పండితుడి గర్వభంగం | Children Story On Funday 14th July 2109 | Sakshi
Sakshi News home page

పండితుడి గర్వభంగం

Jul 14 2019 10:47 AM | Updated on Jul 14 2019 10:47 AM

Children Story On Funday 14th July 2109 - Sakshi

శ్రీరంగపురాన్ని విజయసింహుడు ఎంతో సమర్థంగా పరిపాలిస్తున్నాడు. సంగీత సాహిత్యాలను బాగా ఆదరించేవాడు. అతని మంత్రి సుశర్మ. 
ఒక రోజు మహారాజు కొలువుతీరి ఉండగా రామబ్రహ్మం అనే పండితుడు వచ్చి ‘‘మహారాజా! నేను దేశ దేశాలు తిరిగి నా పాండిత్యంతో ఎందరో పండితులను ఓడించి ఇన్ని కంకణాలను గెలుపొందాను’’ అని చేతికున్న కంకణాలను చూపించాడు. 
‘‘ఇప్పుడు మీ రాజ్యంలోని పండితులను ఓడించడానికి వచ్చాను. నాతో పోటీకి దిగని పక్షంలో మీరు ఓటమిని అంగీకరించి నా కాలికి గండపెండేరం తొడగాలి!’’ అని సవాలు చేశాడు.
 ‘‘అయ్యా! మహాపండితుల వారు మీ పోటీకి మేము అంగీకరిస్తున్నాము. కాకపోతే పోటీ ఎల్లుండి ఉంటుంది. మీకు సమ్మతమేనా?’’ అన్నాడు మహామంత్రి సుశర్మ. 
‘‘నాకు సమ్మతమే’’ అన్నాడు పండితుడు.
‘‘చాలా సంతోషం అంతవరకు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి’’ అన్నాడు మహారాజు. 
‘‘సంతోషం మహారాజా!’’ అన్నాడు పండితుడు.
ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించే మంత్రిపైన మహారాజుకు పూర్తి నమ్మకం ఉంది.

రామబ్రహ్మం ఆ రోజుకు విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటిరోజు సుశర్మ ‘అలా మా రాజ్యంలోని సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఆలయాలను చూసి వద్దాము పదండి’ అని అతడిని తీసుకు వెళ్ళాడు.
అక్కడ గుడి పక్కగా ఆవరణలో ఎంతోమంది పెద్దలు కూర్చొని ఉండగా ఒక పన్నెండేళ్ళ పిల్లవాడు కొన్ని విషయాలను భోదిస్తున్నాడు. 
‘‘తోద్యవి యంనవి తయధేవి యిస్తావ దిఅ తీస్వరస క్షంటాక ల్లవ యిస్తాభిల తోనిదా విదేక్ష్మీల హంగ్రనుఅ డాకూ దిస్తుంద్ధిసి... కేనిత్రామా తఅం నునే ణ్ణితుడిపం నిఅ స్తేరికహంఅ రుద్దఇ లూల్లుత రుతావుమరదూ’’ అన్నాడు.
‘‘నువుఅ... నువుఅ దినప్పిచెవ్వును  త్యంసరక్షఅ’’ అన్నారు కూర్చున్న పెద్దలు.   
‘‘ఏంటి ఆ పిల్లవాడు ఏం చెబుతున్నాడు అది ఏ భాష?’’అన్నాడు పండితుడు. 
‘‘ఇది మీ లాంటి పండితులకు తెలియక పోవటమేమిటి అది తెలుగు భాష!’’ అన్నాడు సుశర్మ. 
పరువు పోతుందని ‘‘సంస్కృతమేమో అనుకున్నాను. అవును అది తెలుగు భాషే!’’ అన్నాడు తత్తరపాటు కప్పిపుచ్చుకుంటూ పండితుడు.

‘‘దేశ భాషలందు మన తెలుగు భాష లెస్స’’ అన్నాడు సుశర్మ. 
‘‘అవును... అన్నట్టు ఆ పిల్లవాడు ఎవరు?’’
‘‘అతను మహాపండితుడు శంకరశాస్త్రి గారి ముఖ్య శిష్యుడు సుధాముడు. అతనికి ఎన్నో భాషలలో పట్టు ఉంది.  రేపు పాండిత్యంలో మీతో తలపడబోయేది అతనే’’ 
‘‘అంత చిన్న పిల్లవాడు పాండిత్యంలో పోటీపడతాడా?’’
‘‘అవును శంకరశాస్త్రి గారు ఎక్కడ పోటీ జరిగినా ఆ సుధముణ్ణే పంపిస్తారు... అతనికి ఇప్పటివరకు ఓటమే లేదు’’
‘‘సరే విడిదికి పోదాము పదండి’’ అన్నాడు ముఖంలో రంగులు మారిన పండితుడు. 
విడిదికి చేరుకున్న పండితుడు ఎంతో ఆలోచించాడు ఆ పిల్లవాడు మాట్లాడే తెలుగు భాషే అర్థం కావడంలేదు ఇక సంస్కృత భాష ఎలాగుంటుందోనని భయపడ్డాడు. తెల్లవారితే ఆ పిల్లవాడితో పోటీ, దానితో ఒక నిర్ణయానికి వచ్చాడు.

ఒంటరిగా మహారాజును కలిసి’’ మహారాజా! నాకు ఆరోగ్యం సరిగా లేదు నేను పోటీలో పాల్గొనలేను. నాకు సెలవు ఇప్పించండి ఇప్పుడే మా రాజ్యం చేరుకుంటాను’’ అన్నాడు. 
అప్పుడే అక్కడకు వచ్చాడు మంత్రి సుశర్మ.
‘‘చూడండి మహామంత్రి! ఈ పండితులవారికి ఆరోగ్యం సరిగా లేదట పోటీలో పాల్గొనలేను అంటున్నారు. వెంటనే రాజ వైద్యుణ్ణి పిలిపించి వీరి ఆరోగ్యం బాగు చేయించండి. రేపు వీరు పోటీలో పాల్గొనాలి!’’ 
‘‘చిత్తం మాహారాజా! మెరుగైన వైద్యం అందించి రేపు పోటీలో పాల్గొనేలా చేస్తాను.’’
రాజ వైద్యుడు వచ్చాడు. పండితుణ్ణి పరీక్షించి ఒక గుళిక ఇవ్వబోయాడు. 
‘‘అయ్యో మహారాజా! నేను పోటీలో పాల్గొనలేను’’
‘‘పోటీలో పాల్గొన లేకపోవడానికి గల కారణం చెప్పండి?’’ అన్నాడు సుశర్మ. 
‘‘అయ్యా! మంత్రివర్యా! ఆ సుధాముడు మాట్లాడిన తెలుగు భాష కొంచెం విన్నట్టు అనిపిస్తుంది కానీ పూర్తిగా అర్థం కావడం లేదు పైగా నేను అది చదువుకోలేదు. ఆ పిల్లవాడితో నేను పోటీ పడలేను. సభలో ఓటమికంటే మీముందు ఓటమిని అంగీకరిచడం ఉత్తమమని తలచాను.’’
‘‘అయ్యో! మీలాంటి మహాపండితులతో పోటీ పడి ఓడిపోవడమే సుధాముడికి కావలసింది. మీరు వెళ్లిపోతే అతను నొచ్చుకుంటాడు’’ అన్నాడు సుశర్మ. 
‘‘ఇక మీదట ఎవ్వరితోనూ పాండిత్యంలో పోటీ పడను. ఈ నా చేతి కంకణాలు తీసి మీకు ఇస్తాను. వీటిని ఆ పిల్లవాడికి బహుమానంగా ఇవ్వండి... నన్ను ఈ రాత్రికే వెళ్లనీయండి’’ అని చేతికున్నవి తీయబోయాడు.

‘‘అవి తీయకండి మీరు వెళ్లడానికి అంగీకరిస్తున్నాను... కవులను, కళాకారులను, పండితులను ఆదరించడం మా దేశ ఆచారం!’’ అని వంద వరహాలు ఇచ్చి పట్టు వస్త్రాలతో సత్కరించి అతని ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేశాడు మహారాజు. 
పండితుడు మహారాజుకు, మంత్రికి ధన్యవాదాలు చెప్పి వెనుదిరిగాడు.
పండితుడు వెళ్ళిన తరువాత ‘‘ఏం మంత్రిగారు! ఈ పాండిత్య గండాన్ని ఎలా గట్టెక్కించారు?’’ అన్నాడు మహారాజు. 
‘‘ఏమీ లేదు మహారాజా! మన తెలుగునే మన సుధాముడితో తిరిగేసి మాట్లాడించేలా చేశాను. ఆ వాక్యాలు ఏమిటంటే... విద్యతో వినయం విధేయత వస్తాయి. అది సరస్వతీ కటాక్షం వల్ల లభిస్తాయి దానితో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. 
అంత మాత్రానికే నేను పండితుణ్ణి అని అహంకరిస్తే ఇద్దరు తల్లులూ దూరమవుతారు’’అని మంత్రి చెప్పాడు.
మంత్రి తెలివిని ఎంతగానో మెచ్చుకున్నాడు. మరుసటి రోజు సభలో పండితుడి విషయం చెప్పి  మంత్రిని, సుధాముణ్ణి ఘనంగా సత్కరించాడు మహారాజు. 
సభ చప్పట్లతో మార్మోగింది.
- యు.విజయశేఖర రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement