ఉత్తముణ్ని కాకపోవచ్చు... అధముణ్ని మాత్రం కాదు!

Spirit of Vivekananda - Sakshi

‘నేను అందరికంటే ఉత్తముణ్ని కావచ్చు, కాకపోవచ్చు. చాలామంది కంటే ఉత్తముణ్ని అయ్యే అవకాశం ఉంది. ఎవరికంటే అధముణ్ని మాత్రం కాదు’ అనేది నచికేతుని తత్వం. ఆయనే నాకు స్ఫూర్తి, ఆదర్శం.

ఎదుటివారిని గౌరవించడం మన మొదటి కర్తవ్యం. ఇతరుల పట్ల గౌరవ భావాన్ని వ్యక్తం చేయడంలో ప్రతిబింబించేది మన సంస్కారమే కాని చిన్నతనం కాదు. ఆత్మగౌరవానికి భంగం అంతకంటే కాదు. సున్నితంగా వ్యవహరించడం అంటే ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టడం అని అర్థం కాదు. సరళమైన జీవితం కొనసాగించే వారికి దృఢచిత్తం లేదు అనుకుంటే పొరపాటే. ఇంద్రధనుస్సులో మనకు పైకి కనిపించేవి మూడు రంగులే కానీ, అది ఏడు రంగుల సమ్మేళనం.

అలాగే మనిషిలోనూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడంతోపాటు సంస్కారయుతంగా వ్యవహరించడం వంటి అన్ని లక్షణాలూ ఉండి తీరాలి. ఇదే విషయాన్ని స్వామి వివేకానందుడికి అతడి తల్లి బోధించింది. ‘పవిత్రంగా ఉండు, స్వచ్ఛమైన జీవితాన్ని జీవించు. ఆత్మగౌరవాన్ని సంరక్షించుకో, ఇతరులను గౌరవంగా చూడు, సరళ స్వభావంతో నిరాడంబరంగా మెలుగు.

అవసరమైన చోట్ల దృఢత్వాన్ని ప్రదర్శించడానికి వెనుకాడకు’ అని ఆమె హితబోధ చేశారు. ఆ ప్రభావం అతడి మీద ఎల్లవేళలా పని చేసింది. ఆ సూక్తులు ఆయనను సన్మార్గంలో నడిపించాయి. దాంతో ఇతరులను గౌరవించడానికి ఎప్పుడూ వెనకాడేవాడు కాదు. ఇతరులు తనను అవమానపరచదలిస్తే సహించేవాడుకాదు. అందుకు అతడి బాల్యంలో జరిగిన  సంఘటనే నిదర్శనం.

ఒకరోజు ఇంటికి వివేకానందుడి తండ్రి స్నేహితుడు వచ్చాడు. అతడు వివేకానందుడిని తేలికగా మాట్లాడాడు, అంతే... వివేకానందుడు కోపంతో తోకతొక్కిన తాచులాగా స్పందించాడు. ‘నా తండ్రి కూడా నన్ను చిన్న చూపు చూడడు, అతడి స్నేహితుడు నన్ను అహేతుకంగా కించపరచడాన్ని సహించ’నన్నాడు. ఆ తర్వాత ఆ స్నేహితుడు జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

‘మనం ఎవరికంటే ఎక్కువ కాకపోయినా తక్కువ మాత్రం కాదు’ అని వివేకానందుడి నమ్మకం. దానికి నచికేతుడిని ఉదహరించేవాడు. కఠోపనిషత్తులోని నచికేతుని వృత్తాంతంలో ఆయన ధీరత్వం, ఆత్మస్థైర్యం అర్థమవుతాయి. ఆయనే నాకు స్ఫూర్తి, ఆదర్శం అనేవాడు వివేకానందుడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top