పారా మెడికల్ @ కెరీర్

పారా మెడికల్ @ కెరీర్ - Sakshi


వైద్య రంగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ వైద్య సేవలు విస్తరించడం..ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం.. వెరసి రోగులకు చికిత్సనందించడంలో వైద్యులకు సహాయంగా నిలిచే పారా మెడికల్ సిబ్బందికి డిమాండ్ పెరిగింది. రక్త పరీక్ష నుంచి రేడియాలజీ వరకు.. సిటీస్కాన్ నుంచి ఎండోస్కోపి వరకూ.. పారామెడికల్ సిబ్బంది సేవలు ఎంతో కీలకమైనవి. ఒక రకంగా చెప్పాలంటే వీరి తోడ్పాటు లేకుండా ఆయా విభాగాల పర్యవేక్షణ సాధ్యం కాదు. స్వల్ప వ్యవధి గల కోర్సుల ద్వారానే ఎలాంటి ఒడిదుడుకులు లేని స్థిరమైన ఉపాధిని, ఉద్యోగ అవకాశాలను అందించే పారామెడికల్ కెరీర్ గురించి తెలుసుకుందాం....   

 

వైద్య సేవల విస్తరణ వేగంగా జరుగుతోంది. కార్పొరేట్ ఆస్పత్రులు నగరాల్లోనే కాకుండా చిన్నచిన్న పట్టణాల్లో సైతం ఏర్పాటవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి తక్షణమే ఉపాధి లభిస్తోంది. పారామెడికల్ కోర్సులు విద్యార్థుల పాలిట కల్పతరువుగా మారాయి అంటున్నారు నిపుణులు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రవేశం కల్పించే ఈ కోర్సుల్లో చేరితే ఆకర్షణీయమైన కెరీర్‌కు మార్గం పడినట్లే.

 

అవకాశాలు:  విస్తరిస్తున్న కార్పొరేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్‌లో డాక్టర్‌కు అనుబంధంగా సేవలు అందించ డానికి పారా మెడికల్ సిబ్బంది తప్పనిసరి. డయాగ్నోస్టిక్ సెంటర్‌‌స, ఎక్స్-రే యూనిట్లు, సిటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ, ఈసీజీ సెంటర్లు, ఆపద సమయాల్లో రక్తం అందించే బ్లడ్ బ్యాంక్‌లు మనకు ప్రతి మండలం, జిల్లా కేంద్రాల్లోను కనిపిస్తాయి. వీటికి సుశిక్షితులైన పారామెడికల్ సిబ్బంది చాలా అవసరం. ఇటీవల కాలంలో గుండె సంబంధ శస్త్ర చికిత్సల సంఖ్య పెరిగింది. హృద్రోగ చికిత్సను అందించే ఫిజిషియన్‌కు సహకరించే పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్లు పాత్ర కీలకంగా మారింది. ఈ విభాగాల్లో సిబ్బందికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి పారామెడికల్ కోర్సు పూర్తయిన వెంటేనే ఉద్యోగం లభించడం ఖాయం.  

 

అర్హత: పారామెడికల్ కోర్సుల్లో ఇంటర్మీడియెట్ (సెన్సైస్) విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. సంబంధిత పర్యవేక్షణ విభాగం జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్), గాంధీ మెడికల్ కాలేజీ వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా పారామెడికల్ కోర్సులను అందిస్తున్నాయి.కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా పారామెడికల్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అందులో నైపుణ్యం ఉన్న వారిని నేరుగా రిక్రూట్  చేసుకుంటున్నాయి. ఎయిమ్స్ కూడా ఇటువంటి కోర్సులను అందిస్తోంది.

సాధారణంగా ఈ కోర్సుల కాలవ్యవధి ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది.

 

వేతనాలు: కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకు వేతనం లభిస్తుంది.  కార్పొరేట్ హాస్పిటల్స్‌లోనైతే రూ.10 వేల నుంచి 12 వేల వరకు అందుతుంది. తర్వాత అర్హత అనుభవం ఆధారంగా నెలకు రూ. 30 వేల వరకు సంపాదించవచ్చు పారామెడికల్‌కు సంబంధించి చాలా ఇన్‌స్టిట్యూట్‌లు వివిధ రకాల కోర్సులను అందజేస్తున్నాయి. వీటికి సరైన గుర్తింపు ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఇన్‌స్టిట్యూట్‌లలో చేరడం మంచిది.

 

ఎన్‌ఎస్‌డీసీ-హెచ్‌ఎస్‌ఎస్‌సీ ఏర్పాటు: దేశంలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కూడా సుక్షితులైన పారామెడికల్ సిబ్బంది తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్‌ఎస్‌డీసీ-జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ)..హెల్త్‌కేర్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ (హెచ్‌ఎస్‌ఎస్‌సీ)ను ఏర్పాటు చేసింది. ఇది పారామెడికల్‌కు సంబంధించి 29 విభాగాలను గుర్తించింది.

ప్రస్తుత అవసరాలకనుగుణంగా కోర్సు సిలబస్‌ను రూపొందించడంలో నిమగ్నమైంది. హెచ్‌ఎస్‌ఎస్‌సీ వివిధ అనుబంధ సంస్థల ద్వారా అందజేసే ఈ కోర్సులకు నిర్ణీత కాల వ్యవధి అంటూ ఉండదు. అభ్యర్థులు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని భావిస్తే వారిని హెచ్‌ఎస్‌ఎస్‌సీ పరీక్ష (అసెస్‌మెంట్)కు పంపొచ్చు. ఇందుకోసం సంబంధిత రంగ నిపుణులతో కూడిన ప్యానెల్ ఉంటుంది. ఈ ప్యానెల్ సదరు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, రిపోర్ట్ కార్డు అందజేస్తుంది. దాని ఆధారంగా దేశ వ్యాప్తంగా పారామెడికల్ ఉద్యోగాల కోసం ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.  

 

డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్

వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షలు నిర్వహణ, రిపోర్టింగ్ చేయడం మెడికల్ ల్యాబ్ టె క్నీషియన్ విధి. ఈ కోర్సు తర్వాత సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీగా బీఎస్సీ(ఎంఎల్‌టీ) చేయొచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ (సెన్సైస్) తర్వాత బీఎస్సీ ఎంఎల్‌టీలో ప్రవేశం పొందొచ్చు..

 

డిప్లొమా ఇన్  రేడియోథెరపీ టెక్నీషియన్

కేన్సర్ సంబంధిత చికిత్సలో రేడియోథెరపీ టెక్నీషియన్లు పాల్పంచుకుంటారు. కేన్సర్ ఏ స్థాయిలో ఉంది..? దానికి రేడియేషన్ ఎంత ఇవ్వాలి.. రేడియేషన్ అవసరం ఉందా,లేదా అనే  అంశాలను వీరే నిర్ణయిస్తారు.  

 

డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్

అవుట్ పేషంట్ డయాలసిస్ విభాగాల్లో డయాలసిస్ టెక్నీషియన్‌లు కీలక పాత్ర పోషిస్తారు. డయాలసిస్ చేసేటప్పుడు వినియోగించే పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి? ఆ పరికరాల నిర్వహణ, సంబంధిత అంశాలు ఈ కోర్సులో ఉంటాయి.

 

డిప్లొమా ఇన్ పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్

హృద్రోగ చికిత్స నిర్వహించే బృందంలో పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్ ది కీలక పాత్ర. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లకు సహాయపడటం.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఉపయోగించే హార్ట్-లంగ్ మిషిన్ ఎంపిక, అమరికలో పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్‌లు బాధ్యత తీసుకుంటారు. ఆపరేషన్ తర్వాత రోగికి అన్నివిధాలుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం గుండె సంబంధ శస్త్ర చికిత్సలు పెరుగుతుండటంతో వీరి అవసరం పెరుగుతోంది.

 

డిప్లొమా ఇన్  మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్

ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, సిటీస్కాన్, ఆల్ట్రా సౌండ్ వంటి పరీక్షల్లో రేడియాలజిస్ట్‌లకు వీరు సహాయపడతారు.

 

డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్

ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్థారణ, ‘బ్రోంకే స్కోపి’టెస్ట్ చేయడంలో రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌లు సంబంధిత వైద్యులకు సహాయపడతారు.

 

సర్టిఫికెట్ ఇన్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్

బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహించడంలో వీరి పాత్ర ముఖ్యమైంది. రక్తాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, బ్లడ్‌బ్యాంక్‌కు సంబంధించిన అన్ని రికార్డులను, ఇతర విధులను నిర్వహించడం వీరి ప్రధాన బాధ్యత.

 

సర్టిఫికెట్ ఇన్ అనస్థీషియా టెక్నీషియన్

శస్త్ర చికిత్స నిర్వహించే రోగికి అన స్థీషియా(మత్తుమందు) ఇవ్వడంలో.. సంబంధిత అంశాల నిర్వహణలో అనస్థీషియా టెక్నీషియన్‌లు, డాక్టర్లకు తగువిధంగా సహాయపడుతుంటారు.

 

సర్టిఫికెట్ ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్

ల్యాబ్ నిర్వహణ, ఫిల్మ్‌స్ డెవలప్‌మెంట్, ఇమేజింగ్ టెక్నాలజిస్ట్/రేడియాలజిస్ట్‌లకు సంబంధిత వ్యవహారాల్లో తగిన విధంగా సహాయం  చేయడం వంటి బాధ్యతలను వీరు నిర్వహిస్తుంటారు.

 

సర్టిఫికెట్ ఇన్ ఎమర్జెన్సీ పారా మెడిక్ టెక్నాలజిస్ట్

ఎమర్జెన్సీ సమయంలో గోల్డెన్ అవర్‌గా పరిగణించే సమయంలో ప్రమాదానికి గురైన వ్యక్తికి  కావల్సిన రెస్పిరేటరీ, కార్డియాక్ సపోర్ట్ అందివ్వడం, రిహ్రై డేషన్, రక్తం పోకుండా చూడడం వంటి అత్యవసర విధులను వీరు పర్యవేక్షిస్తుంటారు.

 

సర్టిఫికెట్ ఇన్ టెలిమెడిసిన్ టెక్నాలజిస్ట్

ఒక వ్యక్తికి ఏదైనా ఆనారోగ్యం కలిగితే.. దానికి సంబంధించిన మెడికల్ డయోగ్నోసిస్, ట్రీట్‌మెంట్ వంటి అంశాలపై సమాచారాన్ని టెలిమెడిసిన్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ నెట్‌వర్క్ కమ్యూనికేషన్ ఉపయోగించి టెలిమెడిసిన్ టెక్నాలజిస్ట్‌లు అందిస్తారు. ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు ఈ తరహా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి ఈ కోర్సు చేసినవారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.  

 

డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ

పుట్టుకతో మాట్లాడటంలో వచ్చిన లోపాలు, పదాలు/శబ్దాలను స్పష్టంగా పలకలేకపోవడం, మాటలు సరిగ్గా రాకపోవడం వంటి లోపాలను లాంగ్వేజ్ టెక్నిక్స్ ద్వారా సరిచేయడం వీరి ప్రధాన  బాధ్యత.

 

సర్టిఫికెట్ ఇన్ ఈసీజీ టెక్నీషియన్

ఈసీజీ టెక్నీషియన్ హృదయ స్పందనను రికార్డ్ చేసే ఈక్విప్‌మెంట్ ద్వారా రోగి హార్ట్ బీట్, తదితర అంశాలను రికార్డ్ చేసి సంబంధిత ఫిజీషియన్‌కు ఆ రికార్డులను అందజేస్తాడు. తద్వారా హార్ట్, వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్‌కు చికిత్స అందించడంలో సహాయపడతాడు.  

 

సర్టిఫికెట్ ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్

వివిధ పరీక్షల్లో భాగంగా తీసిన ఎక్స్‌రే ఫిల్మ్‌స్‌ను డెవలప్ చేయడం, సంబంధిత ల్యాబ్ నిర్వహణ వంటి బాధ్యతలను డార్క్ రూమ్ అసిస్టెంట్ నిర్వహిస్తాడు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top