బలవంతుల గుప్పెట్లో నిఘా వ్యవస్థలు

Srinivas Kodali Article On Intelligence Agency - Sakshi

విశ్లేషణ

సమాజంలో కొందరు వ్యక్తులను, సంస్థలను ముందుగానే లక్ష్యంగా చేసుకుని, వారిపై భారీస్థాయిలో సాగిస్తున్న నిఘాపై చట్టం తీసుకురావలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పైగా జాతీయ భద్రత పేరిట పౌరుల ప్రాథమిక హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసివేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. మన భద్రతా యంత్రాంగం మన ఫోన్లను ఎలా ట్యాప్‌ చేస్తోంది, మన ట్వీట్లను ఎలా అడ్డుకుంటోంది అని ఎవరైనా అడిగితే నిఘా సంస్థలు చూపే ఏకైక కారణం ఈ జాతీయ భద్రతే మరి. నిఘాను ఏయే పద్ధతుల్లో కొనసాగిస్తున్నారో మనం తెలుసుకోనంతవరకు నిఘాపై భవిష్యత్తులో తేబోయే ఏ చట్టం కూడా సమర్థవంతంగా అమలు కాదు. భారత్‌లోనూ, భారత్‌ వెలుపల ఉన్న పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ నిఘా వ్యవస్థలను ఎలా సేకరించి, ఉపయోగిస్తున్నారన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.

భారతీయ సామాజిక, రాజకీయ కార్యకర్తలపై గూఢచర్యం జరపడానికి అధికారంలో ఉన్న శక్తులు ఇజ్రాయెల్‌ స్పైవేర్‌ అయిన పెగాసస్‌ను ఉపయోగిస్తున్నారన్న వార్త దేశంలోని అనేకమంది మానవ హక్కుల సమర్థకులు, పౌర సమాజ సభ్యులకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎవరికైనా ఆశ్చర్యం కలిగిందంటే మన దేశంలో ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు, ఎవరిని చేసుకోలేదు అని తెలుసుకోవడం కోసమే కావచ్చు. గోప్యతా చట్టం, నిఘారంగ సంస్కరణల అవసరాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న దేశంలో సాంకేతిక పరిజ్ఞానం మన ప్రాథమిక హక్కులపై ఎంత తీవ్ర ప్రభావం వేస్తున్నదో తెలుసుకోవాలనుకుంటున్న వారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటారు. వారికి సమాధానాలు కనుచూపు మేరలో దొరకవనుకోండి.

ఈ ముఖ్య అంశం లోతుల్లోకి వెళ్లి పరిశీలించడంపై ప్రభుత్వవర్గాలు ఆసక్తి చూపడం లేదని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఇటీవల చేసిన ప్రకటనలు అత్యంత స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి. భారత్‌లో రాజ్యవ్యవస్థ, దాని ఏజెంట్లు ఎలా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయనే అంశంపై ప్రజలకు సమాచారం తెలియజేయడం పట్ల వీరికి కించిత్‌ శ్రద్ధా లేదని ఈ ప్రకటనలు తెలుపుతున్నాయి.

సమాజంలో ముందే లక్ష్యాలను ఎంచుకుని, భారీస్థాయిలో సాగిస్తున్న నిఘాపై చట్టం తీసుకురావలసిన అవసరం ఉందని  పుట్టస్వామి వర్సెస్‌ కేంద్రప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పైగా జాతీయ భద్రత పేరిట పౌరుల ప్రాథమిక హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసివేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. మన భద్రతా యంత్రాంగం మన ఫోన్లను ఎలా ట్యాప్‌ చేస్తోంది, మన ట్వీట్లను ఎలా అడ్డుకుంటోంది అని ఎవరైనా అడిగితే నిఘా సంస్థలు చూపే ఏకైక కారణం ఈ జాతీయ భద్రతే మరి. 

వ్యవస్థలు విఫలం కావడం, డేటా రక్షణ చట్టం ఏదీ లేకపోవడం వల్ల పెగాసస్, వాట్సాప్‌ నిర్వాకాలకు సంబంధించి సమాధానాలు రాబట్టడం కోసం మనం ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది? దిగ్భ్రాంతి కలిగిస్తున్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, ఈ మొత్తం హాస్యాస్పద విషయం గురించి మనం ఎన్నటికైనా తెలుసుకోగలమా అంటే ఎన్నో పరిమితులు ఉంటాయనే చెప్పుకోవాలి. నిఘా నీడలో ఉంటున్న భారతీయ ప్రజారాశులను, వ్యక్తులను వాట్సాప్‌ సంస్థ హెచ్చరించవచ్చు కానీ ఏ సమాచారాన్ని సేకరించారు, ఏ ఉద్దేశంతో సేకరించారు అనేది వాట్సాప్‌కు కూడా తెలిసి ఉండదు.

ఈ స్పైవేర్‌ని సరఫరా చేసిన ఇజ్రాయెల్‌కి చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ని భారతీయ చట్టాల పరిధిలో విచారించవచ్చు కానీ భోగోళిక పరిమితులు, ఇజ్రాయెల్‌ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం నెరుపుతున్న సంబంధ బాంధవ్యాలు ఈ విచారణకు సమస్యగా మారవచ్చు. స్వదేశానికి సంబంధించినంతవరకు భారతీయ కోర్టులు ఈ వ్యవహారాన్ని పట్టించుకుని విచారణకు ఆదేశించినట్లయితే మనల్ని మనం అదృష్టవంతుల కిందే పరిగణించవచ్చు.

పార్లమెంటులో సమాచార సాంకేతికతపై స్టాండింగ్‌ కమిటీ మన పౌరుల గోప్యతను ఎలా ఉల్లంఘిస్తున్నారో పరిశీలించే జవాబుదారీతనం కలిగిన వేదికల్లో ఒకటిగా ఉంటోంది. అయితే గత చరిత్రకేసి చూసినట్లయితే, నెట్‌ న్యూట్రాలిటీ, కేంబ్రిడ్జ్‌ అనలిటికా, ఆధార్‌ వంటి అంశాలపై కమిటీ పెండింగులో ఉంచిన నివేదికలు... మూసిన తలుపుల మధ్య కమిటీలు జరిపే చర్చలు ఏమాత్రం సరిపోవని మనకు తెలుపుతాయి.  వాట్సాప్, ఎన్‌ఎస్‌ఓ గ్రూప్, మెల్‌టీ, ఎమ్‌హెచ్‌ఏ వంటి సంస్థలను తన ముందు హాజరు కావాలని పార్లమెంటరీ కమిటీ కోరినప్పటికీ, ప్రజలకు ఉపయోగపడే అంశాలను రహస్యంగా ఉంచే అవకాశం ఉంది. దీంతో వాస్తవమైన, స్థూల ఫలితాలు రాకపోయే అవకాశమే ఉంది.

నిఘా పరికరాలను విక్రయించే వాణిజ్య సంస్థలన్నీ రహస్యంగా తమ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. వీటి గోప్యతా ముసుగును ఎత్తివేసేంతవరకు వాటిని ప్రజలకు జవాబుదారీగా చేయడం కష్టసాధ్యమే. నిఘాను ఏయే పద్ధతుల్లో కొనసాగిస్తున్నారో మనం తెలుసుకోనంతవరకు నిఘాపై భవిష్యత్తులో తేబోయే ఏ చట్టం కూడా సమర్థవంతంగా అమలు కాదు. ఇప్పుడు సమస్య ఏదంటే ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌కి చెందిన స్పైవేర్‌ ఎలా పనిచేస్తోంది అని కాదు.. భారత్‌లోని, భారత్‌ వెలుపల ఉన్న పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ నిఘా వ్యవస్థలను ఎలా సేకరించి, ఉపయోగిస్తున్నారన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. నిఘా పరికరాలు వాటిని ఉపయోగిస్తున్న ప్రక్రియల వెనుక ఉన్న ఉద్దేశాన్ని కనుగొనడమే ప్రస్తుతం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ప్రభుత్వం కానీ ఇతర అధికారిక శక్తులు కానీ కొనసాగి స్తున్న నిఘా పద్ధతులకు చెందిన సమాచారం లీకుల ద్వారా మాత్రమే బయటకి వస్తోంది. అమెరికా ప్రిజం ప్రోగ్రాంపై ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ బయటపెట్టిన సమాచారం ఈ లీకులన్నింటిలోనూ సుప్రసిద్ధమైంది. 

అలాగే హాకింగ్‌ టీమ్‌ వెల్లడించిన ఈమెయిల్స్, వికీలీక్స్‌ వెబ్‌సైట్‌లో నిక్షిప్తపర్చిన డాక్యుమెంట్లు వ్యక్తులపై నిఘాకు సంబంధించి జరుగుతున్న కొన్ని విధానాలు, భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాలకు సంబంధించిన కొంత పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి. దాన్నిబట్టి భారత ప్రభుత్వం 2006లో హాకింగ్‌ టీమ్‌కి మొట్టమొదటిసారిగా ఉత్తరం రాస్తూ మనం సమావేశమవుదామని చెప్పినట్లు, వారి వద్ద ఉన్న నిఘా పరికరాల గురించి అడిగినట్లు వెల్లడైంది.

కొన్ని నెలలక్రితం మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు వాట్సాప్‌ ఎన్‌క్రిప్షన్‌ హక్కును ఉల్లం ఘించి సమాచారాన్ని లాగగలిగే నిఘా పరికరాలను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఇజ్రాయెల్‌ నుంచి సేకరించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆ వార్తలు తెలిపాయి. ప్రతిపక్షంపై పైచేయి సాధించడానికి, వోటర్ల వివరాలను తెలుసుకోవడానికి ఆధార్‌ వంటి మూలాధారాలను ఉపయోగించుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిఘా వ్యవస్థను ఉపయోగించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు సూచించాయి.

ప్రజా ప్రయోజనాల రంగంలో పనిచేస్తున్నవారు తరచుగా జోక్‌ చేస్తున్నట్లుగా పెగాసస్‌ ఉదంతం ఒక విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. తాము మాట్లాడుతున్న ప్రతి మాటనూ, చేస్తున్న ప్రతి పనినీ తమ హృదయంలో ఎలాంటి సదుద్దేశాలు పెట్టుకోని వ్యక్తులు, సంస్థలు పరిశీలిస్తున్నారని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చర్చలకు ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌కు వ్యతిరేకంగా వాట్సాప్‌ పెట్టిన కేసు తప్పనిసరిగా అవసరమైన వాస్తవాన్ని బయటపెట్టింది. మన పౌరులపై  నిఘా పెట్టడంలో యధాతతస్థితిని కొనసాగించకూడదు. ఈ విషయానికి  సంబంధించి ఇటీవల వెల్లడయిన అంశాలు మనం ఘనంగా ప్రకటించుకుంటున్న పురోగామి ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడిగానే చెప్పాల్సి ఉంటుంది.

స్పైవేర్‌ కథా కమామీషు
వాట్సాప్‌ యూజర్లను లక్ష్యంగా చేసుకునే స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్‌ కంపెనీ వివిధ దేశాల ప్రభుత్వాలకు, ఇతరులకు సరఫరా చేసిం దన్న విషయం ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టించింది. నిఘా పరికరం లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి వాట్సాప్‌ని హ్యాక్‌ చేయడం ద్వారా ఈ సాఫ్ట్‌ వేర్‌ ఆ ఫోన్‌ లో ఉన్న సమస్త సమాచారాన్ని నిఘా సంస్థలకు, గూఢచారులకు అందుబాటులో ఉంచుతుంది. ఈమెయిల్, ఇతర మెసేజింగ్‌ ప్లాట్‌ఫాంలు, ఫొటోగ్రాఫ్‌లు, డాక్యుమెంట్లు వంటి సమాచారాన్నంతటినీ ఇజ్రాయెల్‌ స్పైవేర్‌ పరికరం ద్వారా నిఘా సంస్థ సులువుగా రాబట్టి తాము ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తికి లేదా సంస్థకు, ప్రభుత్వ ఏజెన్సీకి అందజేస్తుంది. తన కస్టమర్ల ఖాతా వివరాలు తెలి యకుండా ఎండ్‌ టు ఎండ్‌ ఎ క్రిప్షన్‌ ఫీచర్‌ను కలిగివున్న వాట్సాప్‌ను సైతం హ్యాక్‌ చేయడంతో కోట్లాది కస్టమర్ల గోప్యత బట్టబయలైపోయింది. ప్రభుత్వంపై అసమ్మతి ప్రకటించే పౌర, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్షాలపై ప్రభుత్వాలు నిఘా పెట్టడం, పోన్లు ట్యాప్‌ చేయడం ఎప్పట్నుంచో జరుగుతూ వస్తున్నప్పటికీ కోట్లాది మంది వ్యక్తిగత యూజర్ల వివరాలపై ఇంత పకడ్బందీ నిఘాకు సాహసించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ అనే ఒకే ఒక్క సంస్థ 45 దేశాల్లోని పౌరులు, నెట్‌వర్క్‌లపై నిఘా పెట్టి విస్తృత సమాచారాన్ని కొల్లగొట్టడం ఆధునిక సాంకేతిక నిఘా విస్తృతిని తెలుపుతోంది. 

వ్యాసకర్త: శ్రీనివాస్‌ కొడాలి (ది వైర్‌తో ప్రత్యేక ఏర్పాటు)
 డేటా, ఇంటర్నెట్‌పై స్వతంత్ర పరిశోధకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top