తపఃఫలం

తపఃఫలం


 జ్యోతిర్మయం

 పూర్వజన్మల్లో చేసిన పుణ్యఫలంగా లభించేది మాన వ జన్మ అయితే, ఆ మానవ జన్మ కూడా తెలుగువాని గా, తెలుగు మాతృభాషగా కలిగి ఉండే రీతిలో లభిం చడం పరమైకాగ్రచిత్తంతో సుదీర్ఘకాలం చేసిన తపస్సు ఫలితమే తప్ప వేరొకటి కాదు.

 ‘ఆంధ్రత్వం ఆంధ్రభాషా చ నాల్పస్య తపసఃఫలమ్’ అని శతాధిక గ్రంథకర్త అప్పయ్య దీక్షితులు పేర్కొన్నారు.

 తమిళనాడులోని కాంచీపురంలో పుట్టిన అప్పయ్యదీక్షితులు గొప్ప అలంకార శాస్త్ర పండితులు.

 మరొక ఆరు అంశాలు సుదీర్ఘకాలం తీవ్రంగా చేసిన తపస్సు ఫలంగా లభించేవే.

 ‘భోజ్యం భోజనశక్తిశ్చ ప్రజ్ఞా ప్రవచనా న్వయా

 విభవో దానసంపత్తిః నాల్పస్య తపసః ఫలమ్‌॥

 అని ఒక ప్రాచీన కవి పేర్కొన్నాడు. అనాయాసంగా జీవనయాత్ర కొనసాగించా లంటే జీవనాధారమైన భోజన పదార్థాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి కూడా ఉండకూడదు. అనల్ప మైన తపస్సు ఇచ్చిన ఫలితంగానే సమృద్ధిగా భోజన పదార్థాలు సిద్ధిస్తాయి. కొరత లేకుండా భోజన పదార్థాలు లభిస్తున్నాయి, కాని వాటిని భుజించే అదృష్టం కొందరికే దక్కుతుంది. పూర్వ జన్మల్లో చేసిన తపస్సు ఫలితంగానే కొందరే దేన్నైనా తినగలిగే ఆరోగ్యవం తులుగా, తిన్నది జీర్ణించుకునే సమర్థులుగా జీవిస్తున్నారు. చాలా మంది కోట్ల ఆస్తులు ఉండి కూడా తినడానికి అవకాశం లేకుండా జీవనం సాగిస్తున్నారు. శ్రోతలను ఆకర్షించగలిగే రీతిలో ప్రవచనం చేసే శక్తి, ఆ ప్రవచనాన్ని సమర్థంగా చేయడానికి అవసరమైన ప్రజ్ఞ కూడా పూర్వ జన్మల్లో చేసిన తపస్సు ఫలంగా లభించేవే. అలాగే తరతరాలకు తరగని సంపదలు లభించడానికీ, ఆ సంపదలకు తగినట్టుగా ఆపన్నుడి దుఃఖం తొలగే విధంగా దానం చేయాలనే భావన కలగడానికి కూడా తపః ఫలమే కారణమని పూర్వకవి నిశ్చితాభిప్రాయం.

 సంపదలు లభించడమే కాకుండా అవి యజమాని క్షేమానికీ, దీనజనులను ఉద్ధరించడానికి కూడా ఉపయోగపడాలని వివిధ శాస్త్రాలను అభ్యసించడం వల్ల ఏర్పడిన ప్రజ్ఞను శ్రోతలు అలరించే రీతిలో ప్రవచనం చేయగలుగుతున్నట్లుగా ఉపకరిం చాలనీ, భోజన పదార్థాలు సమృద్ధిగా లభించడమే కాకుండా వాటిని తినగలిగే యోగ్యత, జీర్ణించుకునే శక్తి కూడా మానవులకు చాలా చాలా అవసరమనీ, ఇవన్నీ అధిక తపస్సు ఫలితంగానే లభిస్తాయనీ ప్రాచీన కవి భావన.

 సత్ఫలదాయకమైన తపస్సును ఏకాగ్ర చిత్తంతో కొనసాగించి అధిక సంఖ్యలో ప్రజలు శుభఫలితాలను పొందాలని ఆశిద్దాం.

 

సముద్రాల శఠగోపాచార్యులు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top