గ్రామ స్వరాజ్యమే ఊపిరిగా..

Juluru Gouri Shankar writes on Telangana reconstruction - Sakshi

సందర్భం

తెలంగాణలో నాగరికతకు నాగలినిచ్చిన వాణ్ణి ఇప్పుడు నిలబెట్టాలి. తాళిబొట్లను అందించిన వాళ్ల కుటుంబాల పసుపు కొమ్ములు రాలిపోకుండా చూడాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా విశ్వకర్మలు శిరసెత్తుకుని నిలవాలి.

కాళ్లూచేతులు పడిపోయిన తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు ఇపుడు పునర్నిర్మాణ చికిత్స జరుగుతోంది. గ్రామీణ వ్యవస్థ తిరిగి శిరసెత్తుకుని నిలిచేం దుకు చేయాల్సిన పనులన్నీ మొదలవుతున్నాయి. గ్రామం తిరిగి కళకళలాడాలంటే గ్రామీణ చేతివృత్తులన్నీ శక్తివంతం కావాలి. ఇవన్నీ ఆధునీకతను సంతరించుకోవాలి. మొత్తం తెలంగాణ సమాజంలో సగభాగంగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన వృత్తులన్నింటినీ ఆధునీకరించాలి.

తెలంగాణలో కుమ్మరి వృత్తిబాగా దెబ్బతిన్నది. కుండల వాడకం తగ్గిపోయింది. వీరికి వెంటనే ప్రత్యామ్నాయం చూడాలి. ఇంకా కుమ్మరివృత్తిలో కొనసాగే వారి చేతివేళ్లలో ఉన్న నైపుణ్యం మాత్రం గొప్పది. వారితో ఆధునిక సమాజం ఉపయోగించుకునే మట్టితో తయారు చేసే వస్తువులను ఆధునిక పరిజ్ఞానాన్ని కూర్చి తయారీని చేపట్టవచ్చు. వడ్రంగి పని దగ్గరకు వస్తే, నాగలితో దున్నే సంఖ్య తగ్గిపోయింది. ఎడ్ల బండ్లు మాయమవుతున్నాయి. నాగలి, మేడి, దంతె, కర్రు, బండిచక్రం, బండిఆకులు, ఇరుసులు వంటి పనిముట్లు చేయించే స్థితి క్రమంగా తగ్గిపోయింది. వ్యవసాయానికి ట్రాక్టర్‌ సింబ ల్‌గా మారింది. వరికోసే యంత్రాలు వచ్చాయి.

తెల్లవారుతుంటే కళకళలాడే వడ్రంగుల వాకిళ్లు.. పనులే లేక బిక్కమొకం వేసి మట్టిగొట్టుకునిపోయాయి. ఇంటినిర్మాణ పనులకు మాత్రమే వడ్రంగి వృత్తి మిగి లింది. వడ్రంగి వృత్తిలో చేసే ఫర్నిచరు సామాన్లు అన్నీ గ్లోబల్‌ సంతల్లో విదేశాల నుంచి వచ్చిపడుతున్నాయి. దీంతో ఈ వృత్తి పనిలేక గ్రామం వదిలి పట్టణాలకు, నగరాలకు వలసలు పోయారు. ఈ వృత్తిని పూర్తిగా మిషనరీ పనిగా మార్చాలి. వడ్రంగి వృత్తికి ఆధునిక పరిజ్ఞానాన్ని అద్ది దాన్ని కాపాడాలి. ప్రపంచమార్కెట్‌ పోటీకి నిలిచేవిధంగా ఫర్నిచర్‌ను తయారుచేయగల నేర్పు ఈ వడ్రంగి వృత్తి వారికుంది. మరి వీరికి తక్షణం సాంకేతిక పరిజ్ఞానం కావాలి. వీరు తయారుచేసే వస్తువులే మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు కొనే విధంగా చేయగలగాలి.

శిల్పులకు కూడా పనిలేకుండా పోయింది. కమ్మరి వృత్తే అంతరించింది. కంచరివాళ్లే కనిపించటం లేదు. వీళ్లలో కంసాలిని కూడా కలుపుకుంటే వీళ్లను విశ్వకర్మలు అంటారు. తెలంగాణలో చేనేత కార్మికుల మాదిరిగా విశ్వకర్మకులస్తులు కూడా అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఈ విశ్వకర్మలకు ఆశలు చిగురించాయి. గ్లోబల్‌ సంతల్లో ఫర్నిచర్‌కు దీటుగా వీళ్లు ఫర్నిచర్‌ తయారు చేసేందుకు శిక్షణాలయాలు రావాలి. ఉన్నతాధికారుల కార్యాలయాల దగ్గర్నుంచి స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ల ఆఫీసుల వరకు ఈ వడ్రంగులు తయారుచేసే వస్తువులనే కొనాలన్న సంకల్పాన్ని కలుగజేసేందుకు కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు.

కంసాలివృత్తి బాగా చితికిపోయి ఆత్మహత్యల శయ్యపైకి ఎక్కింది. కొలిమి రాజుకోవటం లేదు. ఇప్పుడు పుస్తెలతాళ్ల దగ్గర్నుంచి అన్ని మిషన్‌ మీదనే తయారవుతున్నాయి. కమ్మి, తీగ, కటింగ్‌లు, గాజుల మోల్డింగ్, ఉంగరాలకు సంబంధించిన డిజైన్లు, మెడలో వేసుకునే హారాలకు సంబంధించిన రకరకాల డిజైన్లు, చెవుల కమ్మలు తదితర బంగారపు వస్తువులన్ని మిషన్‌పైననే తయారుచేస్తున్నారు. 100 మంది చేసే పనిని ఒక్క మిషన్‌ చేసేస్తుంది. ఇది కూడా ఈ వృత్తిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు పెట్టి స్వర్ణకారులకు శిక్షణ ఇవ్వవచ్చు. స్వర్ణకారులది, కంచర్లది ఒకటే పని. ఈ ఇద్దరి పనికి మిషనరీల అవసరముంటాయి. కంచరి వాళ్లు బిందెలు, చెంబులతో పాటు దేవాలయాల్లో పెట్టే విగ్రహాలను కూడా చేస్తారు. బంగారు పనిచేసేవారికి పని ఇచ్చేం దుకు, వీరి వస్తువులను అమ్మేందుకు, జ్యూయలరీ షాపులు నడుపుకునేందుకు విశ్వకర్మ ఫెడరేషన్‌ వారే వీరికి అండగా నిలవాల్సి ఉంది.

కేరళరాష్ట్రంలో ఈ విశ్వకర్మ వారు తయారుచేసే వస్తువులను, కళాఖండాలను ఆప్కో మాదిరిగా అక్కడి ప్రభుత్వమే వాటిని విక్రయించేందుకు దుకాణాల సముదాయం పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మలను నిలబెట్టేందుకు కృషిచేయాలి. వీరిని కొలిమినుంచి ఆధునిక మిషన్లవైపు నడపటం ఎంత వరకు సాధ్యమవుతుంది? దీనిపై సావధానంగా ఆలోచించాలి. శిల్పులకు కూడా ఆదరణ పూర్తిగా లేదు. ‘శిలలపై శిల్పాలు చెక్కినారు’ అన్న పాటతో మాత్రమే వారు కన్పించే దశకు వచ్చారు. కానీ మనది గొప్ప శిల్పకళ. ఈ కళ ఆధునికతకు అందగలిగితే అతి ఖరీదైన వృత్తిగా ఇది మారుతుంది. నాగరికతకు నాగలినిచ్చిన వాణ్ణి ఇప్పుడు నిలబెట్టాలి. కుటుంబవ్యవస్థకు ప్రతీకగా నిలిచి తాళిబొట్లను అందించిన వాళ్ల కుటుంబాల పసుపు కొమ్ములు రాలిపోకుండా చూడాలి. ఆధునీకరించిన కుంపట్లు, కొలుములు రావాలి. ఈ విశ్వకర్మ కులస్తులు ఉత్పత్తులు చేసే ఆధునిక కాలజ్ఞాన మార్కెట్‌లుగా మారాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఈ విశ్వకర్మలు శిరసెత్తుకుని నిలవాలి. గంగలో కలిసిపోయిన గ్రామస్వరాజ్యానికి తెలం గాణ రాష్ట్రం తిరిగి ప్రాణం పోయాలి. తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన విజన్‌ 2024 విజయం సాధించాలని సబ్బండ వర్ణాలు కోరుకుంటున్నాయి. బీసీల ముఖ చిత్రం మార్చటంకోసం, చేస్తున్న కృషి విజయం సాధిస్తే సగం తెలంగాణ ఆర్థిక స్థిరత్వంతో శిరసెత్తుకుని నిలవగలుగుతుంది.


- జూలూరు గౌరీశంకర్‌

వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు
మొబైల్‌ : 94401 69896

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top