అమ్మ... ఆయా... ఓ కథ

special  story to Sympathy - Sakshi

స్త్రీ సినిమా

సినిమాల్లో హీరోయిన్‌ ఎప్పుడూ హీరోకి చెవిలో తల్లవుతున్న సంగతి చెబుతుంది. పాటలో ఆమెకు నవమాసాలు నిండటం, మొదటి చరణంలో పిల్లాడు పుట్టడం, రెండవ చరణంలో ఎనిమిదేళ్ల వాడయ్యి బెలూన్‌లు పట్టుకుని పరుగుతీయడం... అంతా హ్యాపీగా జరిగిపోయినట్టు చూపిస్తారు. నిజంగా అంత హ్యాపీనా?

మాతృత్వం చుట్టూ మధుర భావనలే సృష్టించింది ఈ ప్రపంచం. ఏ ప్రపంచం? మగ ప్రపంచం. తల్లి కావడం స్త్రీ జీవితానికి ధన్యత అన్నారు. తల్లి వల్లే సమాజం అన్నారు. తల్లి పూజ్యనీయురాలు అన్నారు. తల్లి పాదాల వద్దే స్వర్గం ఉందన్నారు. స్త్రీ వేరు. తల్లి వేరు. తల్లి అయిన స్త్రీకే ఈ సమాజంలో సమ్మతి. లేదంటే ఈసడింపులు. అందుకే స్త్రీలు తల్లులు కావడానికి తహతహలాడతారు. తల్లి కావాలనే సహజాతం వారిలో ఉంటుంది. తల్లి కావాల్సిన భౌతిక అవసరం ఉంటుంది. ఈ రెంటికీ పురుషుడి ప్రోత్సాహం ఉంటుంది. కాని తల్లి అయ్యే సమయంలో, తల్లి అయ్యాక, బిడ్డను, పెంపకాన్ని నిర్వహించాల్సిన సమయంలో తల్లికి పురుషుడి తోడ్పాటు ఎంత? సహకారం ఎంత? సహానుభూతి ఎంత? సినిమాల్లో హీరోయిన్‌ ఎప్పుడూ హీరోకి చెవిలో తల్లవుతున్న సంగతి చెబుతుంది. పాటలో ఆమెకు నవమాసాలు నిండటం, మొదటి చరణంలో పిల్లాడు పుట్టడం, రెండవ చరణంలో ఎనిమిదేళ్ల వాడయ్యి బెలూన్‌లు పట్టుకుని పరుగుతీయడం... అంతా హ్యాపీగా జరిగిపోయినట్టు చూపిస్తారు.

నిజంగా అంత హ్యాపీనా?హాలీవుడ్‌లో కూడా సినిమాలు ఇలాగే ఉండేవి.కాని ఆ పరంపరను బ్రేక్‌ చేస్తూ అక్కడ తాజాగా రాబోతున్న సినిమా ‘టాల్లీ’.ఈ టాల్లీ అనేది ఆయా పేరు. ఈమె ఎవరికి ఆయా? ఈ సినిమాలోని ‘మార్లో’ అనే గృహిణి పిల్లలకు ఆయా. మార్లో న్యూయార్క్‌ శివార్లలో ఉండే గృహిణి. భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. నిండు గర్భిణి. మాతృత్వం గొప్పదే కావచ్చు. పిల్లలకు జన్మనివ్వడం స్త్రీ జన్మకు సార్థకత కావచ్చు. కాని ఏమేమి కోల్పోతే ఒక స్త్రీ ఈ మాతృత్వ దశకు చేరుకుంటుంది? ఈ సినిమాలో ఇద్దరు పిల్లలతో, కడుపులో ఉన్న బిడ్డతో మార్లో సతమతమవుతుంటుంది. గర్భం వల్ల బరువు పెరిగి ఉంటుంది. అందం చందం పట్ల ఆసక్తి ఉండదు. ఏదో ఆందోళన. భర్త మంచివాడే కాని అతడు తన కెరీర్‌లో తాను బిజీగా ఉంటాడు. మహా అయితే పిల్లల హోమ్‌ వర్క్‌లో సాయం చేస్తుంటాడు. కాని ఇంట్లో ఇరవై నాలుగ్గంటలు ఉండే భార్య ఇరవై నాలుగ్గంటల పాటు చిన్నా పెద్ద పనులను చక్కబెట్టుకుంటూ తనను తాను ఎలా మిగుల్చుకోగలదు? ఇండియా నుంచి అమ్మలో అత్తలో ఫ్లయిట్‌ ఎక్కి అమెరికా చేరుకుంటారు కాన్పు సమయంలో సహాయానికి. అమెరికా వాళ్లకు అలా కుదరదు. పైగా న్యూయార్క్‌లో అది చాలా ఖర్చు.

మార్లో కష్టాన్ని గమనించిన ఆమె తమ్ముడు తన సొంత ఖర్చుతో ఆమెకు ఒక ఆయాను ఏర్పాటు చేస్తాడు. దీనిని ముందు మార్లో నిరాకరిస్తుంది. కాని తర్వాత ఆ ఆయాను అంగీకరిస్తుంది. పిల్లల బాగోగులు చూడటానికి రోజు రాత్రి వచ్చి నైట్‌ డ్యూటీ చేసే ఆ ఆయా మార్లో జీవితంలో ఒక పెద్ద సమీరంలా వీస్తుంది. నిద్ర లేచే పిల్లలతో, డైపర్లు మార్చాల్సిన పసి బిడ్డతో, నిద్రే కరువైన మార్లో ఆయా రావడంతో కంటి నిండా నిద్ర పోగలుగుతుంది. కాన్పయ్యాక కూడా ఆమె డెలివరీ తాలూకు బరువైన శరీరంతో కష్టపడుతుంటుంది. పాలు పొంగి వక్షోజాలు సలపరించినప్పుడల్లా బిడ్డ వక్షాన్ని నోటికి అందుకోకపోతే ఏం చేయాలి? ఆ పాలను బాటిళ్లలో పడుతుంటుంది. ఈ సందర్భాలన్నింటిలో ఆయా ఆమె మానసికంగా గట్టి సమర్థింపు ఇస్తుంది. ఒక స్త్రీ కష్టం ఇంకో స్త్రీకే తెలుస్తుందంటారు. అసలు స్త్రీ కష్టం మగ ప్రపంచానికి ఎప్పటికి తెలియాలి?ఈ సినిమా గొప్పతనం ఏమంటే ఇందులో మార్లోగా నటించిన చార్లెజ్‌ థెరాన్‌ నిజ జీవితంలో ఎప్పుడూ తల్లి కాలేదు. కాని ఆమె నటన చూసినవారు అవన్నీ అనుభవించి చేస్తున్నట్టుగా భావిస్తారు. ఇక ఆయాగా నటించిన మెకంజీ డేవిస్‌కు ఒక గర్భిణీ స్త్రీ భావోద్వేగాలను గమనించే వీలు గతంలో లేదు. అయినప్పటికీ వీళ్లిద్దరూ అద్భుతంగా ఆ సన్నివేశాలను రక్తి కట్టించి విమర్శకుల ప్రశంసలు పొందుతున్నారు. ఇవాళ నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో కూడా మైక్రో ఫ్యామిలీలను ఇష్టపడుతున్నారు. పెళ్లయ్యి విడి కాపురం ఆ తర్వాత గర్భం...గర్భ సమయంలో స్త్రీ గురించి ఆమె మానసిక ప్రపంచం గురించి ఆకాంక్షలు అభిరుచులు గురించి ఆలోచించే అవసరాన్ని ఆమెకు ఎలా ఇష్టమైతే అలా మారాల్సిన మగ ప్రపంచం గురించి మరింత చర్చ జరగాల్సి ఉంది. లైట్‌ పడాల్సి ఉంది.ఇలాంటి సినిమాలు అందుకు సహకరిస్తాయని ఆశిద్దాం.టాలీ మే 4న అమెరికాలో రిలీజవుతుంది. ఇండియాకు వస్తే తప్పక చూడండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top