పరిమళ

devils most-haunted at Yorkshire - Sakshi

కిర్ర్‌..ర్‌..!

దెయ్యాలు ఉన్నాయని ఎవరితోనూ వాదించడు విశ్వాస్‌. ‘ఉన్నాయి’ అని మాత్రం అంటాడు. అని, అక్కడితో ఆగిపోతాడు. ‘నువ్వు చూశావా? ను..వ్వు... చూ..శా..వా?’ అని ఎవరైనా వాదనకొస్తే నవ్వుతాడు. మనం చూసినవన్నీ, తిరిగి చూపించలేం అని అతడికి తెలుసు. అందుకే నవ్వుతాడు. అదీకాక దెయ్యాల్ని వాదనలోకి లాగడం అతడికి ఇష్టం లేదు. దెయ్యాల్ని అతడు రెస్పెక్ట్‌ చేస్తాడు. మనుషుల కన్నా ఎక్కువగా!

కొన్నాళ్ల క్రితం వరకైతే విశ్వాస్‌ వాదించేవాడు. దెయ్యాలు ఉన్నాయని కాదు... దెయ్యాలు లేవని! దెయ్యాలు ఉన్నాయని పర్సనల్‌గా అతడికి రూఢీ అయ్యాక.. ఉన్నాయనే వాదన మొదలుపెట్టాలి కదా. పెట్టలేదు!విశ్వాస్‌కి చిన్నప్పట్నుంచీ ఓ అలవాటు ఉండేది. తను ఇష్టపడేవాళ్ల గురించి మాట్లాడడు. ఎవర్నీ మాట్లాడనివ్వడు. అతడికి తన చెల్లి అంటే ఇష్టం. తన కన్నా రెండేళ్లు చిన్న. కుదురుగా బొమ్మలా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఎప్పుడూ అన్నతోనే ఉంటుంది. పెళ్లయిపోయాక ఇప్పుడు భర్తతో ఉంటోంది. బావ తన చెల్లిని బాగా చూసుకుంటాడని విశ్వాస్‌కి తెలుసు. కానీ ఎందుకో అతడు బావతో ఎక్కువగా మాట్లాడడు. బావ దగ్గర చెల్లి గురించి అసలే మాట్లాడడు. బావ.. చెల్లి గురించి మాట్లాడుతున్నా వినడానికి ఇష్టపడడు.ఆరో తరగతిలోనో, ఏడో తరగతిలోనో స్కూల్‌ రీసెస్‌లో ఆడుకుంటున్నప్పుడు వేరే తరగతి కుర్రాడొచ్చి విశ్వాస్‌ చెవిలో ఏదో చెప్పాడు. ఆ చెప్పినవాడి చెంప ఛెళ్లు మనిపించాడు విశ్వాస్‌. వెంటనే అక్కడి నుంచి వెళ్లి.. ఆ కుర్రాడు ఎవరి పేరైతే చెప్పాడో వాడి చొక్కా పట్టుకుని ముందుకు గుంజి, వాడి దవడ పగల కొట్టాడు. వాడి పన్ను ఊడి రక్తం కూడా వచ్చింది. ఇంత రక్తపాతానికి కారణం.. ‘పరిమళ బాగుంటుంది కదా’ అని ఆ పన్ను ఊడిన వాడు తన క్లాస్‌మేట్‌తో అనడం. ఆ క్లాస్‌మేట్‌ వచ్చి విశ్వాస్‌కి చెప్పడం. పరిమళ విశ్వాస్‌ చెల్లెలు. ఆ స్కూల్లోనే చదువుతోంది.‘‘ఏంటన్నయ్యా.. ఎవర్నో కొట్టావంటా..’’ అని స్కూల్‌ నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు దారిలో పరిమళ అడిగింది.‘‘వాడు నా పెన్సిల్‌ కొట్టేశాడు. అందుకే కొట్టాను’’ అని చెప్పాడు విశ్వాస్‌.చెల్లి భుజంపై ఉన్న స్కూల్‌ బ్యాగ్‌ని ఆరోజు తనే మోశాడు ఇంటి వరకు. ‘బరువేం లేదన్నయ్యా’ అని చెల్లి అంటున్నా వినకుండా.

విశ్వాస్‌ బ్యాచిలర్‌. సిటీలో మంచి ఉద్యోగం. మంచి ఉద్యోగం మాత్రమే కాదు.. అతడు ఎక్కడ అద్దెకు ఉన్నా ఆ చుట్టుపక్కల వాళ్లకు అతడు మంచి అబ్బాయి కూడా. రూమ్‌లో ఒక్కడే ఉంటాడు. తక్కువగా మాట్లాడతాడు. ఎక్కువగా చదువుతుంటాడు. ఏవో పుస్తకాలు.. పెద్దపెద్దవాళ్లు రాసినవి. ఉద్యోగానికి వెళ్లడం, రావడం, మెస్‌లో తినడం, నిద్రొచ్చేవరకు పుస్తకాలు చదువుకోవడం. ఇదీ అతడి రొటీన్‌. కానీ ఎప్పుడూ ఒకే రూమ్‌లో ఉండిపోడు. మారుతుంటాడు! ఏడాదికి రెండు మూడు రూములైనా మారుతుంటాడు. దెయ్యాల భయంతో అనుకోకండి. మనుషులతో పడలేక! అద్దెకిచ్చినవాళ్లు ఆ పైనో, కిందో ఉండి గట్టిగా పోట్లాడుకుంటున్నా చాలు.. విశ్వాస్‌ తన గదిలో తను ఉండలేకపోయేవాడు. వెంటనే ఇంకో రూమ్‌ని వెతుక్కుని షిఫ్ట్‌ అయిపోయేవాడు.దెయ్యాలు లేవు అని నమ్మే కాలంలో విశ్వాస్‌ ఓసారి అప్పటికప్పుడు రూమ్‌ మారవలసిన పరిస్థితి వచ్చింది. కారణం.. దెయ్యాలు, పిశాచాలు కాదు. ‘వద్దు’ అంటున్నా వినకుండా ఓనర్లు అతడికి ఏదో ఒకటి తినడానికి తెచ్చి పెడుతున్నారు! వాళ్లను తప్పించుకోడానికి రెండుమూడిళ్లు వెతికి నాలుగో దానికి అడ్వాన్స్‌ ఇచ్చి వచ్చాడు. ఆ సాయంత్రమే షిఫ్ట్‌ అయిపోయాడు. షిఫ్ట్‌ అవడానికి విశ్వాస్‌ గదిలో పెద్దగా ఏమీ ఉండవు. చాప, బకెట్, బట్టలు, కొన్ని పుస్తకాలు. అంతే.

విశ్వాస్‌కి అది కొత్త రూమే కానీ, అవడానికైతే పాత గది. కాకపోతే కాస్త పెద్ద గది. పార్టిషన్‌గా లోపల పిట్టగోడలాంటి చిన్న గోడ. గోడకు అవతల బాత్రూమ్‌. ఇవతల రూమ్‌. తనకు సరిపోతుంది.సాయంత్రం నాలుగవుతోంది. రూమ్‌లోకి షిఫ్ట్‌ కాగానే గోడకు జారిగిల పడి వెల్లకిలా నేలపై పడుకున్నాడు విశ్వాస్‌. రిలాక్స్‌ అవడానికి కాదు. ఊరికే అలా పడుకున్నాడు.  చాప వేసుకోలేదు. దిండు అలవాటు లేదు.పడుకున్న కొద్దిసేపటికే విశ్వాస్‌లో ఏదో అలజడి. ఊపిరి అందనట్టు అనిపిస్తోంది. పైకి లేవబోయాడు! కానీ లేవలేకపోతున్నాడు. ఎవరో గుండెమీద కూర్చున్న ఫీలింగ్‌. బలవంతంగా పైకి లేచి గది తలుపుల్ని నెట్టుకుని ఒక్క అంగలో బయట పడ్డాడు. వీధి వెలుగులో అతడి గుండె తేలికయింది. నవ్వుకున్నాడు. అతడికి చిత్రంగా అనిపించింది. మళ్లీ లోపలికి వెళ్లాడు. అతడి మనసు ఏదో తెలుసుకోవాలనుకుంటోంది.అదే ప్లేస్‌లో మళ్లీ అలాగే వెల్లకిలా పడుకున్నాడు. అంతే! అతడి గొంతు బిగుసుకుంది. అతడు మళ్లీ లోపలికి రావడం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఎవరో అతడి గొంతును గట్టిగా నులిమేస్తున్నారు. విడిపించుకోవాలని ప్రయత్నించాడు. తన వల్ల కావడం లేదు. గట్టిగా విదిలించుకుని లేచి, బయటికి పరుగెత్తాడు.ఆ రాత్రి పాత రూమ్‌లోనే పడుకున్నాడు విశ్వాస్‌. మర్నాడు లేవగానే తను షిఫ్ట్‌ అయిన కొత్త రూమ్‌ ఓనర్స్‌ దగ్గరికి వెళ్లాడు. వాళ్లు ఆ పైఫ్లోర్‌లోనే ఉంటారు.

విశ్వాస్‌ బెల్లు కొట్టగానే ఇంటావిడ బయటికి వచ్చింది.‘‘రూమ్‌ మారిపోతున్నానండీ. అడ్వాన్స్‌ మీరే ఉంచుకోండి’’ అన్నాడు విశ్వాస్‌.ఆమె ఆశ్చర్యపోయింది. ‘అదేంటి బాబూ.. నిన్ననే కదా చేరావ్‌’ అంది.జరిగింది చెప్పకూడదనే అనుకున్నాడు విశ్వాస్‌. కానీ అమె బలవంతం చేసింది. జరిగింది జరిగిన ట్టుగా కాకుండా, ఇంకో విధంగా చెప్పాడు విశ్వాస్‌. ఆ ఇంకోవిధాన్ని ఆమె సరిగ్గానే ఊహించినట్టుంది. ‘‘మా ఇంట్లో అలాంటివేమీ ఉండవు బాబూ’’ అంది!విశ్వాస్‌ నొచ్చుకున్నాడు.. ‘అలా అని కాదండీ..’ అన్నాడు.  సడన్‌గా అప్పుడే.. వీళ్ల మాటల్ని వింటూ ఉన్న.. ఆ ఇంట్లోని చిన్నపాప వీళ్ల మధ్యలోకివచ్చింది.వచ్చి,‘‘పార్వతక్కేమో మమ్మీ’’ అంది!విశ్వాస్‌ అదిరిపడ్డాడు.  ‘‘ఏయ్‌.. వెళ్లి ఆడుకోపోవే’’ అని ఆ చిన్నారిని తరిమేసింది ఇంటావిడ.లైఫ్‌లో ఫస్ట్‌ ౖటñ మ్‌ దెయ్యాలకు భయపడ్డాడు విశ్వాస్‌. అయితే ఆ భయం కొద్ది రోజులకే దెయ్యాల మీద ఇష్టంగా మారిపోయింది.  అమ్మానాన్న తనను ప్రేమగా చూడ్డం లేదని ఆ ఇంట్లోని పార్వతి అనే అమ్మాయి అప్పటికి కొద్దిరోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుందని తెలిశాక విశ్వాస్‌కి నిజంగానే దెయ్యాలంటేఇష్టం గలిగింది. తన చెల్లి పరిమళ కంటే కూడా ఎక్కువగా అతడిప్పుడు దెయ్యాల్ని ఇష్టపడుతున్నాడు.

దెయ్యాలు లేవు అని నమ్మే కాలంలో విశ్వాస్‌ ఓసారి అప్పటికప్పుడు రూమ్‌ మారవలసిన పరిస్థితి వచ్చింది. కారణం... దెయ్యాలు, పిశాచాలు కాదు.
- మాధవ్‌ శింగరాజు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top