
బాలికల విద్యకు ప్రేమ్‌జీ చేయూత
ఏటా రూ.750 కోట్ల స్కాలర్‌షిప్పులు
2.5 లక్షల మందికి ప్రయోజనం
వచ్చే మూడేళ్లలో రూ.2,250 కోట్ల కేటాయింపు
మరోసారి పెద్దమనసు చాటుకున్న విప్రో
మనదేశంలో ఆడపిల్లలు చదువుకోవాలంటే ప్రధాన సమస్య డబ్బు. ప్రాథమిక విద్య పూర్తి కాగానే.. ఆర్థిక స్థోమత లేక, పెళ్లీడు రాగానే పెళ్లిచేసి పంపించేస్తే సరిపోతుందని.. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. అయినా ఇప్పటికీ లక్షల మంది బాలికలు బడికి పోవడం లేదు. అలాంటి అమ్మాయిల ఉన్నత విద్యకు చేయూత ఇచ్చేందుకు అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ (Azim Premji Foundation) ముందుకొచ్చింది. వచ్చే మూడేళ్లలో ఏటా రూ.750 కోట్ల చొప్పున బాలికల కాలేజీ చదువుల కోసం భారీ ఎత్తున రూ.2,250 కోట్లు వెచ్చించనుంది.
అజిమ్ ప్రేమ్ జీ..
దేశంలోని అపర కుబేరుల్లో ఒకరు. ఆయన స్థాపించిన విప్రో కంపెనీ అంటే విలువలకు పెట్టిందిపేరు. అజిమ్ ప్రేమ్‌జీ అనగానే దాతృత్వం గుర్తుకొస్తుంది. 2019లో విప్రో కంపెనీలో తన వాటా 7.6 బిలియన్ డాలర్లను తన అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 2023 జనవరి వరకు సేవా కార్యక్రమాల ద్వారా రూ.2,40,000 కోట్లు ఖర్చు చేసినట్లు అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ వెల్లడించింది.
కరోనా సమయంలో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, ఇతర సాయం కోసం సుమారు రూ.2,000 కోట్లు ఖర్చు చేశారు. కర్ణాటకలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు 2024 నుంచి.. వారంలో నాలుగు రోజులు ఉచితంగా కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. దీనిద్వారా 55 లక్షల విద్యార్థులకు గుడ్లు అందించేందుకు ఏడాదికి రూ.800 కోట్ల వ్యయం చేస్తున్నారు. చెప్పుకొంటూ పోతే ఈ జాబితా పెద్దదే. ఇంత దొడ్డ మనసున్న ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
2.5 లక్షల మందికి..
అజిమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్ పథకం ద్వారా ఎంపికైన మొత్తం 2,50,000 మంది అమ్మాయిలకు సంవత్సరానికి రూ.30వేల చొప్పున స్కాలర్‌షిప్ అందజేస్తారు. అంటే సంవత్సరానికి రూ.750 కోట్లు.. మూడేళ్లకు రూ.2250 కోట్లు మేర బాలికల ఉన్నత విద్య కోసం అజిమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ వెచ్చించనుంది. తద్వారా దేశంలో∙లాభాపేక్షలేని సంస్థ ద్వారా అమలవుతున్న భారీ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ – డీబీటీ) గా ఇది నిలవనుంది.
అజిమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి, 12వ తరగతి పూర్తి చేసుకున్న అమ్మాయిలు అజిమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీ లేదా యూనివర్సిటీలో రెగ్యులర్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో చేరిన అమ్మాయిలు కూడా దరఖాస్తుకు అర్హులే. ఇలా ఆయా కోర్సులో చేరి స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులకు కోర్సు పూర్తయ్యే వరకూ ఏటా రూ.30వేల ఉపకారవేతనం అందుతుంది. ఇలా మూడేళ్ల డిగ్రీ లేదా డిప్లొమా కోర్సు పూర్తి చేసుకునే వరకూ ప్రతి విద్యార్థినికి మొత్తం రూ.90వేల ఉపకార వేతనం లభిస్తుంది. ప్రతి ఏటా సెపె్టంబర్‌లో ఈ స్కాలర్‌షిప్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకు అవసరమైన పత్రాలు.. పదో తరగతి, 12వ తరగతి మార్కుల పత్రాలు, డిగ్రీ లేదా డిప్లొమా కాలేజీలో అడ్మిషన్ లెటర్/బోనఫైడ్ సర్టీఫికెట్, ఫీజు రిసిఫ్ట్, పాస్‌పోర్టు ఫొటోలు.
ప్రేమ్‌జీ ఫౌండేషన్
విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్‌జీ ఆధ్వర్యంలో 2001లో అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఏర్పాటైంది. దాతృత్వ కార్యక్రమాల ద్వారా దేశాభివృద్ధిలో పాల్పంచుకోవాలనే ఆశయంతో ఏర్పాటు చేసిన లాభాపేక్షలేని సంస్థ ఇది. ఈ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, జీవనోపాధి తదితర రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ‘బాలికలు ఉన్నత విద్యను పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో అజిమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్ పూర్తిచేసిన బాలికలు ఈ ఉపకార వేతనం పొందేందుకు అర్హులు. ఉన్నత విద్యను పూర్తిచేసుకోవడంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే బాలికలు అజిమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్ ద్వారా వారు తమ చదువులు కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. ఉన్నత విద్యావంతులైన మహిళలు తమ జీవితంలో సాధికారతను సాధించగలరు’అంటారు అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సీఈవో అనురాగ్ బెహరా.
https://azimpremjifoundation.org/
ఉన్నత విద్యలో చేరేది మూడొంతులే..
ఆర్థిక సర్వే 2024–25 ప్రకారం దేశంలోని 15 లక్షల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 25 కోట్ల మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో సగం మంది ప్రభుత్వ బడుల్లోనే చదువుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో సగటు చేరికలు (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) 93 శాతం ఉంటే.. ఆరో తరగతికి వచ్చేసరికి అది 77.4 శాతానికి డిపోతోంది. కేవలం 56.2 శాతం మంది మాత్రమే 12వ తరగతి పూర్తి చేసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా కేవలం మూడోవంతు మంది కాలేజీ విద్యలో చేరుతున్నారు. కాలేజీల్లో చేరే వారిలో బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య తక్కువే. దీనికి ప్రధాన కారణం ఆర్థిక వెనుకబాటుతనం.
విప్రో సామాజిక బాధ్యత
విప్రో కంపెనీ సామాజిక బాధ్యత కింద భారీ ఎత్తున అనేక కార్యక్రమాలు చేపడుతోంది. విప్రో వార్షిక నివేదిక 2023–24 ప్రకారం.. 2023–24లో ఆ సంస్థ సీఎస్‌ఆర్ కార్యక్రమాల కోసం రూ.17,900 కోట్లకుపైగా వెచ్చించింది. దీనిద్వారా విద్య, వైద్యం, డిజిటల్ స్కిల్లింగ్ వంటి అంశాల్లో 17 దేశాల్లోని 45 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 2020–21 నుంచి 2023–24 వరకు.. మనదేశంలో విద్యా రంగంలో 29 లక్షల మంది లబ్ధి పొందారు. ఇదే సమయంలో.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విభాగంలో 38 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది.