సాయి సంస్కృత పండితుడా?

Sai Patham  Interchange 16 - Sakshi

సాయిపథం – అంతర్వేదం 16

ఎవరికైనా కొంత పాండిత్యం పట్టుబడితే చాలు తమ పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఎవర్ని నలుగుర్లోనూ కించపరుద్దామా? అనే దృష్టితో ఎక్కువ మంది కనిపిస్తారు. కొందరైతే అప్పటికప్పుడు అవతలివారి తక్కువదనాన్ని గుర్తించి మనసులో ఒక అంచనాకి వచ్చి మౌనంగా ఉంటారు. ఇక కొందరైతే చాటుగా వేళాకోళం చేస్తూ కనిపిస్తారు. సాయిది మాత్రం మరొకర్ని తక్కువ చేసే లక్షణం కానే కాదు. అవతలి వ్యక్తికి తన స్థాయి స్పష్టంగా తనకే అర్థమయ్యేలా, నొప్పించకుండా అర్థమయ్యేలా చేయడం సాయి ప్రత్యేకత. ఉదాహరణతో గమనిద్దాం!

దీని అర్థం ఇదేనా?
నానా(నానాసాహెబ్‌ ఛాందోర్కర్‌) సాయికి మంచి భక్తుడు. నిరంతరం సాయి సేవలోనే ఉంటూ ఉండేవాడు. ఓ రోజున ఎప్పటిలాగానే సాయి పాదాలని చేతులతో ఒత్తుతూ తనకి బాగా ఇష్టమైన భగవద్గీత శ్లోకాలని లోలోపల కూనిరాగంలాగా తీస్తూ పాడుకోవడం మొదలుపెట్టాడు. జ్ఞానసంన్యాసయోగమని ఓ యోగముంది భగవద్గీతలో. దానిలోని 34వ శ్లోకాన్ని నానా చిన్నగొంతుతో పాడటం మొదలెట్టాడు ఓ పక్క సాయి పాదాలని ఒత్తుతూ. సాయి వెంటనే.. నానా! శ్లోకాన్ని చాలా బాగా పాడుతున్నావు గానీ, లోలోపల గొణుగుతూ చదవడమెందుకు? పైకే పాడు ఆ శ్లోకాన్ని నేనూ వింటాను అన్నాడు. నానాకి మరింత సంతోషమైంది. శ్రావ్యంగానూ కొంత పెద్ద గొంతుతోనూ స్పష్టంగా పాడి విన్పించాడు నానా. ఆ శ్లోకం ఇదే.

త ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా!
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శినః అనేది.

అప్పుడు సాయి.. ‘‘నానా! ఈ శ్లోకానికి అర్థాన్ని ‘ప్రతి పదానికీ ఇది అర్థం’ అంటూ నాకు చెప్పవూ?’’ అని అడిగాడు.సాయికి సంస్కృతం రాదనీ, ఆ కారణంగా తానే దానికి అర్థాన్ని సాయి అంతటివానికి చెప్పే అవకాశాన్ని పొందగలిగాననీ నానా ఆనందపడుతూ అర్థాన్ని వివరించసాగాడు.‘ప్రణిపాతేన – సాష్టాంగ ప్రణామం చేతనూ, పరిప్రశ్నేన – ప్రశ్నించడం చేతనూ, సేవయా – సేవించడం చేతనూ, తే – నీకు, తత్‌త్వ దర్శినః – తత్త్వసాక్షాత్కారాన్ని పొందిన, జ్ఞానినః – జ్ఞానులు, జ్ఞానమ్‌ – జ్ఞానాన్ని, ఉపదేక్ష్యంతి – ఎంతో శ్రద్ధతో బోధిస్తూ నీకు అర్థమయ్యేలా చేస్తారు. తత్‌ – ఏ ప్రకారంగా ఆ జ్ఞానం బోధింపబడుతుందో దాన్ని, విద్ధి – శ్రద్ధతో గమనించి తెలుసుకో!ఓ గురువు నుంచి జ్ఞానాన్ని పొందాలంటే అది సాష్టాంగ ప్రణామం ద్వారా, ప్రశ్నించి తెలుసుకోవడం ద్వారా, ఆ గురువుకి సేవని చూస్తూ ఉండటం ద్వారా అది సాధ్యం. ఇంతకీ జ్ఞానాన్ని బోధించగల ఆ తత్త్వాన్ని తెలిసిన గురువు నుంచి పై పద్ధతుల్లో దేని ద్వారా ఆ జ్ఞానం లభిస్తుందో దాన్ని శ్రద్ధతో గమనించి తెలుసుకో! అనేది దానర్థం అని పరమ సంతృప్తిని పడుతూ చెప్పాడు నానా.ఇంతేకాదు. మళ్లీ సాయి ఈ చెప్పిందాన్ని మరోలా చేస్తూ చెప్పకుండానూ, అలాగే తన పాండిత్యపు లోతు సాయికి అర్థమయ్యేలాగానూ, పరమానందపడుతూ ఈ పై వ్యాఖ్యానానికి కొనసాగింపుగా ‘ఆనందగిరివ్యాఖ్యానం శంకరానంద శ్రీధర వ్యాఖ్యానం, శంకర భాష్యం, మధుసూదన వ్యాఖ్యా.. నీలకంఠ వ్యాఖ్యా.... కూడా ఈ విషయాన్నే చెప్పాయి’ అని నానా చెప్పి తన మాటలకి సాయి ప్రతిస్పందన ఏమిటో తెలుసుకునే ఉద్దేశంతో ఓ పక్క ధైర్యం, ఆత్మసంతృప్తితోనూ.. మరో పక్క అదో తీరు భయం, అధైర్యంతోనూ.. సాయి ముఖంలోకే చూస్తూ ఉండిపోయాడు నానా.ఇతర భక్తులంతా నానా సంస్కృత పండితుడైన కారణంగానూ, సాయికి సంస్కృత పాండిత్యమున్నట్లు ఏనాడూ విన్న– కన్నవారు లేని కారణంగానూ, సాయి ఏమంటాడోనని అలా చూస్తూ ఉండిపోయారు అటు నానానీ ఇటు సాయినీ. సాయి ప్రారంభించాడు. నానా! పై శ్లోకంలోని మూడవ పాదాన్ని ఒక్కసారి చూడు. ‘ఉపదేక్ష్యంతి తే జ్ఞానమ్‌’ అని కదా నువ్వు చదివింది. దానికి అర్థాన్ని వివరించినది కూడాను. సంస్కృత వ్యాకరణం ప్రకారం దీన్ని ‘తే+అజ్ఞానమ్‌’ అని కూడా విడదీయవచ్చు. (ఏజః పదాం తాదతి అనే సూత్రం ప్రకారం ఇది శాస్త్రం అంగీకరించిన సత్యమే) ఆ పద్ధతిలో మరి జ్ఞానులంతా అజ్ఞానాన్ని ఉపదేశిస్తారని అన్నామనుకో! ‘ఇలా చెప్పడం తప్పు!’ అని ఎలా అనగలవు? నేనేదో నిన్ను తగ్గించడానికో, ఏదో మెలిక పెట్టి అవమానించడానికో నీతో అంటున్న మాట కాదు. ఇలా ఎవరైనా నిన్నడిగితే ఏం సమాధానం చెప్పగలుగుతావు? ఇది మొదటి సందేహం. 

రెండవది. కృష్ణుడు కదా గీతని ఉపదేశించాడు! ఆయన ఏమంటున్నాడని ఈ శ్లోకం చెప్తోంది? ‘తత్త్వాన్ని దర్శించిన జ్ఞానులు నీకు జ్ఞానం అంటే ఏమిటో ఆ విశేషాలని వివరిస్తారు’ అని కదా! అంటే మరి ఉపదేశిస్తూన్న కృష్ణుడు తత్త్వదర్శి కాడా? జ్ఞాని కాడా? ఆయనే మరి తత్త్వదర్శులయిన జ్ఞానుల దగ్గరికి వెళ్లాలని చెప్తూన్నవాడు అవుతుంటే ఇక ఈయన ఎందుకు గీతని అర్జునునికి బోధించాలి? పైగా ‘అన్నీ తెలిసినవాడ్ని నేనే’ (వేదాహం సమతీతాని..) అని ఆయనకాయనే భగవద్గీతలో చెప్పుకున్నాడు కదా! మరి ఆయనే ఫలానివాళ్లు తత్త్వదర్శులు, జ్ఞానులు అని చెప్పకూడదా?మరోమాట కూడా! ఆయనే భగవద్గీత చేస్తూ (భగవంతుడ్ని, అతని స్వరూపాన్ని గూర్చిన విశేషాలని గానం చేస్తూ) జ్ఞానమంటే ఏమిటో, విజ్ఞానమంటే ఏమిటో, ఏం తెలుసుకుంటే ఇక తెలియవలసిందంటూ ఏదీ ఉండదో.. దాన్ని తెలియజేస్తున్నాను (జ్ఞానం తేహం సవిజ్ఞానమ్‌.. అవశిష్వతే) అన్నాడో దీన్నంతటినీ ఆలోచిస్తూంటే తికమక అయిపోతోంది.అందరూ నోరెళ్లబెట్టి చూస్తుంటే, నానాకి నోటమాట రాకపోతూంటే సాయి చెప్పుకుపోతున్నాడు.నానా! ఇక చివరి అనుమానాన్ని విను. సాష్టాంగప్రణామం చేస్తే జ్ఞానం ఉపదేశింపబడుతుందా? మామూలు తేలికపదాన్ని వాడకుండా నమస్కారమనే అర్థంలో ‘ప్రణిపాతం’ అనేంత గట్టిపదాన్ని వాడాల్సి వచ్చిందట? అలాగే ప్రశ్నిస్తూ ఉంటే జ్ఞానం ఉపదేశింపబడుతుందా? అయినా ప్రశ్నించడం అనకుండా పరిప్రశ్న చేయడమనేంత గట్టిపదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? మరొక్కమాట... సేవ చేస్తే జ్ఞానాన్ని ఉపదేశిస్తారా? ఇదేంమాట? జ్ఞానమనేది అంత తేలికైనదా? అని ప్రశ్నార్థకంగా నానాని చూశాడు సాయి.

మల్లయుద్ధంలో చిత్తుచిత్తుగా ఓడిపోయినవానిలా నానా అక్షరం కూడా మాట్లాడలేక, సాయిపాదాలు రెంటినీ గట్టిగా పట్టుకుని ‘సాయిదేవా! నువ్వు అనన్యసామాన్యుడివి. మహా ప్రతిభా సంపన్నుడివి. ఇన్ని మార్లు భగవద్గీతలోని ఈ అధ్యాయాన్ని చదివినా సమాధానాలు ఎలాగూ తెలియనే తెలియవు గానీ, కనీసం ఇలాంటి ప్రశ్నలు ఈ శ్లోకం చదివితే వస్తాయి, వచ్చేందుకు అవకాశముందనే విషయం కూడా తెలియని అజ్ఞానంతో ఉన్నాను. దయచేసి సమాధానాల్ని చెప్పి నాకు జ్ఞానబోధ చేయి తండ్రీ!’ అన్నాడు నానా.సాయి ప్రారంభించాడు. ‘‘ఏం లేదు నానా? ఆందోళన పడకు! జ్ఞానాన్ని సంపాదించాలంటే జ్ఞానపిపాసి అయిన వ్యక్తి సద్గురువుని ఏ తీరుగా ఆశ్రయించాలో చెప్పే శ్లోకం ఇది.ప్రణిపాతమనే మాటకి సాష్టాంగనమస్కారమనేది అర్థమే కావచ్చు గానీ ఒట్టిగా సాష్టాంగ ప్రణామాలవల్ల జ్ఞానం ఉపదేశింపబడదు. ప్రణిపాతమంటే ‘సర్వస్య శరణాగతి’ అని అర్థం. ఏనుగుకాస్తా చెరువులో దిగింది. మొసలి దాని ముందు రెండుపాదాలనీ పట్టింది. మొసలి నీటిలోనికీ, ఏనుగు ఒడ్డువైపుకీ లాగుకుంటూ ఒకర్ని మరొకరు గెలవాలని ప్రయత్నించారు. సాధ్యపడలేదు. అప్పుడు ఏనుగు – నీవే తప్ప ఇత్ః పరం బెరుగ..! ఓ! దైవమా! నన్ను రక్షింప సమర్థుడివి నువ్వే సుమా! అంటూ తన శరీర మనః ప్రాణ బుద్ధులతో శరణుకోరి ప్రార్థించింది. అదుగో అదీ ‘సర్వస్య శరణాగతిః’ అంటే. ద్రౌపది నిండు కౌరవసభలో వస్త్రాపహరణం జరగబోతున్న తరుణంలో సర్వస్యశరణాగతిధర్మంతో కృష్ణుడ్ని ప్రార్థించింది. ఇదే విధంగా సుగ్రీవుడు కూడా వాలితో యుద్ధానికి తలపడి పూర్తిగా ఓడిపోయి రాముణ్ని శరణువేడాడు. ఆ రాముడు వాలిని వధించాడంటే దానికి కారణం సుగ్రీవుని బలాధిక్యం కాదు. సుగ్రీవుడు చేసిన శరణాగతి ధర్మం మాత్రమే. కాబట్టి ప్రణిపాతమంటే.. శరణుకోరుతూ, తనని తాను రక్షించే వ్యక్తికి సమర్పించుకోవడమని అర్థమన్నమాట.

ఇక ప్రశ్నించడమనే మాటకి.. ఎదుటివానికి విసుగొచ్చేంత స్థాయిలో ప్రశ్నించడమని అర్థం కాదు. ప్రశ్న అనకుండా ‘పరిప్రశ్న’ అనడమంటే వేదాంతానికి సంబంధించిన ప్రశ్న వేయడమని అర్థమన్నమాట! అంతే కాదు. కొందరు – ఎదుటివానికి ఎంత తెలుసు? అనే దుర్బుద్ధితో, అతనికి తెలిసిన దాన్ని కాదనిపించాలనే వంకర బుద్ధితో, ఏమేమో మోసంతో నిండిన ప్రమాణాలని చూపించి, నిజం కానిదానిని నమ్మింపజేసి, వారితో కూడిన సభలో వాళ్లని బహిరంగంగా ఓడించి, తాము గొప్పవారనిపించుకోవడం.. వంటి ఇలాంటివి సరికాదన్నమాట. శ్రద్ధతో, భక్తితో కేవలం విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో మాత్రమే ప్రశ్నించడం, అందునా లౌకికమైన ధోరణిలో కాకుండా వేదాంతానికి సంబంధించి ప్రశ్నించడమే ‘పరిప్రశ్న’. మూడవ పదం ‘సేవ’ అనే మాటకి అర్థం గురువుగారికి పాదాలొత్తడం, దూరం నుంచి నూతి నీళ్లు తోడి తేవడం, ఇంకా మూఢభక్తితో ఆయనకి ఒళ్లు తోమడం.. వంటివన్నీ జ్ఞానాన్ని పొందే మార్గాలు కానే కావు.9 విధాల భక్తి మార్గాలున్నాయి. స్నేహపూర్వకంగా ఉండే భక్తి సఖ్యభక్తి. దీనికి ఉదాహరణ అర్జునుడు. తన రథానికి సారథిగా ఉంచుకోవడమే కాక భక్తితో స్నేహాన్ని శ్రుతిమించకుండా చేశాడు. పరీక్షిన్మహారాజుకి పాము కాటు శాపం రాగానే శుకమహర్షి దగ్గర అధ్యాత్మ విద్యని నేర్చుకోవడం కోసం మోక్షతత్వాన్ని గురించి విన్నాడు. ఇది శ్రవణభక్తికి ఉదాహరణ. నిస్వార్థంగా దాస్యాన్ని చేసి రామునికి, సీతమ్మ జాడని చెప్పడమే కాక, రాముని మీద ప్రయోగించదలిచి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని దాచి ఉంచుకుంటే దాన్ని తనమీదే ప్రయోగించేలా చేసుకున్న ఆంజనేయుడు దాస్య భక్తికి ఉదాహరణ. శరీరంలోని పంచజ్ఞానేంద్రియాలతోనూ సంపూర్ణభక్తితో వందనం చేసి తరించిన అక్రూరుడు (భాగవతంలో) వందనభక్తికి ఉదాహరణ. సంవత్సరకాలం పాటు రాజ్యాన్ని విడిచి, భార్యతో కలిసి, ఓ మధువనంలో ఉంటూ రాజసౌఖ్యాలనీ, లాంఛనాలనీ విడిచి కృష్ణుడినే సేవించిన అంబరీషుడు అర్చన భక్తికి ఉదాహరణ. తన హృదయపూర్వకమైన సేవతో ఒక్క తులసిదళానికే తన భర్త కృష్ణుడు తూగిపోయేలా చేసుకుని విజేత్రి(గెలిచినది) అయిన రుక్మిణి సేవాభక్తికి ఉదాహరణ. విదురుడు, భీష్ముడూ మొదలైన పెద్దలు కృష్ణుడ్ని ఏనాడూ వ్యక్తిగా కాక ఎల్లప్పుడూ దైవంగానే ఆరాధిస్తూ తమ అంతఃకరణం నిండుగా దైవంగానే అనుకున్నారు. ఇది ఆత్మలో ఎరుక అంటే ఆత్మనివేదన భక్తికి ఉదాహరణ. నిరంతరం సంకీర్తన చేస్తూ తన భక్తిని చాటుకుని, విజయాన్ని సాధించిన నారదుడు సంకీర్తన భక్తికి ఉదాహరణ. తనకి ప్రాణాపాయం లేనే లేదనే ధైర్యంతో తన తండ్రి చంపదలచి, ప్రయత్నాలు చేస్తున్నా చలించని ప్రహ్లాదుడు చింతనమనే 9 వ భక్తికి ఉదాహరణ. అలా ఈ తీరు ఏదో ఒక భక్తిమార్గంలో సేవిస్తూ ఉండడం సేవ కిందికొస్తుంది తప్ప గురువుకి భౌతికంగా చేసే సేవ.. సేవాభక్తి కిందికి రాదు.సాయి ఇలా చెప్పేస్తూ ఉంటే.. సాయి ఇంతటి లోతు పాండిత్యాన్ని ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరి నుంచి గ్రహించాడు? అనే భావంతో అందరూ నిశ్చేష్టులై వింటూండిపోయారు. కేవలం అది ఆయన చేసిన మంత్రమననశక్తి మాత్రమే అనేది స్పష్టంగా అర్థం కాసాగింది అందరికీ.

అప్పుడు సాయి మాట్లాడుతూ.. ఇంకొక్క విషయాన్ని చెప్పి ముగిస్తానంటూ జ్ఞానం గురించి చెప్పాడిలా.ఏ గురువూ ఏ శిష్యునికీ జ్ఞానాన్ని గురించి చెప్పడు. చెప్పలేడు కూడా. పంచదార అనేది తీపిగా ఉంటుందని చెప్తే తెలియదు అలా వినడం ద్వారా. ఏవేవో గ్రంథాల్లో చదివితే అర్థమయ్యే విషయం కాదు. స్వయంగా దాన్ని తిన్నప్పుడే ఆ విషయం ఎవరూ చెప్పనంతగా, చెప్పలేనంతగా అర్థమవుతుంది. దీన్నే ఆది శంకరుల వారు అనుభూతి అన్నారు. ఏది ప్రత్యక్షంగా తెలియదో, గ్రంథాల ద్వారా అనుభవానికి రాదో, రాలేదో, వచ్చే వీలులేనిదో, ప్రత్యక్షం, పరోక్షం అనే రెండింటి ద్వారా కాక స్వయంగా అనుభవంలో మాత్రమే తెలిసేదో అదే అపరోక్ష అనుభూతి అవుతుందన్నమాట.సాయి ఇంతలోతుగా చెప్తుంటే కొందరికి ఈ వేదాంతం కొంతస్థాయిలోనే అర్థమవుతున్నా.. ఓ మహమ్మదీయునికి ఇంతటి వైదిక సంస్కారమా? అనుకున్నారు. పూర్తిగా తెలియకున్నా వినాలనే ఆసక్తి పెరుగుతూ వింటూనే ఉండిపోయారు.సాయి చెప్పసాగాడు. భగవద్గీతలో కృష్ణుడన్నాడు ‘అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః’ అని.అందరికీ ఉండేది అజ్ఞానమే. దాన్ని తొలగిస్తే చాలు జ్ఞానమంటే ఏమిటో తెలుస్తుంది.ఉదాహరణకి సూర్యుడ్ని, చంద్రుడ్ని రాహుకేతుగ్రహాలు గ్రహిస్తాయి. దాన్నే గ్రహణం తొలిగాక పూర్తిగా వారి ప్రకాశం మనకి సొంతమవుతుంది. గురువనే వారెవరు ఉన్నారో ఆయన మనకున్న ఆ అజ్ఞానాన్ని తొలగించడమనే పనిని మాత్రమే చేస్తాడు. అద్దం నిండా దుమ్ము, ధూళి, నూనె మరకలు వంటివి పడితే మనరూపం కన్పించకుండా పోతుంటే, దాన్ని ఎలా శుభ్రపరచాలో అలా శుభ్రం చేసిన రోజున మన రూపం ప్రతిబింబితమవుతుంది. ఆ దుమ్ము, ధూళి, నూనె మరకలు వంటివి అజ్ఞానంతో సమానం. దాన్ని తుడిచి శుభ్రపరిచినవాడు గురువు. అద్దానికున్న ప్రతిబింబించగలిగే గుణం జ్ఞానలక్షణం. ఇలా శుభ్ర పరుచుకోవాలనే విధానాన్ని తెలిపిన గురువు ద్వారా ఈ విషయాన్ని గ్రహించడం అనుభవంలోనికి తెచ్చుకుని, నిత్యం శుభ్రపరుచుకుంటూ ఉండటం ‘జ్ఞానం’.

‘తాడుని చూసి పామేమో అనుకుని భయపడతాం. తాడు గురించిన, పాముని గురించిన జ్ఞానం కలిగిన గురువు మనలో పాముని గురించిన అజ్ఞానపు ఆలోచనని తొలగించి తాడే సుమా! అనే జ్ఞానాన్ని కలిగిస్తే అతను గురువూ – అది జ్ఞానస్వరూపమూనూ. కాబట్టి మట్టిపట్టిన బంగారాన్ని ఎలా నిప్పులో వేసి కాల్చి నిజమైన మేలిమి బంగారపు ముద్దని పైకి తెచ్చి చూపిస్తారో అలా గురువు ఎప్పుడూ తన వద్దకొచ్చిన శిష్యుల అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానదర్శనాన్ని చేయించుతాడే తప్ప తాను కొత్తగా జ్ఞానమంటూ మరి దేన్నో బోధించడు. బోధించలేడు.’‘జ్ఞానమనేది ఎప్పుడూ ఉన్నదే. ఎక్కడా ఉండేదే. దాని మీద ఉన్న – మనకి అర్థం కాకుండా ఉన్న ఆ అడ్డునీ, అవరోధాన్నీ, ముసుగునీ తొలగిస్తే చాలు. జ్ఞానమనేది ఎవరికి వారికే తెలుస్తుంది. అర్థమవుతుంది. అనుభవంలో కన్పిస్తుంది అని ఈ శ్లోకం అర్థం’ అని ముగించాడు సాయి.నానాతో పాటు వింటున్న ఆ భక్తులంతా సాయి పాదాలని కౌగిలించుకున్నట్లుగా ఒకరి వెంట ఒకరు చుట్టేశారు. ఇప్పటివరకూ చూసిన సాయిని మరింత స్పష్టంగా, లోతుగా, అవగాహనతో చూశారు. సాయికున్న అత్యద్భుత యోగశక్తి, తపశ్శక్తి, మంత్రమననశక్తి కారణంగా సంస్కృత పండితుడైన, వ్యాఖ్యాన గ్రంథాలని ఔపోశనపట్టిన వాడైన నానాకి కూడా అర్థం కాలేదని తనకి తానే అంగీకరించేలా వ్యాఖ్యానించాడు సాయి అనుకున్నారు నానాతో సహా.నేడు మనం కూడా గ్రహించుకోవల్సింది ఒక్కటే. సాయికి ఇష్టమైన నైవేద్యాలు, సాయికి ఇష్టమైన ప్రదేశాలు, సాయికి ప్రీతికరమైన ఊదీ(విభూతి)ని ధరించడాలు మాత్రమే చేస్తూ.. సాయికి దగ్గరివాళ్లం అయిపోయామనుకోకూడదు. సాయిని గురించిన ఈ తత్త్వాన్ని తెలిపే చరిత్రలని చదివి, దాన్ని హృదయంలో ఉంచుకోగలగాలి. అప్పుడే సాయి మనకి అర్థమవుతాడు. మనకి అర్థం ఎక్కడైనా కాలేదన్నచోట తానే వచ్చి, మనకి అర్థమయ్యేలా తనని తాను వివరించుకుంటాడు. అందుచేత సాయి చేసిన ప్రతిపనీ, ప్రతిమాటా, ప్రతి సంఘటనా వెనుక ఎంతో అర్థం ఉంటుందన్నమాటే!‘మేకని కోసి చంపాల్సిందే!’ అని సాయి ఓ భక్తునికి ఆజ్ఞాపించాడు ఒకసారి. ఇదేమిటి? జీవహింసని చేయవలసిందని దైవసమానుడైన సాయి ఆజ్ఞాపించాడా? అందునా ఓ బ్రాహ్మణుడ్ని..? ఏమిటి అంతరార్థం? తెలుసుకుందాం అజ్ఞానాన్ని తొలగించుకుని..!
– సశేషం 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top