అదే ఆధ్యాత్మికత అంటే..!

The spirituality - Sakshi

అది ఓ ఆశ్రమం. గురువుగారు శిష్యులకు పాఠాలు చెబుతున్నారు. తాను చెబుతున్నది శిష్యులకు అర్థమవుతోందో లేదో తెలుసుకునేందుకు అప్పుడప్పుడు శిష్యుల్ని ప్రశ్నలు వేస్తూ, వారి సమాధానాలలో తప్పులేమైనా ఉంటే సరిదిద్దుతున్నారు. అందులో భాగంగా గురువుగారు ‘‘ఒకటికి మరొకటి కలిస్తే ఏమవుతుంది?’’ అని అడిగారు. శిష్యులందరూ ఏమాత్రం సందేహం లేకుండా ఠక్కున రెండు అని చెప్పేరు. తప్పు అన్నారు గురువుగారు. తెల్లమొహాలేశారు శిష్యులు. అప్పుడన్నారు గురువుగారు.

‘‘ఒకటికి మరోటి తోడైతే అది రెండు అయితే గణితం. కానీ ఆధ్యాత్మికంగా అలా కాదు’’ అంటూనే ఒక శిష్యుణ్ణి పిలిచేరు. శిష్యుడు వచ్చి నిలుచున్నాడు. సేవకులతో ఒక నిలువుటద్దాన్ని తెప్పించి ఆ శిష్యుడి ఎదురుగా పెట్టి, ‘‘ఇక్కడ నువ్వు ఉన్నారువ. అద్దం ఉంది. రెండయ్యేయి కదా! ఇంకా... నువ్వు అద్దంలో కూడా ఉన్నావు. అంటే ఏమయ్యింది? నీకు అద్దం తోడైతే మూడు అయ్యింది. చూసేశా?’’ అన్నారు. అవునన్నాడు శిష్యుడు. ఒకటికి మరోటి తోడైతే రెండు కాకుండా మూడు అయ్యింది. అదే ఆధ్యాత్మికమంటే!’’అని అసలు విషయాన్ని సూటిగా చెప్పేరు. శిష్యులు చప్పట్లు కొట్టేరు.

అప్పుడు గురువుగారు మరో ప్రశ్న సంధించారు. ‘‘మూడింటిలోంచి ఒకటి తీసేస్తే ఎంత?’’శిష్యులు మళ్లీ ‘రెండు’ అన్నారు. తప్పులో కాలేశారన్నారు గురువు గారు. మళ్లీ సేవకుణ్ణి పిలిపించి ‘‘ఈ అద్దం తీసేయ్‌’’ అన్నారు. అద్దాన్ని తీసేశాడు సేవకుడు.‘‘ఏమయ్యింది చెప్పు?’’అనడిగేరు శిష్యుణ్ణి. ‘‘నేనొక్కడినే మిగిలేను’’ అన్నాడు శిష్యుడు. అప్పుడు గురువుగారన్నారు– మూడు ఉండగా ఒక్క అద్దాన్ని తీసేస్తే ఏమయ్యింది? ఒక్కటే అయ్యింది. ఇదే ఆధ్యాత్మికంలో ఉన్న రహస్యం. శిష్యులు ఆనందంతో తలలు ఊపేరు.

– రమాప్రసాద్‌ ఆదిభట్ల

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top