రాజ్యానికి రక్షణ కవచం

Sakshi Funday Childrens Story

పిల్లల కథ

రాయవరపుకోటను గజేంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. గజేంద్రవర్మకు ప్రజలంటే అమితమైన ప్రేమ. తన రాజ్యంలో ప్రజలకు ఎలాంటి లోటూ ఉండకూడదని భావించేవాడు. ప్రజల క్షేమం కోసం అహర్నిశలూ ఆలోచించేవాడు. ప్రజలు కూడా గజేంద్రవర్మను అభిమానిస్తూ, మహారాజు నిండు నూరేళ్లు బతకాలని దేవుని ప్రార్థించేవారు. కానీ గజేంద్రవర్మ బంధువులు ఎలాగైనా రాయవరపు కోటను తమ రాజ్యంలో కలుపుకోవాలని కలలు కనేవారు. గజేంద్రవర్మతో సన్నిహితంగా ఉంటూనే కపట ఉపాయాలు పన్నేవారు. ఇరుగుపొరుగు రాజ్యాలైన బంధువులు మనవారే మన మంచి కోసమే పాటుపడతారని గజేంద్రవర్మ అనుకునేవాడు.
ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు మీ బంధువులే అయినా, మన రాజ్యంపై కన్ను వేశారని దోచుకోవాలని చూస్తున్నారని మహారాజు గజేంద్రవర్మకు ఎందరు చెప్పినా నమ్మేవాడు కాదు. వారు మన శ్రేయోభిలాషులు అంటూ చిరునవ్వు చిందించే వాడు. మరోసారి అలాంటి ప్రస్తావన తేకూడదని చెప్పేవాడు. రాయవరపు కోట రాజ్యం చుట్టూ పెద్ద అడవులు ఉండేవి. అడవులలోకి ఎవరికీ అనుమతి ఉండేది కాదు. దారులలో మాత్రమే పొరుగు రాజ్యాలకు ప్రయాణం సాగేది. అడవుల మూలంగా వర్షాలు కురవడం వల్ల ప్రజలు పంటలు పండించుకుంటూ జీవనాధారం పొందేవారు. పంటలు పండటం మూలంగా మహారాజు నుంచి ప్రజలు ఏమీ ఆశించేవారు కాదు. మహారాజు కూడా మితిమీరి పన్నులు వసూలు చేయకుండా ప్రజలు సంతోషంగా బతకమనేవాడు. పొరుగు రాజ్యాల్లో వర్షాలు లేక కష్టపడుతూ, గజేంద్రవర్మ వద్ద అప్పుగా ధనం తీసుకెళ్లేవారు గజేంద్రవర్మ కూడా వారికి సాయపడేవాడు.

ఒకసారి గజేంద్రవర్మ పొరుగు రాజ్యాల గురించి ఇంతలా చెప్తున్నారు, వారి సంగతి తెలుసుకుందాం అనుకున్నాడు. కొన్ని దశాబ్దాలుగా అప్పుగా తీసుకున్న ధనం చెల్లించాలని పొరుగు రాజ్యాలకు వర్తమానం పంపాడు. ‘‘మాకు వర్షాలు లేక పంటలు పండక కష్టాల్లో ఉన్నాం. మేము మీకు తిరిగి అప్పులు చెల్లించాలా? లేదు మేము దండయాత్ర చేసి మీ రాజ్యాన్ని ఆక్రమించుకుని దోచుకుంటాం’’ అని తిరుగు వర్తమానం పంపారు. విషయం తెలుసుకున్న గజేంద్రవర్మ నమ్మలేకపోయాడు. చేసేది లేక రాజ్యాన్ని యుద్ధానికి సన్నద్ధం చేసి, పొరుగు రాజ్యాల దారుల్లో నిలిపాడు. పొరుగు రాజ్యాలు దారుల వెంట సైన్యాన్ని ఎదుర్కోవడం కష్టమని  రాజ్యం చుట్టూ ఉన్న అడవుల గుండా లోనికి ప్రవేశించాలని బయలుదేరారు.
అడవులలో ఉన్న పొదలు నరుక్కుంటూ ముందుకు సాగారు. ఎంత ముందుకు వెళ్లాలన్న చెట్లను చేమను గడ్డిపరకలను కొమ్మలను తగిలి కింద పడసాగారు. ఒక్క రోజంతా అడవి గుండా వెళ్దామన్నా మైలు కూడా దాటలేకపోయారు. అలసిసొలసి కిందపడిపోయారు. చెట్ల కదలికలు, శబ్దాలు విన్న పులులు సింహాలు ఏనుగులు జంతువులు అరుపులతో రాసాగాయి. పొరుగు రాజ్య సైనికులంతా బతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు.

అడవుల మూలంగా ప్రకృతి పచ్చదనంతో పాటుగా రాజ్యానికి రక్షణ కవచంలా ఉపయోగపడతాయని పొరుగు రాజ్యాల రాజులు తెలుసుకుని, అడవుల గుండా వెళ్లి రాయవరపు కోటను ఆక్రమించుకోవాలని అనుకున్న భ్రమ నుంచి బయటపడ్డ రాజులు గజేంద్రవర్మను క్షమించమని వేడుకున్నారు. తప్పుకు క్షమించమని అప్పులు కడతామని చెప్పారు. గజేంద్ర వర్మ చిరునవ్వుతో ‘‘నాకు ధనం ముఖ్యం కాదు. మీ గుణం తెలిసింది. మీరు బంధువులని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఇక నుంచి బుద్ధిగా మెలగండి’’ అంటూ హెచ్చరించాడు. గజేంద్రవర్మ పంటల కోసం రాజ్య రక్షణ కోసం అడవులు పెంచుతున్నారని తెలుసుకుని ప్రజలు ఆనందించారు. గజేంద్రవర్మ ప్రజల క్షేమమే ధర్మం అంటూ రాజ్యపాలన చేయసాగాడు.
- ఉండ్రాల రాజేశం

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top