ఆర్టీఐతో వేధిస్తే నష్టపరిహారమే!

madabhushi sridhar guest column on rti - Sakshi

విశ్లేషణ

జవాబుదారీతనాన్ని, పారదర్శకతను సాధించడానికి కాకుండా, అవినీతిని ఎదిరించాలనే లక్ష్యంతో సంబంధం లేకుండా, ఆర్టీఐ కింద ఇష్టం వచ్చిన సమాచారాన్ని విచక్షణారహితంగా డిమాండ్‌ చేస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయి.

జేపీ సైనీ కొన్ని ఫైళ్లనుంచి పత్రాల ప్రతులు కావాలని ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకున్నారు. తన ఫిర్యాదు పైన తీసుకున్న చర్యలు, ఫలానా అధికారి మరో అధికారికి రాసిన ఉత్తరం. అవీ ఇవీ బోలెడు అడిగాడాయన. సీపీఐఓ తనకు అందుబాటులో ఉన్న అనేక పత్రాలను తీసి ఇచ్చారు. మొదటి అప్పీలు వేశారు. ఇవ్వవలసిన పత్రాలన్నీ ఇచ్చారని ఇక ఇచ్చేదేమీ లేదని ఆయన తేల్చేసారు. కానీ సైనీ అనేకానేక దరఖాస్తులు పెడుతూనే ఉన్నారు. అధికారులు జవాబులు ఇస్తూనే ఉన్నారు. కమిషన్‌ కూడా సైనీ అప్పీళ్లు ఎన్నో విని తీర్పులు కూడా ఇచ్చింది. అయినా కొత్త అప్పీళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
 
ఇదివరకు సైనీ భివానీలో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఒక మహిళా ఉద్యోగిపై ఈయన లైంగిక వేధింపులు చేసారన్న ఆరోపణతో శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొన్నారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించిన తరువాత సాక్ష్యాలు లేవని వదిలేశారు. మహిళా బాధితురాలు కోర్టులో కూడా కేసు వేశారు. అందులో కూడా ఆయన విడుదలైనారు. ఆ తరువాత సైనీ ప్రతిభావిశేషాలకు మెచ్చి ప్రమోషన్‌ కూడా ఇచ్చారు. గ్రూప్‌ ఎ అధికారి హోదా ఇస్తూ సహాయ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ పదవిని కట్టబెట్టారు. 2011లో ఆయన పదవీ విరమణ చేశారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యంచెప్పిన ఒక అధికారి పైన సైనీ ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తులు పెట్టడం మొదలు పెట్టారు. ఆయన పైన ఫిర్యాదులు చేయడం, ఆ ఫిర్యాదులమీద ఏ చర్యలు తీసుకున్నారని అడగడం. ఇక వేధింపులకు అంతులేదు. తన పదవీ విరమణ సమయాన్ని దీనికే వినియోగిస్తున్నారు. మొత్తం 255 ఆర్టీఐ దరఖాస్తులు పెట్టారు. ఇంత సమయాన్ని ఇంకేదయినా మంచి పనికి  కేటాయిస్తే ఎంత బాగుండేది?
 
లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు, విచారణ, పర్యవసానాలనుంచి మచ్చ లేకుండా బయటపడడమే అదృష్టం అనుకోకుండా సాక్ష్యం చెప్పిన వారిమీద పగతీర్చుకోవడానికి ప్రయత్నించడం దురదృష్టకరం. వ్యక్తిగత కక్షలతో వేధించడానికి సమాచార చట్టాన్ని వినియోగించడాన్ని కమిషన్‌ అనుమతించదు. ఆర్టీఐ దరఖాస్తునుంచి రెండో అప్పీలుదాకా వేధిం పును కొనసాగించడం దుర్మార్గమైన చర్య. ఇటువంటి వ్యక్తులను, ఆర్టీఐని వారు దుర్వినియోగం చేయడాన్ని ప్రోత్సహించకూడదు. ప్రతి దరఖాస్తుపైన చట్టం ప్రకారం ప్రభుత్వ సంస్థ ప్రతిస్పందన ఇవ్వవలసి ఉంటుంది. నెలరోజుల్లో జవాబు తయారు చేసి పోస్ట్‌ చేయడం వంటి పనులకు ఎంతో ప్రజాసమయం, డబ్బు వినియోగం అవుతూ ఉంటుంది. తప్పుడు పనులు చేసిన ఉన్నతాధికారుల మీద ఫిర్యాదులు చేయకుండా ఈ ఆర్టీఐ దుర్వినియోగం నిరోధిస్తుంది. వేధింపులకు భయపడి ఫిర్యాదులూ చేయకపోవచ్చు. ఈ ఆరోపణలపై విచారణలో సాక్ష్యాలు చెప్పడానికి కూడా ఎవరూ ముందుకు రారు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ అనేదే లేకుండా పోతుంది. తోటి ఉద్యోగుల మానవహక్కులను కూడా పరోక్షంగా  రెండో అప్పీళ్లు హరిస్తాయి. ప్రభుత్వ సంస్థ పక్షాన ఈ పరిస్థితిపైన ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, సెక్షన్‌ 18(ఎఫ్‌) కింద ఇటువంటి దుర్వినియోగాల వల్ల క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు జరిపే విచారణలకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయో లేదో పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది.
 
ఈ కేసులో ప్రభుత్వ విభాగం ఈ దరఖాస్తుదారు దాఖలు చేసిన 251 దరఖాస్తులను విభిన్న ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసింది. ఈ పనికిరాని సమాచార దరఖాస్తులకు జవాబివ్వడానికి, వాటిని వేరే శాఖలకు బదిలీ చేయడానికి కనీసం రూ. 5,742 రూపాయలు ఖర్చయిందని సీపీఐఓ కమిషన్‌కు వివరించారు. ప్రభు త్వశాఖ అయితే దానికన్న మరెంతో ఎక్కువగా తన వనరులను వ్యయం చేయవలసి వచ్చింది. స్టేషనరీ, మానవ పని సమయాలు, డబ్బు కూడా వెచ్చించారు.
 
సైనీ కేసులో విచారణాధికారిగా ఉన్న వికాస్‌ మైన్వాల్‌ తాను ఎన్నో కేసులలో చాలా నిష్పాక్షికంగా విచారణా నివేదికలు ఇచ్చానని, తన విచారణలో సైనీపై సాక్ష్యాలు లేవని తేలిందని, ఆ తరువాత కూడా దురుద్దేశంతో వేధింపు ఆర్టీఐ దరఖాస్తులు వేస్తున్నారని కమిషన్‌కు వివరించారు. సైనీ ఇదివరకు క్లాస్‌ 1 అధికారిగా అయిదారేళ్లు సీపీఐఓగా కూడా పని చేశారు. అయినా ఆర్టీఐని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారంటే ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందని వేదప్రకాశ్‌ తన నివేదికలో పేర్కొన్నారు. పదవీ విరమణ చేయడం వల్ల వచ్చిన ఈ సౌకర్యానికి అర్థం తనకు మరొకరిని వేధించడానికి దక్కిన హక్కు కాదని ఆయన అన్నారు.

సీబీఎస్‌ఇ వర్సెస్‌ ఆదిత్య బందోపాధ్యాయ కేసులో ఇటువంటి దుర్వినియోగదారులను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఏకే పట్నాయక్, ఆర్‌.వి. రవీంద్రన్‌ దుయ్యబట్టారు. జవాబుదారీతనాన్ని, పారదర్శకతను సాధించడానికి కాకుండా, అవినీతిని ఎది రించాలనే లక్ష్యంతో సంబంధం లేకుండా, ఆర్టీఐ కింద ఇష్టం వచ్చిన సమాచారాన్ని విచక్షణారహితంగా డిమాండ్‌ చేస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయి. అధికారగణం పనికిరాని దరఖాస్తులకు జవాబులు ఇచ్చే పనిలో పడి అసలు పని వదిలేయవలసి వస్తుంది అని విమర్శిం చింది సుప్రీంకోర్టు.

తన చెత్త దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ శాఖ పరిపాలనా సమయాన్ని వృథా చేసి, రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా రు. 5,742 నష్టపరిచినందుకు గాను అంతసొమ్ము నష్టపరిహారంగా చెల్లించాలని కమిషన్‌ సైనీని ఆదేశించింది. ఇంకా చట్టపరమైన చర్యలు ఏవైనా తీసుకోవడానికి వీలుందేమో చూడాలని కూడా సూచించింది.
(జేపీ సైనీ వర్సెస్‌ పోస్టు విభాగం, CIC/ POS TS/A-/2017/161735 కేసులో 21.11.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా).
 

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
మాడభూషి శ్రీధర్‌
professorsridhar@gmail.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top