రమంగా దాచి బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు ఉంచారన్న సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సివిల్ సప్లై అధికారులు కలిసి దాడులు నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా అక్రమంగా భద్రపరిచిన 250 బ్యాగుల్లోని 120 క్వింటాళ్ల బియ్యాన్ని, గోధుమలు, డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని నలుగురిని అరెస్టు చేయగా మున్వర్, ఫరీద్ తప్పించుకున్నారు. ఈ ముఠా కొన్నేళ్లుగా ఈ బ్లాక్ మార్కెట్ దందా చేస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సమావేశంలో వెస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్ రాజా వెంకటరెడ్డి, ఎస్సైలు జలంధర్‌రెడ్డి, మల్లికార్జున్, వెంకటేశ్వరగౌడ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement