ఓట్ల కోసమే సంక్షేమం ఎర | Article On Chandrababu Welfare Schemes Before Elections | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 6 2019 1:14 AM | Last Updated on Wed, Feb 6 2019 1:14 AM

Article On Chandrababu Welfare Schemes Before Elections - Sakshi

ఎన్నికల వేళ ఓట్ల రాజకీయంలో భాగంగా ఎడాపెడా సంక్షేమ పథకాల ప్రకటనలు చేస్తూ.. పార్టీ కార్యకర్తల నేతృత్వంలో తన ఫొటోలకు క్షీరాభిషేకాలు చేయించుకొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు సంక్షేమ ముఖ చిత్రం ఏపాటిదో తెలిసే ఒక నివేదిక ఇటీవల బహిర్గతమైంది. ‘అంబేడ్కర్‌ ఫౌండేషన్‌’ అనే సామాజిక సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై చేసిన అధ్యయనంలో పలు దిగ్భ్రాంతికరమైన చేదు నిజాలు వెల్లడయ్యాయి. పేదలు, బడుగుబలహీన వర్గాల విద్యార్థులు నివాసం ఉంటున్న ప్రభుత్వ వసతి గృహాల్లో 44% వాటికి కనీస మౌలిక వసతులు లేవు. రక్షితనీరు అందుబాటులో లేదు. మరుగుదొడ్లు, స్నానాల గదులు తగినన్ని లేవు. ప్రతి 52 మందికి ఒక్కటే టాయిలెట్, ఒక్కటే స్నానపు గది. చలికాలంలో కప్పుకోవడానికి విద్యార్థులకు కంబళ్లు కాదుకదా దుప్పట్లు కూడా లేవు. వసతి గృహాలు మురికి కూపాలుగా మారాయి. దోమలు, ఈగల బెడదతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతుంటే, వారికి మందులిచ్చే వారు లేరు. వైద్య పరీక్షలు చేయించే వారు లేరు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో వసతి గృహాలకు కేటాయించిన బడ్జెట్‌ నిధుల్లో 38% కోత విధించారు. రాష్ట్రంలో ఎస్సీలకు అందాల్సిన సంక్షేమ పథకాలను బినామీలు ఎగరేసుకునిపోతున్నారు. ఏజెన్సీ ఏరియాలోని ఎస్టీలకు విద్య, వైద్య సౌకర్యాలు అందడం లేదు. గిరిజన గూడేలకు మంచినీటి వసతి కల్పించలేకపోయారు. మైనార్టీలకు ఏటా బడ్జెట్‌ నిధులలో రూ. 500 కోట్లు మించి ఖర్చు చేయడం లేదు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామని చెప్పిన మాట నీటిమూటగా మారింది. పేదలకు ఐదేళ్లల్లో 13 లక్షల ఇండ్లను కడతామన్న లక్ష్యంలో 30% కూడా నెరవేరలేదు. డాక్టర్‌ వైఎస్సార్‌ సీఎంగా ఉండగా ప్రవేశపెట్టిన విశిష్ట పథకం ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ను నీరుగారుస్తున్నారు. ఆరోగ్యశ్రీ, 104 వంటి పథకాలని కూడా వ్యూహాత్మకంగా దెబ్బతీశారు.

వ్యవసాయ రుణాలన్నీ.. బ్యాంకుల్లో బంగారం కుదవ పెట్టి తీసుకొన్నవి సైతం బేషరతుగా మాఫీ చేస్తామని, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకురైతు పెట్టిన ఖర్చుకు 50% అదనంగా కనీస మద్దతు ధర అందిస్తామని, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా మని, మద్యం అమ్మకాలు తగ్గిస్తా, బెల్ట్‌ షాపులన్నీ రద్దు చేస్తాం, పన్నుల భారం తగ్గిస్తాం, గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ ఇస్తామని... ఇలా దాదాపు ఓ 100 ప్రధాన హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక.. చెప్పిన వాటికి పూర్తి విరుద్ధంగా.. పెట్రో ధరలపై వ్యాట్‌కు అదనంగా సెస్‌ విధించడం, మద్యం అమ్మకాల్ని, మద్యం ధరల్ని పెంచారు. అమలు చేస్తున్న ఒకటీ అరా సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందకుండా.. రాజ్యాంగ విరుద్ధంగా జన్మభూమి కమిటీలను తమ కార్యకర్తలతో నింపి.. సర్పంచ్‌ అధ్యక్షత జరిగే గ్రామ సభల్లో కాకుండా జన్మభూమి(పార్టీ) కమిటీల ఎంపిక చేసిన వారికే అందిస్తున్న విషయం ప్రజలకు తెలుసు.

ఇసుక మాఫియాలను, కాల్‌మనీ రాకెట్‌లను పరోక్షంగా ప్రోత్సహించారు. బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక ‘కోటయ్య కమిటీ’ అంటూ డ్రామాలు ఆడి మాఫీ జరగాల్సిన రూ. 89,000 కోట్లకుపైగా రుణాలను రూ. 24,000 కోట్లకు కుదించారు. ఇంకా ఇప్పటికీ అందులో రూ. 11,000 కోట్లు రైతులకు చెల్లించలేదు. ఎన్టీఆర్‌ మానస పుత్రిక అయిన కిలో రూ. 2ల బియ్యంను రూ. 5.50 చేసింది బాబే. మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కుదరదు పొమ్మన్నారు.  

మహిళల సంక్షేమంపట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్యకు కారణం అయిన వారిని శిక్షించే బదులు, రక్షించడాన్ని మహిళలు ఏవిధంగా అర్థం చేసుకోవాలి? విజయవాడ కాల్‌మనీ నింది తుల్ని ఎందుకు వదిలేశారు?  సీఎం బాబు ప్రజాధనాన్ని మంచినీళ్లలా సొంత పబ్లిసిటీకి, పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నిన్నమొన్నటి వరకు.. ప్రైవేటు విమా నాలు, విదేశీ పర్యటనలు, స్టార్‌ హోటళ్లల్లో కుటుంబ సమేతంగా మకాంలు, సొంత ఇంటికి మెరుగులు, చాంబర్ల సోకులు.. మొదలైనవి చేశారు. కానీ, గతయేడాదిగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ మీద యుద్ధం పేరుతో వందలకోట్లు ఖర్చు పెట్టి ధర్మదీక్షలు, నవ నిర్మాణ దీక్షలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్రకులాల పేదలకు కల్పించిన 10% రిజర్వేషన్ల కోటాలో 5% కాపులకు ఇస్తామని చెప్పడం బాబు నయవంచనకు పరాకాష్ఠ. ఏపీ ప్రజలు చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన తరుణం ఇది. ఎన్నికల వేళ ఓట్ల కోసం ఎరవేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
 

సి. రామచంద్రయ్య

వ్యాసకర్త మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement