టిఫిన్‌ బాక్స్‌ 

Twenty year Service Retirement time has Come - Sakshi

ఉద్యోగ విరమణ

అతడు ఉద్యోగి. ఆమె గృహిణి. ఆ ఉద్యోగికి ఇవాళ్లే రిటైర్మెంట్‌! రేపట్నుంచి అతడి జీవితం ఎలా ఉండబోతోంది?! ఆ సంగతి వదిలెయ్యండి. ఆ గృహిణికి ఎలా ఉండబోతోంది? ఈ క్షణంలో  ఆమె ఏం ఆలోచిస్తోంది? 

అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇంకా ఈమధ్యనే కొత్తగా మావారు ఉద్యోగంలో జాయినయినట్టుగా ఉంది! అప్పుడే ముప్ఫై ఐదేళ్ల సర్వీసు అయిపోతోందా? ‘ఆగదు ఏ నిమిషం నీకోసము, ఆగితే సాగదు ఈలోకము’ పాట గుర్తుకొచ్చింది. ఆ.. ఇంకా ముప్ఫై ఏళ్ల సర్వీసు ఉందీ, ఇరవై ఏళ్ల సర్వీసు ఉందనుకుంటుండగానే పదవీ విరమణ కాలం వచ్చేసింది. ఇంకో ఏడాది రిటైర్మెంటుకి టైముందనుకున్నప్పటి నుంచీ ఆ గోడకున్న కేలెండరు కి కూడా తొందరొచ్చేసింది. ఎడాఫెడా బొమ్మలు మార్చేసింది.గోరువెచ్చని  నిమ్మరసంతో మొదలవుతూ వచ్చింది ఇన్నేళ్ల మా రోజూ వారీ కార్యక్రమం. ఆయన వాకింగు చేసొచ్చి, వెంటనే న్యూస్పేపర్లో తలదూర్చి, ఆ కబురూ ఈ కబురూ చూడడం, ఎడిటోరియల్‌ చదవడం,  స్నానానికి వెడుతూ ‘టిఫిన్‌ రెడీ చెయ్యవోయి, రెండు నిమిషాల్లో  వచ్చేస్తా‘! అంటూ, ఉరకలు పరుగులతో బ్రేక్‌ఫాస్ట్‌ చెయ్యడం ఇక మీదట ఉండదేమో! ‘ఫ్లాస్కోలో ఇచ్చిన మజ్జిగ తాగడం మరచిపోకండి.

పదకొండింటికి కీరాదోస ముక్కలూ, నాలుగు గంటలకి యాపిల్‌ పండు తినండి. మీటింగులు, పార్టీల పేరు చెప్పి టీలూ కాఫీలూ  తాగకండి. జీడిపప్పులూ, సమోసాలూ ససేమిరా ముట్టుకోకండి’ అని  ఏళ్ల తరబడి నే చెప్పే పాఠాలకింక స్వస్తి చెప్పే ఘడియలు దగ్గరకొస్తున్నాయి! అయ్యగారి ప్రతి పుట్టినరోజుకి ఓ పాంటు చొక్కా తో పాటూ ఓ లేటెస్ట్‌ మోడల్‌ టిఫిను బాక్సూ,  ఓ థర్మాస్‌ తప్పనిసరిగా కొంటూవచ్చాను. ఇంక ఆ అవసరం ఉండదేమో!మూడుగిన్నెల కారియర్లో పైగిన్నెలో మూడు రోటీలు, మధ్య గిన్నెలో కూర, ఆఖరు గిన్నెలో ఆకుకూర పప్పు పెడతూవచ్చాను. అడపాదడపా పూరీలు, బిరియానీ, చైనీస్‌ కూడా వెరైటీగా పెడ్తూ వున్నాను. ఈ మధ్యనే తృణ ధాన్యాలతో కొత్త కొత్త రెసిపీలు నేర్చుకుని నా వంటకాలను ఆయనపై ప్రయోగిస్తున్నాను. ఎండా కాలంలో ధర్మాసులో చిక్కటి మజ్జిగలో నిమ్మకాయ పిండి, అల్లం తురిమి, రవ్వంత రాళ్ల  ఉప్పు వేసి, ఏ పుదీనా ఆకో, కొత్తిమీరో వేసి గిలక్కొట్టి  ఇస్తే ఆయనకి హ్యాపీ.

అదే చలి కాలంలో వేడివేడి వెజిటెబుల్‌ సూపో, లెంటిల్‌ సూపో ధర్మాసులో నింపితే నేను ఆయన పక్కనున్నట్టుగా నులివెచ్చని  ఫీలింగుట! ఇంటికొచ్చి మురిసి పోతారు. ఆయన టిఫిన్‌ కారియర్‌ ని ఎంతో ప్రేమతో, ఓపిగ్గా సర్దుతుంటే చెప్పలేనంత తృప్తిగా ఉంటుంది. ఏ మాత్రం పనిలా అనిపించదు. ఆ టిఫిన్‌ కారియర్ని రకరకాల అందమైన జూట్‌ బ్యాగ్గుల్లో ముస్తాబు చేయడం ఓ జ్ఞప్తిగా మిగిలిపోతుంది. ఆ బ్యాగులన్నీ కిచెన్‌ షెల్ఫ్‌లో వేళ్లాడాల్సిందేనా? రేపటి రోజున టిఫిన్‌ బాక్స్‌లో ఏం ఫుడ్‌ అరేంజ్‌ చెయ్యాలో అన్న ఆలోచనకు కామా నుండి ఫుల్‌ స్టాపేనేమో! వచ్చే ఏడాది ఈయన పుట్టిన రోజుకేం గిఫ్టు ఇవ్వాలో? ఇద్దరం కలసి లంచ్‌ ఇంట్లోనే చేస్తాం కాబట్టి టిఫిన్‌ బాక్సూ, థర్మాసు గిఫ్టు రూల్డౌట్‌!టింగు టింగు మని కాలింగ్‌ బెల్‌ మోగడంతో నా ఆలోచనలకి బ్రేకు పడింది.‘

హే గుడ్‌ న్యూస్‌ సత్యా’ అంటూ కేను కుర్చీలో రిలాక్స్‌డ్‌గా కూర్చుని బూట్లు విప్పుకుంటూ ‘నా సిన్సియర్‌ హార్డ్‌వర్క్‌కి, ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ పాలసీలలో నాకున్న అవగాహనకి, నాకు ఆ విషయంలో ఉన్న ఎక్స్‌పర్టీస్‌కి ప్రభుత్వం వారు మెచ్చి, రానున్న తరాలవారికి, దేశానికి నా అనుభవం ఉపయోగపడాలని నాకు మరో మూడేళ్ల కోసం సర్వీస్‌లో ఎక్స్‌టెండ్‌ చేశారోయి. నెక్స్‌ట్‌ బర్త్‌ డేకి టిఫిన్‌ బాక్సూ, థర్మాసూ కొనొచ్చు డియర్‌. ఈగర్లీ వెయిటింగ్‌ ఫార్‌ మోర్‌ డెలీషియస్‌ లంచెస్‌‘ అన్నారు, నా మనసు చదివినట్టుగా! ఆయన ఇంటికి తెచ్చిన టిఫిన్‌ బాక్స్‌ని లోపలికి తీసుకెళ్లి మెత్తగా ఓ ముద్దు పెట్టుకున్నా. ఇంకో మూడేళ్లు టిఫిన్‌ బాక్స్‌ తో ప్రేమానుబంధం కంటిన్యూ అవుతుందన్నమాట! ఆయన కోసం నేను తయారు చేసుంచిన పళ్లరసంతో, శుభ సమాచారానికి కంగ్రాట్స్‌ చెప్పేందుకు ఆయన దగ్గరకి  వెళ్లా. 
సత్యశ్రీ నండూరి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top