 
															భార్యకు క్షమాపణ చెప్పండి!
నల్లగొండ జిల్లా సుద్దాల అనే గ్రామంలో, 1960 వైశాఖ పున్నమి రోజు పుట్టిన అశోక్‌తేజ అంతరంగాన్ని వీక్షించే ప్రయత్నం ఇది!
	సుద్దాల అశోక్‌తేజ -  అంతర్వీక్షణం
	 
	సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఇటీవల గీతం యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నల్లగొండ జిల్లా సుద్దాల అనే గ్రామంలో, 1960 వైశాఖ పున్నమి రోజు పుట్టిన అశోక్‌తేజ అంతరంగాన్ని వీక్షించే ప్రయత్నం ఇది!
	 
	మీలో నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం?
	నచ్చని లక్షణం... మా ఆవిడను విసుక్కోవడం. నచ్చే లక్షణం దేవతామూర్తుల తర్వాత స్త్రీమూర్తులను అంతగా గౌరవించడం.
	     
	ఎదుటి వారిని చూసే దృష్టి కోణం?
	వీరి నుంచి నేర్చుకోగలిగింది ఏమిటి అని.
	     
	ఎలాంటి వారిని ఇష్టపడతారు?
	మానవీయత ఉన్న వారిని ఏడు జన్మల స్నేహితులుగా భావిస్తాను.
	     
	డాక్టరేట్ అందుకున్న క్షణంలో కలిగిన భావం?
	సినిమా అవార్డులు ఆ ఏడాది వచ్చిన సినిమాల ఆధారంగా ఇస్తారు. డాక్టరేట్ అనేది మన పనిని ఆమూలాగ్రం మూల్యాంకనం చేసి ఇచ్చేది. కాబట్టి ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందాను. గౌను వేస్తున్నప్పుడు అద్భుతమైన, అప్రమేయమైన ఆనందం కలిగింది.
	 
	మీకు నచ్చిన పుస్తకాలు..!
	అమ్మ టైలరింగ్ చేస్తున్నప్పుడు నేను చదివి వినిపించిన వాటిలో మాక్సిం గోర్కీ రాసిన ‘అమ్మ’ నవల బాగా నచ్చింది. నాన్న ఒళ్లో కూర్చోబెట్టుకుని కంఠతా వచ్చేలా చదివించిన మహాప్రస్థానం నా రక్తంలో ఇంకి పోయింది.
	     
	ఏ రంగలో స్థిరపడాలనుకునేవారు?
	... ఆరవ తరగతి నుంచి డాక్టర్ సి.నా.రె.లా సినీరచయిత కావాలనుకునేవాడిని. అలాగే అయ్యాను.
	     
	మీరు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి ఎవరు?
	ఒకరు కాదు ఇద్దరు. అమ్మ, మా ఆవిడ.
	     
	మిమ్మల్ని ప్రభావితం చేసిన వారు!
	మొదట నాన్న. తర్వాత నారాయణరెడ్డి.
	     
	తొలి పాట రాసినప్పటి అనుభూతి
	... తొమ్మిదేళ్లకే రాశాను. అనుభూతి తెలియని వయస్సది. ఎనిమిదవ తరగతిలో పాఠాన్ని పాటగా రాసినప్పుడు వచ్చిన ప్రశంస అనిర్వచనీయం.
	     
	తొలి సంపాదన!
	... దాసరి నారాయణరావు నా పాటలు విని ‘‘నీ పాటలు తీసుకుంటాను’’ అని కవిని ఊరికే పంపకూడదంటూ మూడువేల రూపాయలిచ్చారు. ఆ డబ్బుతో నా కుటుంబాన్నంతటినీ (అక్క- బావతోపాటు) తిరుపతికి తీసుకెళ్లాను. అది నా మనసును నింపిన తొలి సంపాదన.
	     
	అలాంటి మనసు నిండిన మరో సంఘటన?
	నా భార్య నిర్మలతో కలిసి ఓ ఫంక్షన్‌కెళ్తుండగా ఒక ఫోన్. అవతలి వ్యక్తి ‘‘వైస్ చాన్స్‌లర్‌గారు మాట్లాడతారు’’ అని చెప్పారు. ఏదో కార్యక్రమం గురించేమో అనుకున్నాను. ఆయన డాక్టరేట్ గురించి చెప్పారు. నన్ను నేను తట్టుకోవడానికి నిర్మల చేతిని గట్టిగా పట్టుకున్నాను.
	     
	మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి?
	...ఒకరిద్దరు కాదు. సినిమా రంగంలో ఇది మామూలే.
	     
	అప్పుడలా చేసి ఉండాల్సింది కాదు అనిపిం చిన పని... నిర్ణయం?
	ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను పునరాలోచించుకోవాల్సిన అవసరమే రాలేదు.
	 
	ఎవరికైనా క్షమాపణ చెప్పారా?
	మా ఆవిడకే. విసుక్కుని నొప్పించాను అనిపిస్తుండేది. అంతే... క్షమాపణ చెప్పేశాను.
	 
	మీలా ఆలోచించే భర్తలు తక్కువేమో?
	ఇది భర్తలకు సూచన... ‘భార్యకు క్షమాపణ చెప్పడానికి వెనుకాడవద్దు. మీరు క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆవిడ ఎవరికీ చెప్పదు. సత్యభామ కాళ్లు పట్టుకున్న విషయాన్ని కృష్ణుడు తనంతట తాను చెప్పుకున్నాడే తప్ప సత్యభామ చెప్పలేదు’.
	     
	భాగస్వామికి సమయం కేటాయిస్తున్నారా?
	సినిమా ప్రయత్నాల సమయంలో ఒకరినొకరు దినాలు, నెలలు కూడా మిస్సయ్యాం.
	     
	పాటల్లో ఉపయోగించే భావం...
	కృష్ణశాస్త్రి మెత్తదనాన్ని, శ్రీశ్రీ కత్తిదనాన్ని మేళవించి రాశాను. కవిత్వం, సాహిత్యం తెలియని వారికి కూడా హృదయం లోపల ఒక సున్నితమైన పాయింట్ ఉంటుంది. నా కలం ములుకు ఆ బిందువును తాకాలన్నట్లు రాస్తాను.
	     
	కుటుంబ జీవితంలో ఆనందపడిన క్షణాలు?
	నా కూతురికి ఇద్దరు కూతుళ్లు. నా కొడుక్కి ఒక కొడుకు. వారితో ఆడుకుంటుంటే గర్భగుడిలో దైవం సాన్నిహిత్యంలో ఉన్నట్లుంటుంది.
	     
	ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు?
	మొదలు పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముగించాల్సిన పని ఒక్కటీ లేదు.
	     
	ఎప్పుడైనా అబద్ధం చెప్పారా?
	ఎక్కువ మా ఆవిడతోనే. అయితే అన్నీ  ప్రమాదానికి దారితీయని చిల్లర అబద్ధాలే.
	     
	దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు?
	మళ్లీ ఇలాగే... ప్రజల మనసులను తాకే రచయితగా... పుట్టించమని కోరుకుంటాను.
	     
	మీ గురించి మీరు ఒక్కమాటలో...
	మాటతోనైనా, పాటతోనైనా హృదయాలను కదిలించే వ్యక్తిని.
	 
	 - వి.ఎం.ఆర్
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
