లింగ సున్నితత్వ విద్య అవసరం

Msk Krishna Jyothi Article About Gender Sensitivity In School Education - Sakshi

బాలికలపై, మహిళలపై మగవారు అత్యాచారాలు, దురాగతాలకు ఎందుకు పాల్పడతారు? వారికి  ‘అలా ప్రవర్తించకూడదు’ అని బాల్యంలో బలంగా మనసులో నాటుకోవడంలేదు. దానికి భిన్నమైన భావనలు నాటుతున్నారు.  దీనికి దీర్ఘకాలిక పరిష్కారం చూడాలి.  అది బడి లోనే సాధ్యం. విద్యా కాలం దాటేలోపుగానే వారిలో లింగ సున్నితత్వం ఏర్పరచాలి. ఇందుకు ఒక చిన్న పుస్తకం కావాలి. ప్రాథమిక తరగతులకు ఇరవై పేజీలు ఉంటే సరిపోతుంది.

ఆరో తరగతి నుంచీ అటూఇటుగా ముప్పై, నలభై పేజీలు చాలు. ఈ పుస్తకాన్ని మొదటి సబ్జెక్టుగా పెట్టాలి. అన్ని పరీక్షలకన్నా ముందు ఒక ఇరవై మార్కులకి ఈ పరీక్ష జరగాలి. ఈ పరీక్ష ఉత్తీర్ణత ప్రధానమైనదిగా కాక, భాగస్వామ్య ప్రధానంగా సాగాలి. పుస్తకంలో పేజీలు  ఒకటి బాలుర కోసం, పక్కనే ఇంకొకటి బాలికల కోసం వుండాలి. అంటే,  ఒక పేజీ సమాజంలో ఎదిగే బాలుడిని లక్ష్యంగా చేసుకుని తయారు చేయాలి, ఒక పేజీ బాలికల గురించి. 

ఉదాహరణకి, ఆరో తరగతిలో ఒక పేజీలో, ‘ఒసే, ఏమే, అది, ఇది అని నీ తరగతిలో బాలికలను పిలవకూడదు. వారి పేర్లతోనే వారిని పిల వాలి’ అని రెండు వాక్యాలు ఇవ్వాలి. దాని గురించి చిన్న చర్చ. ‘అది’ ‘ఇది’ అని తరగతిలో వేటిని పిలుస్తాము? బాలికలకీ ఆ వస్తువులకీ తేడాలు ఏమిటి? బాలిక వస్తువు కాదు, ఒక మనిషి అని చెప్పాలి. అక్కడే ఒక బొమ్మ, వస్తువులకీ; ప్రాణం, అనుభూతులు గల బాలికకూ తేడా చూపేవిధంగా పెట్టాలి.  పేజీ చివర, చిన్న ఖాళీ పంక్తులలో, వారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులు ఎవరు? పై సంబోధనలు చేసేది ఎవరిని? ఎందుకు? ఈ అలవాటు ఎందుకు మానెయ్యాలి? అని స్పందన పత్రం రాయాలి. 

ఇలాగే, ఎనిమిదో తరగతి పిల్లవాడికి, ‘మగ పిల్లలకి మీసాలు రావడం సహజం. వాటిని మెలి తిప్పడంలో ఏవిధమైన ప్రత్యేకతా లేదు. అలాగే, తొడ కొట్టడం వల్ల కొత్త బలం రాదు.  బల ప్రదర్శనా పోటీలో కూడా, విజేత హుందాగా గెలవాలి.  పురుషత్వం ఒక సహజమైన అంశం. అది గొప్పా కాదు, తక్కువా కాదు’ అని రాయాలి.  ఇంకా, నీ చెల్లీ/అక్కా, నువ్వూ ఒక్కసారే భోజనం చేస్తు న్నారా? మీ అమ్మా నాన్నా ఒకే విధంగా ఆహారం తీసుకుంటున్నారా? ముందు ఎవరు తింటున్నారు? ఎందుకు? ఎలా వుంటే బావుంటుంది? అని ప్రశ్నించవచ్చు. 

అదే పుస్తకంలో బాలికలకు కూడా వాళ్లకి నేర్పవలసిన సంగతులు వుండాలి. ఉదాహరణకు ఒరే, పోరోయ్‌ అని కాకుండా బాలురని పేరుతో పిలవాలి. ఇంటి విషయాల్లో బాలికలు అన్ని రకాలుగా సమాన భాగస్వాములు. తల్లి, తండ్రి, రోజంతా పని చేసిన తరువాత; పిల్లలు బడి సమయం పూర్తి అయిన తరువాత, విశ్రాంతి కోసం చేరే స్థలాన్ని ‘ఇల్లు’ అంటాము. మీ ఇల్లు మీ కుటుంబం మొత్తానిది. దాని బాధ్యతలు కూడా అందరివీ. ఒక పేజీలో వంట ఇంట్లో పని చేస్తున్న మొత్తం కుటుంబ సభ్యుల చక్కని పెయింటింగ్‌/ఫొటో ప్రచురించాలి.

ఇల్లు భవిష్యత్తులో నేను ‘పూర్తి’ సమయం ఉండవలసిన స్థలం అనే భావన నుంచి బాలికలు బైటికి రావాలి. బాలురు కూడా, ఇల్లు స్త్రీకి చెందినది అనే భావన నుంచి బైటికి రావాలి. ఇలా ఒక పుస్తకం చేసి, దాన్నొక వేడుకగా పిల్లలకి ఇద్దాం. పెద్ద ఖర్చు కూడా కాదు. వచ్చే విద్యా సంవత్సరంనుంచీ ప్రభుత్వం విద్యా రంగంలో మార్పులు తేబోతోంది కాబట్టి, లింగ సున్నితత్వం విద్యా ప్రణాళికలో చేర్చడానికి ఇదే సరైన సమయం. ఈ పుస్తకాన్ని పిల్లలకు వారి వారి సొంత భాషలోనే అందించాలి.  ఇక్కడ నేను వ్యక్తీకరించినవి ప్రాథ మిక భావనలు.  వీటిని మరింత మెరుగు చేసుకుని ఒక చక్కని సమాజాన్ని నిర్మించుకోవడానికి పిల్లలకోసం కొన్ని రంగు బొమ్మల పేజీలు ముద్రించగలం కదా. 


ఎమ్మెస్కే. కృష్ణ జ్యోతి 
వ్యాసకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

మొబైల్‌: 91107 28070

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top