నా భార్యను నేను మార్చలేనా?!

నా భార్యను నేను మార్చలేనా?! - Sakshi


జీవన గమనం

రచయితగారూ, నా భార్య మీద నాకున్న ఫిర్యాదులన్నీ రాస్తున్నాను. వీటిని ఎలా డీల్ చేయాలో దయచేసి తెలుపగలరు.

 - పసుపులేటి, ఖమ్మం




అయ్యా, మీరు రాసిన 16 ఫిర్యా దులూ చదివాను. మీ శ్రీమతిగార్ని వ్రాయమంటే ఆమె కూడా మీ గురించి ఈ విధంగానే రాస్తారని నా ఉద్దేశం. కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. చదవండి: ‘‘... నా గురించి ఆలోచించడు. అన్నీ తను చెప్పినట్టే జరగాలనుకుంటాడు.



సిగరెట్లూ, డ్రింక్సూ తగ్గించుకుంటే బాగుంటుంది. ఆయనకి కోపం వస్తే తట్టుకోలేం. ఆయన స్నేహితులందరూ బేవార్స్‌గాళ్లు. అనవసరంగా వాళ్లతో సమయం వృథా చేసుకుంటారు. ఎక్కువసేపు నాతో గడపరు. నాతో ఆర్థిక విషయాలేవీ చర్చించరు. నిజానికి ఆయన రాబడి ఎంతో కూడా నాకు తెలీదు. తన తరఫు వారితో చాలా దగ్గరితనం ప్రదర్శిస్తారు.



అన్నిటికీ తల్లినే సంప్రదిస్తాడు. పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తే తన బాధ్యత తీరిపోయిందనుకుంటాడు. మా బంధువుల గురించీ, తల్లిదండ్రుల గురించీ మనసు బాధ కలిగేలా హేళనగా ప్రవర్తిస్తాడు.’’

 

చాలా? ఇంకా ఫిర్యాదులు చెప్ప మంటారా? ప్రతీ సమస్యకీ పరిష్కారం విడాకులు కాదు. మనం అవతలి వారిని మార్చాలనుకోవడం భ్రమ. ఇంపాసిబుల్. మనం మారటమే ఉత్తమమైన మార్గం. మీరు పంపిన ఫిర్యాదులూ, నేను రాసినవీ కలిపి ఇద్దరూ చర్చించండి. కొన్ని కామన్ పరిష్కారాలు దొరకవచ్చు.

 

ఫేస్‌బుక్ స్నేహాల మీద మీ అభిప్రాయమేమిటి?

- రామకృష్ణ, మెదక్




అవతలివారెవరో తెలియదు. అయినా తరచూ మాట్లాడాలని అనిపించటం, గాఢంగా స్నేహం చెయ్యాలన్న తపన, ఫోన్లో ఆత్మీయమైన కబుర్లు, ఒకరోజు చాటింగ్ చేయకపోతే మనసు కొట్టు కోవటం, స్కైపులో చూసుకోకపోతే స్కై కూలిపోయిన భావన మొదలైనవి ఈ విభాగంలోకి వస్తాయి. ఎదుటి వ్యక్తి తెలి యని కారణంగా, కావలసినట్టు ఊహించు కునే వీలుండటం వల్ల, ఈ స్నేహాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. అంతే ప్రమాదకరంగా పరిణమిస్తాయి కూడా.

 

అమ్మాయిల పేరుతో ఫేస్‌బుక్ నడిపే అబ్బాయిల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫేస్ బుక్‌లో అమ్మాయి చెప్పే సినిమా కష్టాలు విని, ఆమె అకౌంటులో పదివేలకు పైగా వేసిన తరువాత గానీ ‘తాను వేస్తోంది అబ్బాయి అకౌంటులో’ అన్న విషయం నా స్నేహితుడి మనవడికి తెలియరాలేదు.

 

ఆర్నెల్ల క్రితం జరిగిన మరో యథార్థ సంఘటన పేపర్లో చదివే ఉంటారు.

అమెరికాలో సెటిలైన ఒక గుంటూరు ముద్దుగుమ్మకి ఫేస్‌బుక్‌లో ఒక టంగుటూరు కుర్రాడు పరిచయం అయ్యాడు. మూడ్రోజుల పరిచయం మూడు రాత్రుల్లో ప్రేమగా మారి, హద్దులు దాటి, సరిహద్దులు దాటి, గాలి ముద్దులతో ముదిరి, ఏకాంతపు సద్దుల్లో మాటల రొమాన్స్ వరకూ వెళ్లింది. మను వాడబోయేవాడు, మనవాడే కదా అని తనువంతా స్కైప్‌లో ఆచ్ఛాదన లేకుండా చూపించింది. ఇతగాడు దాన్ని రికార్డ్ చేసి, రికార్డ్ స్థాయిలో బ్లాక్‌మెయిల్ చేయసాగాడు.



కొన్ని లక్షలు కోల్పోయాక అతడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఇంటరాగేషన్‌లో తేలిందేమిటంటే, అమ్మాయిల్ని ఈ విధంగా మోసం చేసి పబ్బం గడుపుకోవటమే అతగాడి వృత్తట. ఆర్నెల్ల క్రితం పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

 ఫోను స్నేహాలూ, ఫేస్‌బుక్ పరిచయాలూ సాధారణంగా ఈ విధంగానే ముగుస్తాయి. మగవాళ్లే కాదు. అమ్మాయిలూ తెలివి మీరిపోయారు.



సెల్-కార్డ్‌కి డబ్బుల్లేకపోయినా ‘ఖరీదు’గా నటిస్తూ, అవతలివారిచే ధారాళంగా ఖర్చు పెట్టించేవాళ్లూ, నలుగురైదుగురు స్నేహితుల్ని ఒకేసారి మెయిన్‌టైన్ చేసేవారూ, కొత్త స్నేహితుడు దొరగ్గానే పాత ఫ్రెండ్ నంబరు ఆటో-రిజెక్ట్ లిస్ట్‌లో పెట్టేవారూ, ఒకరు పంపిన ప్రేమ సందేశాన్ని మరొకరికి పంపి, ఆ జవాబుని తిరిగి మొదటి ప్రేమికుడికి పంపి చేతులు దులుపుకునేవారూ ఉన్నారు.

 

సినీరంగంలో అమ్మాయిలు కాలు జారక తప్పదని ఒక అభిప్రాయం ఉన్నది. మోసపోయేది అమ్మాయిలే కాదు. ఇటీవల కాలంలో దాదాపు అయిదారుగురు పెద్ద పెద్ద దర్శకులు, సినీ రచయితలు కూడా ఇలాంటి బంధాల్లో ఇరుక్కుని, బ్లాక్ మెయిల్‌కి గురై, చాలా మానసిక వ్యథ అనుభవించి, కోట్లు కుమ్మరించి ఆ కష్టాల్నుంచి బయటపడ్డారు.

 

ఒక దర్శకుడికి ఫోన్లో ఒకావిడ పరిచయమై, ఇంటర్నెట్‌లో అందమైన అమ్మాయి ఫొటో పంపి, మానసికంగా దగ్గరై (!), ‘ఏకాంతంలో నీ భార్యతో నీవెలా ఆత్మీయంగా గడుపుతావో నాకు చూపించవా’ అని గోముగా రెచ్చగొట్టి, ఆపై అతను జరిపిన సంభాషణా, పంపిన వీడియోలూ, భార్యపై కామెంట్సూ టీవీ చానల్స్‌లో బహిర్గతం చేస్తానని బెదిరించి, లక్షలు వసూలు చేసింది. హీరో విలన్ల మధ్య ఎత్తుకి పై ఎత్తు కథాంశాలున్న సినిమాలు తీస్తాడని పేరున్న సదరు నంబర్ వన్ దర్శకుడి నిర్హేతుక భయం చూసి సినీపరిశ్రమ విస్తుబోయింది.

 - యండమూరి వీరేంద్రనాథ్

 

ప్రకటన: దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. వాటిని ఎలా అధిగమించాలో తెలియక, మన వ్యక్తిత్వాన్ని ఎలా మలచుకోవాలో, ఉన్నతమైన వ్యక్తిగా ఎలా ఎదగాలో తెలియక తల్లడిల్లుతుంటాం. మీరు అలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే మాకు రాయండి.



జీవన గమనంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు యండమూరి పరిష్కారాలు సూచిస్తారు.

మా చిరునామా: జీవన గమనం, సాక్షి ఫన్‌డే, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.
funday.sakshi@gmail.com

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top