జీవితం... ఒక పోరాటం

Yamijala jagadish about life - Sakshi

జెన్‌ గురువు ఒకరు తన శిష్యులకు జీవితం అంటే ఏమిటో చెప్పడం కోసం వారినందరినీ ఒకచోట సమావేశపరిచారు. ఆయన అవీ ఇవీ మాటలు చెప్తూ వారికి ఓ సీతాకోకచిలుక గూటిని చూపించి అందులోంచి కాస్సేపటికి సీతాకోకచిలుక ఎలా పోరాడి బయటకు వస్తుందో చూడండి అంటూ లోపలకు వెళ్ళిపోయారు. దానికెవరూ సాయం చేయకూడదని హెచ్చరిక చేశారు. ఆయన వెళ్ళిన వెంటనే శిష్యులందరూ మౌనంగా చూస్తున్నారు ఏం జరుగుతుందోనని.

కానీ ఒక శిష్యుడికి చిన్న సందేహం కలిగింది. అది గూటిలాంటి పెంకుని చీల్చుకుని ఎలా బయటకు వస్తుందో పాపం అని మనసులో అనుకుని ఉండబట్టలేక దానికి సహాయం చేయాలనుకున్నాడు. మెల్లగా ఆ పెంకుకున్న రంధ్రాన్ని బద్దలు కొట్టాడు. దాంతో సీతాకోకచిలుక బయటకు వచ్చి చనిపోతుంది. తోటిశిష్యులందరూ అతని వంక గుర్రుగా చూశారు.
కాసేపటి తర్వాత గురువుగారు అక్కడికి వచ్చారు. పెంకుని బద్దలు కొట్టిన శిష్యుడు ఏడుస్తుండడాన్ని చూశారు. ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఆ శిష్యుడు జరిగింది చెప్పి బాధ పడ్డాడు.

అప్పుడు గురువుగారు, సీతాకోకచిలుక అంతగా కష్టపడడానికి కారణం, తన రెక్కలు బాగా ఎదగడానికీ, తనను గట్టిపరచుకోవడానికి అని చెప్పారు. అలాగే మనమూ మన జీవితంలో ప్రతి ఒక్కరం కష్టపడాలి. అప్పుడే జీవితంలోని లోతుపాతులు తెలుస్తాయి. జీవితం ఎంత అందమైందో కూడా తెలుస్తుంది.

అనుకోని కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అంతమాత్రాన డీలా పడిపోకూడదు. సమస్యల నుంచి పారిపోకూడదు. అనుభవాలను పాఠాలుగా చేసుకుని వర్తమానంలో ఎలా ఉండాలో అలవరచుకోవాలి. మనసుకి పరిపక్వత వచ్చినప్పుడే ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది... అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు.  

– యామిజాల జగదీశ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top