ఆత్మస్తుతి–పరనింద

Sriramana Guest Column On Chandrababu Naidu Blame On YS Jagan - Sakshi

అక్షర తూణీరం 

ఫలానా వారు పవర్‌లో వుండగా కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. అతి పెద్ద సంస్థ నిర్ధారించగానే ‘బాబోయ్‌ యిందులో అక్రమాలు లేవు కేవలం కక్ష సాధింపు చర్య’’ అంటూ ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగడం పరిపాటే! ఇది యిప్పుడు మొదలైన సీన్‌ కాదు అనాదిగా వస్తున్నదే. అక్రమాలు చేసిన వారెవరైనా ‘‘చేశాం’’ అని అంగీకరిస్తారా? ఇక అలా అంగీకరిస్తే ధర్మం నాలుగు పాదాలు నడుస్తున్నట్టే లెక్క. ఇక అప్పుడు సీబీఐలు, సిట్‌లు, కోర్టులు ధర్మాసనాలతో పని ఏముంది. ఎప్పుడు రాజకీయం ఒక ఖరీదైన వ్యాపారంగా మారిందో ఇక అప్పుడంతా బ్రోకరేజీలే మిగిలాయి. చంద్రబాబుకి పుట్టుకతో వచ్చిన వీక్‌నెస్‌ ఒకటుంది. అదేంటంటే ఆయన మాత్రమే కుర్చీలో కూర్చోవాలనే ప్రగాఢ వాంఛ. జగన్‌ పవర్‌లోకి వస్తారని చంద్రబాబు కలలో కూడా  ఊహించలేదు. దృశ్యం తిరగబడేసరికి ఆయన పూర్తిగా తూకం కోల్పోయారు. జగన్‌ ఏడాది పాలనలో జరిగిన ఏ మంచిమార్పుని బాబు హర్షించలేక పోయారు. అన్నింటికీ ఏవో స్వప్రయోజనాలున్నాయని జనంలోకి నిత్యం వచ్చే ప్రయత్నం చేశారు. దాంతో లీడర్‌గా చంద్రబాబు క్రెడిబిలిటీ బొత్తిగా అడుగుమాడిపోయింది. ఇప్పుడాయన దేశభక్తిగీతం పాడినా జనం నమ్మే స్థితిలో లేరు.   

తనుకాకుండా ఇతరులెవరు కుర్చీలో వున్నా చంద్రబాబు రోజులు లెక్కపెట్టుకుంటూ వుంటారని ఆయన వర్గీయులే అనుకుంటూ వుంటారు. యన్టీఆర్‌నే లాగేసి తాను∙కుర్చీ ఎక్కిన అసహనం గురించి అందరికీ తెలుసు. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ప్రజాధనం దారి తప్పిందని అప్పుడే జనం కనిపెట్టారు. దానికి సాక్ష్యం భయంకరమైన ఓటమి. ప్రస్తుత వలసల్ని చూస్తుంటే పార్టీలో చంద్రబాబు కూడా మిగుల్తారో లేదో అని సందేహంగా ఉంది. అతి త్వరలో ప్రతిపక్ష హోదా జారిపోవడం మాత్రం ఖాయం. 

జగన్‌ పాలనలో అధికార వికేంద్రీకరణ గ్రామ సచివాలయ పథకం మీకు  నచ్చలేదా? అలాగే దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని, దాన్ని  అమలు చేయడం తమరికి నచ్చలేదా? స్త్రీ జన పక్షపాతిగా, రైతుమిత్రగా జగన్‌ యిప్పటికే మన్ననలు అందు కుంటున్నారు. ఆలకించేవారికి, అమలు చేసేవారికి నిజంగా పనికొచ్చే సూచనలు చెయ్యాలనిపిస్తుంది. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పక్షాన కొందరు వాలంటీర్లు బాధ్యతగా రాత్రి, పగలు పనిచేస్తున్నారు. బాగుంది. 1980 దశకంలో తమిళనాడు నాటి జననేత ఎమ్‌జీఆర్‌ ఒక పథకం ప్రవేశపెట్టారు. పట్టణాలలో, నగరాలలో ఉద్యోగకల్పన, ఉపాధి కల్పన కోసం ఐటీఐలాంటి చిన్నచిన్న సాంకేతిక చదువులు చదివిన వారికోసం వూరూరా స్వయం ఉపాధి కేంద్రాలు ప్రారంభించారు. నగర సెంటర్లో ఒక గది, అక్కడ అందుబాటులో ఒక ఫోను వుండేది. అక్కడ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, ఇతర సాంకేతిక నిపుణులు ఒకే వెంచర్లో పిలిస్తే పలికేవారు.

ఏ పనులున్నా పిలవగానే వచ్చి చేసి వెళ్లేవారు. పనినిబట్టి ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు తీసుకుని వెళ్లేవారు. ఇప్పుడు యీ స్కీమ్‌ని ఏపీ ప్రభుత్వం కొన్ని కూర్పుచేర్పులతో అమలులోకి తేవచ్చు. అప్పట్లో పనిచేసి ఆర్మీనించి వచ్చేసిన వారు సెక్యూరిటీ గార్డ్స్‌గా సేవలందించేవారు. ఎన్నోరకాల సర్వీసులు లభించేవి. ట్రాక్టర్, కారు డ్రైవర్లు పిలిస్తే పలికేవారు. దీనివల్ల నిత్యం చాలామందికి సిటీల్లో పని దొరికేది. జగన్‌ సర్కార్‌ దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి చూడవచ్చు. కావాలంటే వారికి సాధారణ భృతిగా నెలకి రెండుమూడు వేలు ప్రభుత్వం ప్రోత్సాహకరంగా చెల్లించవచ్చు. ఇవి పల్లెల్లోనే కాదు విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాలలో ఎక్కువ వుపయోగపడతాయి. కనీసం పదిమందికి మెరుగైన ఉపాధి చేకూరుతుంది. కొన్ని ప్రత్యేక  సందర్భాలలో వారంతా ప్రభుత్వ వాలంటీర్లుగా కోరిన సేవలు అందిస్తారు. చంద్రన్న నిరుద్యోగ భృతిద్వారా మోసపోయిన యువతకి కొంత ఊరట కూడా. 

మన దేశం పల్లెలు పునాదులుగా పుట్టి పెరిగింది. చంద్రబాబు దృష్టిలో పల్లెలకు గౌరవం లేదు. వ్యవసాయం లాభసాటి కాదని ఆయనకు గట్టి నమ్మకం. ఆ కారణంగా గ్రామాలను ఓట్లకోసం తప్ప యితర విషయాల్లో పక్కన పడేశారు. మనం తినే ప్రతి మెతుకు పల్లెసీమలే పండించి యిస్తాయని చంద్రబాబు ఎన్నడూ అనుకోలేదు. కొన్ని పరిశ్రమలు ఉదాహరణకి చక్కెర మిల్లులు, రైస్‌ మిల్లులు లాంటివి పల్లెల్లో వర్ధిల్లుతాయి. చంద్రబాబు హయాంలో అవి కూడా బతికి బట్టకట్టలేదు. రైస్‌ మిల్లులు సైతం పట్టణాలకి పారిపోయా యి. ‘‘దేశమంటే మట్టికాదోయ్‌! దేశమంటే రియల్‌ ఎస్టేటోయ్‌’’ అనే నినాదం తెచ్చిన మహనీయుడు చంద్రబాబు. అందుకే కామన్‌ క్యాపిటల్‌కి పదేళ్లు గడువున్నా అమరావతికి పునాదులు వేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ముందస్తుగానే తెరతీశారు. ఇప్పుడు, రేపు, ఎల్లుండి జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమిచేసినా అది కక్షసాధింపు సెక్షన్‌ కిందకే వస్తుంది. జనం గమనిస్తూనే వున్నారు. మనం అచ్చువేయించిన కరపత్రాల్ని మనమే చదువుకుని సంబరపడితే ప్రయోజనం లేదు. నిజాలు నిక్కచ్చిగా గ్రహించాలి. కక్షసాధింపా, శిక్ష సాధింపా కాలం నిర్ణయిస్తుంది.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top