సూక్తుల పూల్స్.. హైదరాబాద్ వెల్స్! | Hyderabad wells to using Quotes fools | Sakshi
Sakshi News home page

సూక్తుల పూల్స్.. హైదరాబాద్ వెల్స్!

Feb 28 2015 1:16 AM | Updated on Sep 2 2017 10:01 PM

సూక్తుల పూల్స్.. హైదరాబాద్ వెల్స్!

సూక్తుల పూల్స్.. హైదరాబాద్ వెల్స్!

మహాభారతం రాయవయ్యా మగడా అంటే... ‘నానా రుచిరార్థ సూక్తి నిధి’ని కాబట్టి దాంట్లో నేను సూక్తులనేకం చెబుతానన్నాడు నన్నయ్య.

మహాభారతం రాయవయ్యా మగడా అంటే... ‘నానా రుచిరార్థ సూక్తి నిధి’ని కాబట్టి దాంట్లో నేను సూక్తులనేకం చెబుతానన్నాడు నన్నయ్య. మాటకు కట్టుబడుతూ ‘నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృతవ్రత ఒక ‘బావి’ మేలు’ అంటూ వాకృచ్చాడు. మరి హైదరాబాద్ ఇంత పెద్ద నగరం. సుట్టుముట్టు సూర్యాపేట దగ్గర్నుంచీ నట్టనడుమ నల్లగొండ వరకూ... హైదరాబాద్‌తో పని ఉండి పోయివచ్చే వాళ్లందరూ  ‘ఎక్కడికీ పయానం’ అంటే ‘పట్నం’బొయ్యొస్త అనేవారు. వాళ్లందరి దృష్టిలో పట్నం అంటే హైదరాబాదే. మరి అప్పట్లో సద్ది కట్టుకుని ఆ మూటను నెత్తిన పెట్టుకుని వచ్చేవాళ్లంతా భోజనాల వేళకు కాస్త ముఖమూ, కాళ్లు చేతులూ కడుక్కొని అన్నం తినాలంటే ఏం కావాలి? నీళ్లు!
 
 అందుకే... ఆ నీళ్ల కోసమే నుతజల పూరితంబులగు నూతులు కాకుండా... మంచినీటి బావులే బోలెడు తవ్వించారు అప్పటి నవాబులు. ఒక బావి చుట్టూ బొమ్మలూ, విగ్రహాలూ ఉండేవేమో! బొమ్మలను ఉర్దూలో పుత్‌లే అంటారు కదా. కాబట్టి అలా బొమ్మలతో అలంకరించిన ఆ బావిని ‘పుత్లీ బౌలీ’ అన్నారు. కానీ ఇవ్వాళ్లక్కడ విగ్రహాలూ లేవు, బావీ లేదు. పేరు మాత్రం పదిలంగా నిలిచిపోయింది. ఇక ఇంకో బావిలోని నీరు అచ్చం పాలలా రుచిగా తేటగా ఉండటం చూసి దాన్ని ‘దూద్ బౌలీ’ అన్నారు. ఆ ఏరియాలోనే మొదట్లో మన బత్తిన సోదరులు మొదట్లో చేపమందు ఇచ్చేవారు. తర్వాత జనం ఎక్కువై వేదికను ఎగ్జిబిషన్ గ్రౌండుకు మార్చారు. ఇంకో బావిలో నీళ్లకంటే ఇసుక ఎక్కువ కనిపించేదేమో... దాన్ని పట్టుకుని ‘రేతీబౌలీ’ అన్నారు. రేతీ అంటే ఉర్దూలో ఇసుక కదా.
 
 అప్పట్లో వాళ్లు తివిరి ఇసుక నుంచి తైలానికి బదులు నీళ్లే తీసి ఉంటారు. ఇక గచ్చిబౌలీ పేరెందుకు వచ్చిందో తెలియదు గానీ... ఇప్పుడక్కడ నీళ్లకు బదులు అంతర్జాతీయస్థాయి ఐటీ పరిశ్రమలన్నీ నీళ్లూరినట్లు ఊరుతూపోతున్నాయి. బావి అంచుల్ని గచ్చుతో కట్టినట్లుగా అంచులు కూలకుండా నిటారుగా నిలబడి ఉన్నాయి. గచ్చిబౌలీలోని  చెలమల్లోంచి నీరూరినట్లుగా ఊరి... కలిమికి చిహ్నంగా చేరి... ఈ బౌలీ ప్రతిష్ఠ చూడూ అంటూ తళతళలాడుతున్నాయి. ఇక ఇక్కడి మరో బావిలోని నీళ్లను తమ అవసరాల కోసం మొట్టమొదటి సారి ఇంజనీర్లు ఇంజిన్‌తో తోడించారట. అందుకే ఆ బావికి ‘ఇంజన్‌బౌలీ’ అని పేరు పెట్టారు. ‘‘ఇలా పుత్లీబౌలీ, దూద్‌బౌలీ, రేతీబౌలీ, గచ్చిబౌలీ, ఇంజన్‌బౌలీ... ఇన్ని బావులెలా తవ్వించారండీ ఈ పాలకులూ? అయినా ఆ నన్నయ్యగారి మాట ఈ నవాబుగార్లకెలా తెలిసిందబ్బా’’ అంటూ నేను అమితంగా ఆశ్చర్యపోతూ అడిగా. దానికి మా గౌరీభట్ల నర్సింహమూర్తి నా వైపు ఒక్క చూపు  చూసి చిరునవ్వు నవ్వుతూ... ‘‘ఒరే పిచ్చోడా... ఇదీ నీతి అని చెప్పడానికి ఇతిహాసమైన భారతమైతే ఏమిటీ, ఇస్లాం తాలూకు ఇన్‌కార్ చేయలేని సూక్తి అయితే  ఏమిటీ... నీతి ఎక్కడైనా నీతేరా. ముందు చల్లటి నీళ్లు తాగు. మన ఊరి బావి నీళ్లే’’ అంటూ నాకు ఓ చురక అంటించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement