చాదస్తపు స్నేహితుడు

చాదస్తపు స్నేహితుడు


పిల్లల కథ

నందనవనంలో నారాయణ అనే వ్యాపారి ఉండేవాడు. ఆ గ్రామంలో తనొక్కడిదే సరుకుల దుకాణం కావడంతో వ్యాపారం జోరుగా సాగేది. దుకాణంలోని పనంతా ఒక్కడే చేసుకోలేక పోలప్ప అనే తన చిన్ననాటి స్నేహితుణ్ని సహాయకుడిగా ఉంచుకున్నాడు. పోలప్పకు నెలకు ఐదువందలు వేతనంగా ఇచ్చేవాడు. ఒకరోజు దుకాణానికి సత్యమూర్తి అనే వ్యక్తి వచ్చాడు. అతడు కూడా నారాయణకు స్నేహితుడే!



దుకాణంలో పోలప్పను గమనించిన  సత్యమూర్తి ఏదో ప్రమాదాన్ని శంకించాడు. నారాయణను బయటకు పిలిచి, ‘‘ఏరా! ఈ అయోమయం శాల్తీని గుమాస్తాగా పెట్టుకున్నావా? వాడికి మందబుద్ధి, మూఢనమ్మకాలు అధికమని మనకు చిన్నప్పట్నించీ తెలుసు కదా. తెలిసీ ఇలా ఎందుకు చేశావు?’’ అని సున్నితంగా మందలించాడు.

 

‘‘భలే వాడివే! నీవు పోలప్పలోని కొన్ని గుణాలనే చూశావు. వాడికి చాదస్తం ఉన్న మాట నిజమే. కానీ నేను ఒక వ్యాపారిగా ఆలోచించి, వాడిని పనిలో పెట్టుకున్నాను. అతి తక్కువ జీతానికి రోజంతా దుకాణాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు వీడొక్కడే! అలాగే నేను ఏ పని చెప్పినా కిక్కురుమనకుండా చేస్తాడు. పైగా... మధ్యాహ్నం పూట బేరాలు లేనప్పుడు ఆ కబురూ, ఈ కబురూ చెప్పి కాలం దొర్లిపోయేలా చేస్తున్నాడు’’ అని సత్యమూర్తిని సమాధానపరిచాడు నారాయణ.

 

‘‘సరే, నీ ఇష్టం. ఎందుకైనా మంచిది. జాగ్రత్తగా ఉండు. మూర్ఖులతో సాహచర్యం ఎప్పుడూ ప్రయోజనాన్నివ్వదు’’ అంటూ సత్యమూర్తి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు.

 ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత, ఒకసారి సరుకులు కొనడానికి రంగనగరం వెళ్లవలసి వచ్చింది. నారాయణ, పోలప్ప ఇద్దరూ బయలుదేరారు. రంగనగరానికి రెండు దారులు ఉన్నాయి. అందులో ఒకటి గుర్రపుబండ్లు వెళ్లేదారి, రెండవది కాలిబాట.



కాలిబాటంతా చిక్కటి అడవి గుండానే సాగుతుంది. అయితే రంగనగరానికి వెళ్లడానికి అది దగ్గరి దారి! గుర్రపుబండిలో వెళితే ఖర్చవుతుందని, నారాయణ కాలిబాటన వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. ఒక రొట్టెల మూట, నీళ్లు నింపిన సొరకాయ బుర్రను పోలప్ప భుజాలపైకి ఎక్కించాక, ఇద్దరూ కాలిబాటన ప్రయాణించసాగారు. నారాయణకు ప్రయాణకష్టం తెలియకుండా పోలప్ప దారివెంట పలు కబుర్లు చెబుతూనే ఉన్నాడు.

 

మధ్యాహ్నమయ్యాక, ఇద్దరూ ఒక మర్రిచెట్టు కింద ఆగారు. కాసిన్ని రొట్టెలు తిన్నాక, చేతులు కడుక్కోవడానికి నారాయణ చెట్టు వెనక్కు వెళ్లాడు. అయితే అక్కడో దిగుడుబావి ఉంది. అయితే చుట్టూ పెరిగిన గడ్డితో మూసుకుపోయి కనిపించకుండా ఉంది. నారాయణ పొరబాటున ఆ గడ్డిపై కాలుపెట్టి జారి బావిలో పడిపోయాడు. బావిలోకి జారిపోయేటప్పుడు భయంతో బిగ్గరగా కేకలు వేశాడు. రొట్టె తింటోన్న పోలప్ప ఆ కేకలు వినగానే ఆదుర్దాగా లేచి నారాయణ కోసం పరుగులు తీశాడు. చుట్టుపక్కల వెతికి బావిని కనిపెట్టాడు. అప్పటికే బావి నీటిలో నాలుగైదుసార్లు మునిగి తేలాడు నారాయణ. బావి అంచులో పెరిగి ఉన్న ఒక చెట్టుకొమ్మను ఆసరాగా పట్టుకుని, వేళ్లాడుతున్నాడు.

 

అది చూసిన పోలప్ప, ‘‘నువ్వేమీ భయపడొద్దు. నిన్ను పైకి తెస్తాను’’ అని నారాయణకు ధైర్యం చెప్పి చుట్టుపక్కల వెతికాడు. కొంతసేపు వెదికాక గట్టిగా, పొడవుగా ఉన్న చెట్టుతీగ ఒకటి కనిపించింది. దానిని తెచ్చి ఒక కొస తాను పట్టుకుని మరో కొసను బావిలోకి వదిలాడు. ‘‘హమ్మయ్య, పోలప్ప సాయంతో బతికి బయటపడుతున్నాను’’ అని ఊపిరి పీల్చుకున్న నారాయణ ఆ కొసను గట్టిగా పట్టుకుని మెల్లగా పైకి రాసాగాడు. ఇంకొద్ది క్షణాలకు నారాయణ బావి పైకి చేరేవాడే! ఇంతలో... నీటిలో బాగా తడిసిన నారాయణకు వరుసపెట్టి తుమ్ములు వచ్చాయి.

 

ఆ తుమ్ముల్ని వినగానే పోలప్పలోని చాదస్తం బయటపడింది. ‘తుమ్ముల్ని విన్న వెంటనే కాళ్లు చేతులు కడుక్కుని, కాసేపు విశ్రాంతి తీసుకున్నాకే ఏ పనైనా చేయాలి. సొరకాయ బుర్రలోని నీళ్లు కూడా అయిపోయాయి. కాళ్లు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో?’ అని తనలో తాను గొణుక్కుంటూ, తన చేతిలోని తీగ కొసను వదిలేసి చుట్టుపక్కల నీళ్లకొరకు వెదకసాగాడు పోలప్ప.

 

(పిల్లలూ... నారాయణ ఏమై ఉంటాడో ఊహించండి. అలాగే, నారాయణ స్థితికి కారణాన్ని కూడా మీ స్నేహితులతో చర్చించండి. చాదస్తం, మూఢ విశ్వాసాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తాయో తెలిసింది కదా!)

- శాఖమూరి శ్రీనివాస్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top