ఏది గోప్యత? ఏది సమాచారం?

Madabhushi Sridhar Article On Privacy And Information - Sakshi

విశ్లేషణ

నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీలో 2001 నుంచి 2007 వరకు మీరెంత మంది యువతీ యువకులను సీనియర్, జూనియర్‌ స్కాలర్లు, ఫెలోషిప్‌ స్థానాల కోసం ఎంపిక చేశారు? వారి పేర్లేమిటి? ఏఏ పరిశోధనాంశాల్లో వారు అధ్యయనం చేస్తున్నారు? నిర్ణీత కాలాన్ని మించి పరిశోధన కొనసాగించిన వారు ఎంతమంది? వారెవరు? పరిశోధనా కాలాన్ని కొనసాగించే నియ మం ఉందా? లేకపోతే ఏం చేస్తారు? ఏం చేశారు? పరిశోధన విజయవంతంగా పూర్తిచేసిన వారికి చివరి వేతన చెల్లింపు సర్టిఫికెట్లు ఎప్పుడిచ్చారు? అని సమా చార హక్కు కింద 2017 సెప్టెంబర్‌ 20న దరఖాస్తు పెట్టుకున్నారు.  దీనిపై సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా, ఈ అంశాలన్నింటినీ వ్యక్తిగత సమాచారమని వర్గీకరించారు. ఈ దరఖాస్తుపై 30 రోజులు గడిచినా ఏమీ చెప్పలేదు. ‘మా పరిపాలనాధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమాచారాన్ని నిరాక రించాం’ అని రెండో అప్పీలులో పీఐఓ చెప్పారు.

ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 8(1)(జే) ప్రకారం ఆ సమా చారం ఇవ్వవలసిన పని లేదని అనుకున్నారు. తాను ఇటీవలే పీఐఓగా చేరానని, అంతకుముందు అజిత్‌ కుమార్‌ ఈ సమాధానాన్ని 2018 మే 3న చెప్పారని కొత్త పీఐఓ వివరించారు. రెండో అప్పీలు దాఖలైన తర్వాత 2018 జులై 11న అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి కుమారి నిధి శ్రీవాస్తవ సమాధానం ఇచ్చారు.  స్కాలర్ల పేర్లు కూడా వారి వ్యక్తిగత సమాచారం ఎట్లా అవుతుందో వివరించాలని అడిగితే జవాబు లేదు. పై అధికారులను ఒక్కోసారి పీఐఓలు సమా చారం కోసం అడుగుతుంటారు. వారు తమ అధికార హోదాతో ఒక్క నిమిషంలో ఏ సమాచారమూ ఇవ్వ ద్దని తేల్చి పారేస్తారు. నెలరోజులైనా ఏ జవాబూ ఇవ్వకపోవడం సమాచారాన్ని నిరాకరించడమే.

కొందరు మొదటి దశలో, మొదటి అప్పీలు దశలో కూడా సమాచారం ఇవ్వరు. రెండో అప్పీలు వేసినా పట్టించుకోరు. కాని ఫలానా కమిషనర్‌ ముందుకు కేసు వచ్చిందని, విచారణ నోటీసు కూడా వచ్చిందని తెలిశాకే స్పందిస్తారు. ‘‘పీఐఓ మారితే నా కన్నా ముందు అధికారి నిరాకరిస్తే నేనెందుకు ఇవ్వాలి? కమిషనర్‌ కూడా ఆయనకే నోటీసు ఇస్తాడు కదా. అతను బాధపడితే పడనీ’’ అనుకుంటారు. సమాచారం ఇవ్వకుండానే కమిషన్‌ ముందు విచా రణకు వస్తారు.  కొత్త పీఐఓ ఎప్పుడు చేరారో అడిగి, ఆ తేదీ నాటికి పెండింగ్‌లో ఉన్న సమాచార దర ఖాస్తులు ఎందుకు చూడలేదని అడిగే అవకాశం ఉండాలి. నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీ మౌలికమైన పని గ్రంథాలయ నిర్వహణతో పాటు, పరిశోధకులకు సాయం చేయడం. ఎవరికి స్కాలర్‌ షిప్‌ ఇచ్చారు? ఎంతకాలం పరిశోధన జరిగింది? అనే ప్రశ్నలు సామాన్యమైన సమాచార అభ్యర్థన అంశాలు. వాటిని ఏదో ఒక నెపంతో నిరాకరించడం న్యాయసమ్మతం కాదు. చట్టసమ్మతం కూడా కాదు. ఈ పనిచేసింది మొదట సీఐఓ అజిత్‌ కుమార్‌. దాంతో పాటు వారి పాలనాధికారి లోపం కూడా ఇందులో భాగం.

అజిత్‌ కుమార్‌కు తప్పుడు ఆదే శాలు ఇవ్వడమే కాకుండా, మొదటి అప్పీలు అధికారి బాధ్యతలను మరొకరికి ఇవ్వకుండా పీఐఓ అయిన అజిత్‌ కుమార్‌కే అప్పగించడం చట్టవిరుద్ధం. ఇందు వల్ల సమాచార అభ్యర్థి తనకు జరిగిన చట్ట వ్యతిరేక నిరాకరణను ప్రశ్నించే అవకాశం కోల్పోయాడు. ఈ రెండు తప్పులకు ఆనాటి పాలనాధినాధికారి నిధి శ్రీ వాస్తవ బాధ్యులు కావలసి వస్తుంది. ఆర్టీఐ చట్టంలో ఉన్న బాధ్యతలను నిర్వహించడానికి పీఐఓకు మిగి లిన అధికారులు అందరూ సహకరించాలి. పై అధికా రులు, కింది ఉద్యోగులు కూడా ఈ ఉన్న తాధికారికి సాయం చేయాలి. పీఐఓ అడిగినపుడు సాయం చేయని మరొక ఉద్యోగి పైఅధికారి అయినా, కింది అధికారి అయినా సరే నిరాకరించిన పీఐఓగా ఆయ నను పరిగణించి ఆయనపై చర్యలు తీసుకునే అధి కారం ఉంది. కనుక సమాచార కమిషన్‌ పీఐఓ అజిత్‌ కుమార్‌కు, సమాచారం ఇవ్వడంలో సహాయం నిరా కరించిన నిధి శ్రీవాస్తవకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పబ్లిక్‌ అథారిటీలు, పీఐఓలు అడుగడుగునా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ కేసునే ఉదాహరణగా తీసుకుంటే, చట్టం వచ్చిన 120 రోజులలోగా తమంత తామే 17 రకాల సమాచారాన్ని సెక్షన్‌ 4(1) (బీ) కింద ఇవ్వాలి. ఈ కేసులో కోరిన నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీకి సంబంధించిన స్కాల ర్‌షిప్‌ వివరాల సమాచారం తమంత తామే ఇవ్వవలసి నది. 30 రోజుల్లో జవాబివ్వలేదు. మొదటి అప్పీలు అవకాశం తొలగించారు. తర్వాత తప్పుడు కారణా లపై ఈ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఇవన్నీ చట్ట వ్యతిరేక చర్యలు. అంతేకాదు 8(1)(జే) దుర్వినియోగం. (డాక్టర్‌ కమల్‌ చంద్ర తివారీ వర్సెస్‌ నెహ్రూ మెమో రియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ, CIC/NMMA L/A/2018/616896 కేసులో ఆగస్టు 10న ఇచ్చిన తీర్పు ఆధారంగా).

మాడభూషి శ్రీధర్‌, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top