సింహానికి ప్రాణ భిక్ష

Funday Special Childrens Story - Sakshi

పిల్లల కథ

సింహం ఒకరోజు జంతువును వేటాడి చంపి తినసాగింది .అప్పటికే కడుపు నిండి పోవడంతో మిగిలిన మాంసాన్ని తనకు సహాయం చేసే జంతువుకు ఇవ్వాలని అనుకొంది. 
సింహానికి కొద్దీ దూరంలో ఉన్న కుందేలు సింహం వైపు చూస్తూ ‘‘ఏమిటి సింహం మామా! ఆ మాంసం తినకుండా అలాగే ఉన్నావు. కడుపు నిండి పోయిందా?’’ అడిగింది 
‘‘ఔను కుందేలూ! ఈ మాంసాన్ని నాకు ఆకలిగా ఉన్న సమయాన ఎక్కడ ఏ జంతువు ఉన్నదో తెలిపే ఆ నక్కకు ఇద్దామనుకుంటున్నాను. ఆ నక్క ఎక్కడకు వెళ్లిందో...’’
‘‘ఏదైనా నీలాంటి సింహం దగ్గర బాగా తిని ఉంటుంది. ఆకలి లేదు కాబట్టి రానట్లుంది. పాపం చెట్టుమీద ఆ కాకులు, గద్దలు నీ వైపే చూస్తున్నాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావంటే ఆ పక్షులన్నీ ఒక్కసారిగా వచ్చి పూర్తిగా తినేస్తాయి.’’
‘‘నాకు సహాయం చేసేవాటికే ఈ మాంసం ఇద్దామనుకుంటున్నాను...’’
‘‘సింహం మామా! నువ్వు మళ్లీ పొరపాటు పడుతున్నావు. ఒకసారి మీ తాతయ్య వేటగాడి వలలో పడితే చిట్టెలుక ఆ వలను కొరికి ప్రాణభిక్ష పెట్టిందన్న సంగతి గుర్తుందా?’’
‘‘ఎలుక అంటే సరే... కానీ ఈ పక్షులు నాకు ఏమి సహాయం చేస్తాయి?’’ 
‘‘సింహం మామా! ఎలాగూ ఆ మాంసం తినడానికి ఎవరూ లేనప్పుడు ఆ పక్షులకు ఇచ్చి పుణ్యం తెచ్చుకో.’’
‘‘పుణ్యం కోసం అని చెప్పావు బాగుంది. నువ్వు చెప్పినట్లే ఆ పక్షులు తినడానికి వీలుగా నేను ఇక్కడి నుంచి వెళ్తాను’’ అంటూ సింహం అక్కడి నుంచి వెళ్లిపోయింది.

జరిగినదంతా చూస్తున్న కాకులు, గద్దలు ఒక్కసారిగా ఆ జంతుమాంసం దగ్గరకు వచ్చి తిన్న తరువాత కుందేలు చేసిన సహాయానికి మెచ్చుకున్నాయి. 
ఒక రోజు సింహం నిదురపోతున్న వేళ పక్షుల అరుపులతో సింహం ఒక్కసారిగా మేలుకొని చిరాకుగా పక్షుల వైపు చూస్తూ ‘‘ఏమిటీ  కాకిగోల’’ అని కోపంగా అంది 
‘‘సింహం మిత్రమా! ఇద్దరు వేటగాళ్లు విల్లంబులతో మిమ్మల్ని చంపడానికి వస్తున్నారు. మీరు వెంటనే గుహలోకి వెళ్ళండి’’ అంది కాకుల నాయకుడు సింహం వెంటనే గుహలోకి వెళ్లి దాక్కొంది. వేటగాళ్లు వచ్చి చాలా సేపు చూసిన తరువాత తిరిగి వెళ్లారు. సింహం గుహ బయటకు వచ్చి ‘‘ఓ పక్షుల్లారా! మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు..’’ అంటూ తన కృతఙ్ఞతలు తెలుపుకొంది. ఆ తరువాత  సింహం కాకుల స్నేహం దినదినాభివృద్ధి చెందసాగింది.
ఇప్పుడు సింహం ఏ జంతువును వేటాడినా అందులో కొంత భాగం చెట్టుపైనున్న తన మిత్ర పక్షులకు ఇవ్వడం అలవాటు చేసుకొంది.
- ఓట్ర ప్రకాష్‌ రావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top