మా వేప చెట్టు పువ్వు

Ugadi pachadi sans Withered Neem Flowers - Sakshi

మనసు వేగంగా వెళ్లి ఊళ్లో ఇంటి ముందున్న మా వేపచెట్టును చుట్టుకుపోయింది. ఎప్పుడు పుట్టిందో కానీ ఆకాశమంతా తానే అన్నట్టు గర్వంగా నాతో చూపులు కలిపేది!

గుత్తులు గుత్తులుగా తెల్లని పువ్వులు. చిట్టి చిట్టి పువ్వులు. చిన్ని చిన్ని పువ్వులు. తల్లిని గట్టిగా పట్టుకున్న చంటిబిడ్డల్లా కొమ్మల కొంగులను చుట్టేసిన పువ్వులు. పచ్చని ఆకుల పరదాలను దాటుకొని గాలికి అటూ ఇటూ ఊగుతుండే ఆ పువ్వులను చూస్తుంటే ఊయలను పట్టుకొని ఊగే గడుగ్గాయిల్లా అనిపిస్తున్నాయి! అలారం మోగుతున్న శబ్దం వింటూనే ఉలికిపాటుతో మెలకువ వచ్చింది. అటూ ఇటూ చూసి అది కల అని తెలిశాక కళ్లలో తడి చేరింది. ఎంత అందమైన చెట్టు, ఎంత పొడవాటి చెట్టు, ఎన్ని చిట్టి చిట్టి పువ్వులు... కల కళ్లను వదలడం లేదు. మనసు వేగంగా వెళ్లి ఊళ్లో ఇంటి ముందున్న మా వేపచెట్టును చుట్టుకుపోయింది. ఎప్పుడు పుట్టిందో కానీ ఆకాశమంతా తానే అన్నట్టు గర్వంగా నాతో చూపులు కలిపేది మా వేపచెట్టు. ఉగాది రావడానికి రెండు నెలల ముందునుంచే వాకిలంతా ఎండుటాకులతో కప్పేసేది. రోజూ ఉదయ సాయంత్రాలు శుభ్రం చేసుకోవడానికి పడే మా పాట్లను చూసి గుంభనంగా నవ్వుకునేది. ఆ తర్వాత కొమ్మలకు వచ్చిన కొత్త చివుళ్లు, ఆ వెనకే వచ్చే పూల సొగసును చూపించి అందంగా నవ్వేది.

గాలి తాకినప్పుడల్లా వచ్చే పూల చిరు వగరు వాసనతో నాతో దోస్తీ కట్టేది. ఉగాది రోజున పనులన్నీ అయ్యాక ‘ఇంకా ఎంతసేపు పచ్చడికి వేప పూత కావాలిగా. నాలుగు కొమ్మలు తెండి’ అని అమ్మ కేకతో నాన్న తన పంచెను మడిచి కొడవలి మాదిరి వంకీలా ఉండే పొడవాటి కట్టె పట్టుకొని ఇంటి ముందున్న వేపచెట్టు దగ్గరకు వెళ్లేవాడు. ఆ కట్టె సాయంతో వేప కొమ్మలను వంచి మరోచేత్తో అందిన నాలుగు కొమ్మలను విరిచి తీసుకొచ్చేవాడు. నాన్న చేతి నుంచి ఆ కొమ్మలను అందుకున్న అమ్మ ఆకుల మధ్య నుంచి విడిగా చిట్టి చిట్టి పూలున్న సన్నని పొడవాటి పుల్లలను పట్టుకొని పూతనంతా చేటలోకి దూసేది. కొమ్మలను మామిడి తోరణం కట్టిన గుమ్మానికి అటూ, ఇటూ రెండువైపులా గుచ్చి, పువ్వును మాత్రం నేర్పుగా కొద్దిగా నలిపి రేకలను విడదీసేది.

ఆ పూల రేకలను గుప్పిట్లోనే పట్టుకొని తీసుకెళ్లి ఉగాది పచ్చడి చేసిన కుండలో వేసేది. మర్రి ఆకు డొప్పల్లో వేసిన ఉగాది పచ్చడి ప్రసాదాన్ని వేప పూలతో సహా మరి మరి అడిగించుకొని తాగేవాళ్లం. ఈ ఉగాదికి ‘వేప పూత తీసుకురండి పచ్చడికి’ అని అమ్మ అంటే నాన్న ఎక్కడిదాక వెళ్లాలో. ఊళ్లో నాలుగు నెలల కిందట ఇంటి ముందు నుంచి కాంక్రీట్‌ రోడ్డు వేశారట. పెద్ద వాహనాలు వెళ్లడానికి అడ్డంగా ఉందని వేపచెట్టును కొట్టేశారట. అమ్మ విషయం చెప్పగానే ఇంటి మనిషిని కోల్పోయానన్న బాధ గుండెను తాకింది. ఆధునికత ఇస్తున్న కాంక్రీట్‌ బహుమానం మా వేప పూతను నిర్దాక్షిణ్యంగా సమాధి చేసిందని, నా ఆకాశమంత గర్వం కుప్పకూలిందని మనసు మూగబోయింది. 
నిర్మలారెడ్డి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top