లంచాల రేట్లు పెరిగాయ్‌!

Why The Rates Is Growup - Sakshi

అక్షర తూణీరం 

ఎద్దువెనక నక్కలాగా మోదీ వెనుక బాబు ఏదో ఆశించి తిరిగారు. ముప్ఫై ఢిల్లీ విజిట్లవల్ల విమానం ఖర్చులు తప్ప ఒక్క హామీ కూడా సాధించలేక పోయారు.

‘‘గత కాలము మేలు...’’ అని జనం అనుకుంటు న్నారు. మోదీ పాలనపై నాలుగేళ్ల తర్వాత సమీక్షించు కుంటే వెలితిగా అనిపిస్తోంది. ఆనాడు వాజ్‌పేయి పాలిం చింది నికరంగా నాలుగేళ్లే అయినా జనహితానికి ఎన్నో కొండ గుర్తులు సృష్టించారు. కేవలం ఈ నెలల వ్యవధిలో మోదీ ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందనే ఆశ లేదు. వచ్చీ రాకుండానే నల్ల ధనవంతుల మీద, అవినీతి మీద రంకెలు వేశారు. ఒక్క రూపాయి నల్లధనం దొరకలేదు. చెలామణిలో ఉన్న కరెన్సీని బూడిద చేసి కొత్త రంగుల్లో కొత్తనోట్లు వదిలారు. పెద్ద నోట్ల రద్దుతో ఖజానాకి వరదొస్తుందని చెప్పారు. ఏమీ రాలేదు. పాపం, గ్రామా లలో వయోవృద్ధులు, అమాయకులు వారు ప్రాణపదంగా దాచుకున్న పెద్ద నోట్లు పనికిరాకుండా పోయాయి. ఆనాటి ప్రభుత్వం మూడు సింహాల ముద్రతో, రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ గారి చేవ్రాలుతో ఇచ్చిన ప్రామిసరీ నోటుకి మర్యాద, విలువ లేకుండా పోయింది.

ఆనాటి రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ వద్దన్నా వినకుండా ఏక పక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మోదీ మీద అభియోగం. అవినీతి ఆగలేదు. ఎమర్జెన్సీ రోజుల్లో లాగే, రిస్క్‌ పెరిగిందని అవినీతికి రేట్లు పెంచారు. ఉన్నత స్థాయిలో కుంభకోణాలు లేవని గుండీలమీద చేతులేసుకుని చెబుతున్నారు. మహా స్కాముల్ని రాజకీయ లబ్ధి కోసం నిర్వీర్యం చేయడం స్కాం కాదా అంటున్నారు. గెలుపు కోసం ఈశాన్య రాష్ట్రాలలో కరెన్సీని కురి పించలేదా అని ప్రత్యక్ష సాక్షులు నిగ్గతీస్తున్నారు. వెంకయ్యనాయుడిని జన జీవన స్రవంతి నుంచి వేరు చేసి, ఏనుగు అంబారీ ఎక్కించడం మాత్రం మోదీ గొప్ప ఎత్తుగడగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.ఆనాడు మోదీని ఎంత గ్లామరస్‌గా ప్రదర్శించినా, దక్షిణాది రాష్ట్రాలలో ఆ పప్పులు ఉడకలేదు. ఉత్తరాదిలో అప్పటికే కాంగ్రెస్‌ కొడి గట్టడం, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మహాద్భుతాలు చేశారన్న ప్రచారం అటు బాగా పనిచేసింది. మోదీని నిలబెట్టింది. వస్తు, సేవల పన్ను విధానానికి కావల్సిన మెజార్టీ సాధించి నెగ్గించగలిగారు.

అర్ధరాత్రి జీరో అవర్‌లో జీఎస్టీ పండుగని పార్లమెంట్‌ భవనంలో జరిపి, నాటి స్వాతంత్య్రోత్సవాన్ని తలపించారు. సంతోషం. పన్నులకు తగిన సేవలు లేవని జనం గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడా టౌన్లకి సరైన రోడ్లు లేవు. వీధి దీపాలు లేవు. డ్రైనేజీ లేదు. రక్షిత మంచినీరు లేదు. ఇప్పుడే గ్రామాలమీద దృష్టి పడింది. గ్రామాలంటే రైతులు. వాళ్ల ఓట్ల కోసం ఒక్కసారిగా ఇవ్వాళ గ్రామాలు గుర్తొచ్చాయి. స్వచ్ఛ భారత్‌ జరిగిన దానికంటే ప్రచారం అధికంగా జరుగుతోంది. పెద్ద నగరాలలో, అనేకానేక కాలనీలలో చెత్త పేరుకు పోతోంది. బ్యాంకింగ్‌ రంగం అనేక కారణాలవల్ల ఎన్‌.పీ.ఏ.గా తయారైంది. బడా బాబులకి వేలాది కోట్లు ధార పోసింది. మోదీ జన్‌ధన్‌ పథకం సామాన్యులకి ఏమి ఒరగబెట్టిందో తెలియదు. ‘మనసులో మాట’ వినడానికి బావుంది. తాజాగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లని మోదీ పైకి ఉసికొల్పుతున్నారు. మోదీ, వైఎస్సార్‌సీపీ కలిసిపోయి కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని చంద్రబాబు అభియోగం. ఎద్దువెనక నక్కలాగా మోదీ వెనుక చంద్రబాబు ఏదో ఆశించి తిరిగారు. కానీ ఏమీ రాలేదు. ముప్ఫై ఢిల్లీ విజిట్లవల్ల విమానం ఖర్చులు తప్ప ఒక్క హామీ కూడా సాధించలేక పోయారు. అందుకని ఆదికవి నన్నయ అన్నట్టు గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌.


(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top