తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

Garimella Satyanarayana Birth Anniversary - Sakshi

ధ్రువతారలు

నేడు గరిమెళ్ల సత్యనారాయణ జయంతి

స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. స్వాతంత్య్ర సమర యోధులపై బ్రిటిష్‌ పాలకుల దమనకాండ దారుణంగా కొనసాగుతున్న రోజులవి. అలాంటి రోజుల్లో ఒక సామాన్యమైన తెలుగు కవి తెల్లదొరల అరాచకాలను తెగనాడుతూ గొంతెత్తాడు. ఆయన కలం నుంచి జాలువారిన తెలుగు పాట– ఆయన గళం నుంచి ఎలుగెత్తిన తెలుగు పాట– ఒకే ఒక్క తెలుగు పాట తెల్లదొరల వెన్నుల్లో వణుకు పుట్టించింది. ఆ పాట తెలుగునాట నలుచెరగులా మార్మోగింది. 
‘‘మాకొద్దీ తెల్లదొరతనము.. దేవా.. మా కొద్దీ తెల్లదొరతనము..’’ అనే పాట రాసిన ఆ కవి గరిమెళ్ల సత్యనారాయణ. 
‘‘పన్నెండు దేశాలు పండుచున్నగాని పట్టెడన్నము లోపమండి...
ఉప్పు ముట్టుకుంటే దోషమండి
నోట మట్టి కొట్టి పోతాడండి
అయ్యో! కుక్కలతో పోరాడి కూడు తింటామండి...’’
అంటూ ఆ పాటలో నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తూ ఆయన పాడుతుంటే ఆబాల గోపాలమూ గొంతు కలిపేవారు. ఉద్యమావేశంతో ఉర్రూతలూగిపోయేవారు. జనాలను ఉర్రూతలూగించే కవి గాయకుడు జనంలో ఉంటే తమ ఉనికికే ముప్పు తప్పదని తలచిన బ్రిటిష్‌ పాలకులు ఆయనను అరెస్టు చేసి, జైలుకు పంపారు.

‘సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అనే జాషువా మాట గరిమెళ్ల సత్యనారాయణకు అక్షరాలా అతికినట్లుగా సరిపోతుంది. చిరకాలం ప్రజల నాల్కల మీద నర్తించే పాటను రాసిన గరిమెళ్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14న జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వెంకట నరసింహం. స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తర్వాత విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రిలలో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగింది. బీఏ పూర్తి చేశాక కొంతకాలం గంజాం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గుమస్తాగాను, మరికొంతకాలం విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగాను పని చేశారు. చిన్నవయసులోనే ఆయనకు మేనమామ కూతురితో వివాహం జరిగింది. స్వేచ్ఛాప్రియుడైన గరిమెళ్ల ఏ ఉద్యోగంలోనూ ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు.

స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో కలకత్తాలో 1920లో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణోద్యమం మొదలైంది. ఆ స్ఫూర్తితోనే గరిమెళ్ల వీరావేశంతో ఉద్యమంలోకి దూకారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము..’ అంటూ గొంతెత్తి పాడుతూ రాజమండ్రి వీధి వీధినా తిరిగారు. ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటే గొంతు కలిపారు. ఆనాటి రోజుల్లో ఆ పాట నకలు ప్రతులు ఒక్కొక్కటీ పన్నెండు పైసలకు అమ్ముడు పోయాయంటే, గరిమెళ్ల పాట ఏ స్థాయిలో జనాలను ప్రభావితులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్‌ కలెక్టర్‌కు తెలుగుభాష రాకపోయినా, గరిమెళ్ల చేత ఈ పాట పాడించుకుని విన్నాడు. తనకు భాష అర్థం కాకపోయినా, ఈ పాట జనాలను ఏ స్థాయిలో ఉద్రేకపరచగలదో ఊహించగలనంటూ గరిమెళ్లకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాడు.

ఆయన జైలు పాలైనా, కాంగ్రెస్‌ కార్యకర్తలు గాంధీ టోపీలు ధరించి ‘మాకొద్దీ తెల్లదొరతనము..’ అని పాడుకుంటూ ఊరూరా కవాతులు సాగించేవారు. శిక్ష పూర్తయ్యాక విడుదలైన గరిమెళ్ల మళ్లీ జనం మధ్యకు వచ్చి, ఎలుగెత్తి పాడటం మొదలు పెట్టారు. మళ్లీ ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ గుమిగూడి, ఆయనతో పాటే గొంతు కలిపి పాడసాగారు. సముద్రఘోషలాంటి ఆ పాట తెల్లదొరల గుండెల్లో సునామీలు సృష్టించింది. గరిమెళ్ల బయట ఉండటం ప్రభుత్వానికి క్షేమం కాదని తలచి మళ్లీ ఆయనను అరెస్టు చేశారు. కాకినాడ మెజిస్ట్రేటు ముందు హాజరుపరచారు. ఈసారి మెజిస్ట్రేటు ఆయనకు రెండేళ్ల  కఠిన కారాగార శిక్ష విధించారు. గరిమెళ్ల జైలులో ఉండగా, 1923లో ఆయన తండ్రి మరణించారు. అప్పుడు బ్రిటిష్‌ అధికారులు ఆయన ముందుకు ఒక ప్రతిపాదన తెచ్చారు. అదేమిటంటే– క్షమాపణ చెప్పి, బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ పాట పాడకుండా ఉండే వెంటనే విడుదల చేసేస్తామన్నారు. గరిమెళ్ల అందుకు అంగీకరించక శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు జైలులో ఉండటానికే సిద్ధపడ్డారు.

జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చాలా చోట్ల ఆయనకు ఘన సన్మానాలు చేశారు. అయితే, కొద్ది రోజులకే ఆయన భార్య మరణించింది. అప్పటికే ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వాళ్ల ఆలనాపాలన కోసం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. సరైన ఉద్యోగం ఎక్కడా లేకపోవడంతో అప్పుల పాలయ్యారు. అప్పులు తీర్చడానికి ఆస్తులను అమ్ముకున్నారు. కొంతకాలం ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేశారు. శ్రీ శారదా గ్రంథమాలను స్థాపించి, పద్దెనిమిది పుస్తకాలను అచ్చు వేయించారు. ఉద్యమకాలంలో ఆయన తరచు విజయనగరం, రాజమండ్రి, మద్రాసులకు తిరుగుతూ ఉండటంతో అచ్చు వేయించిన పుస్తకాలను అమ్ముకోవడంపై శ్రద్ధ పెట్టలేదు. చాలా పుస్తకాలు ఇంట్లోనే గుట్టలు గుట్టలుగా మిగిలిపోయాయి. వాటికి చెదలు పట్టి నాశనం కావడంతో ఆర్థికంగా నష్టపోయారు. గరిమెళ్ల తొలి పుస్తకం ‘స్వరాజ్య గీతాలు’ 1921లో అచ్చయింది. తర్వాత 1923లో ‘హరిజన గీతాలు’, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు, బాలగీతాలు వంటి రచనలు వెలుగులోకి వచ్చాయి.

జైలులో ఉన్న కాలంలో తమిళ, కన్నడ భాషలను నేర్చుకున్న గరిమెళ్ల, కొన్ని తమిళ, కన్నడ పుస్తకాలను కూడా తెలుగులోకి అనువదించారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య ఇంగ్లిష్‌లో రాసిన ‘ది ఎకనామిక్‌ కాంక్వెస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఇవేవీ ఆయనకు ఆర్థికంగా పెద్దగా ఉపయోగపడలేదు. జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ‘గృహలక్ష్మి’ పత్రికకు సంపాదకుడిగా కొంతకాలం పనిచేశారు. అక్కడ మానేసిన తర్వాత ఆచార్య రంగా నిర్వహించే ‘వాహిని’ పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరారు. కొన్నాళ్లకు ‘ఆంధ్రప్రభ’లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం ‘ఆనందవాణి’ సంపాదకుడిగా చేశారు. ఉద్యోగాల్లో స్థిరంగా కొనసాగలేకపోవడం వల్ల కొంతకాలం ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా పనిచేశారు. గరిమెళ్ల ఆర్థికంగా ఇక్కట్లు పడుతున్న కాలంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, వావిళ్ల వెంకటేశ్వర శాస్త్రలు ఆయనను ఆర్థికంగా కొంత ఆదుకున్నారు. ఒకవైపు పత్రికలకు, మరోవైపు ఆలిండియా రేడియోకు రచనలు చేస్తూ వస్తున్నా, ఆ ఆదాయం ఆయన కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా కుంగదీశాయి.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మన పాలకుల వల్ల ఆయనకు ఎలాంటి మేలూ జరగలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో జనాలను ఉర్రూతలూగించే పాట రాసినందుకైనా ఆయనకు ఎలాంటి ప్రభుత్వ సత్కారాలూ దక్కలేదు. చివరి దశలో ఆయనకు ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. ఏ పనీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో ఆయన యాచనతో రోజులను వెళ్లదీశారంటే, ఆయన పట్ల మన పాలకులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్య్రానంతరం దేశంలో ప్రబలిన అవినీతికి విసిగి వేసారిన గరిమెళ్ల మిత్రుల్లో కొందరు ఆయనను ‘మాకొద్దీ నల్లదొరతనము..’ అంటూ కొత్త పాట రాయాల్సిందిగా కోరారు. అయితే, నరనరానా దేశభక్తిని జీర్ణించుకున్న ఆయన అందుకు అంగీకరించలేదు. దుర్భర దారిద్య్ర పరిస్థితులతో పోరాడుతూనే ఆయన 1952 డిసెంబరు 18న తుదిశ్వాస విడిచారు. ఇరుగు పొరుగుల సహాయంతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన మరణం తర్వాత మేలుకొన్న మన ఘనత వహించిన పాలకులు శ్రీకాకుళంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పి దేశభక్తిని చాటుకున్నారు. 
- పన్యాల జగన్నాథదాసు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top