నాథముని

special story on Acharya Madabhushi Sridhar - Sakshi

ఆచార్య మాడభూషి శ్రీధర్‌

(నమ్మాళ్వార్‌ కోసం తపస్సుచేసి నాలాయిర ప్రబంధం సాధించి లుప్తమైపోయాయనుకున్న తమిళ వేదాలను పునరుద్ధరించిన మహానుభావుడు నాథముని.) ‘మా పెద్దలు మాకు నేర్పారు. కంఠస్థం చేసి పాడుకుంటున్నాం స్వామీ, అవును ఇంకా 990 పద్యాలు ఉండాలి. కాని ఎక్కడున్నాయో తెలియదు. ఎప్పుడో లుప్తమైపోయి ఉంటాయి. ఎక్కడా దొరకడంలేదు. బహుశా శఠగోపులు కురుగూర్‌ (ఆళ్వార్‌ తిరునగరి) గ్రామంలో వీటిని వ్రాసి ఉంటారు. అంతకన్నా మాకు తెలియదు స్వామీ’ అన్నారు వారు. నాథముని దుఃఖపడ్డారు.  కానీ వీటినెలాగైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. అన్వేషణ ఆరంభమైంది. శ్రీరంగంతో సహా దివ్యదేశాలయిన అనేక ఆలయాల్లో వెతికారు. నమ్మాళ్వార్‌ పుట్టిన ఆళ్వార్‌ తిరునగరి లోనే ప్రయత్నించడం మంచిదనుకున్నారు. తిరునగరిలో ఆదినాథస్వామిని దర్శించి లుప్తమైన ప్రబంధాన్ని గురించి అక్కడ మధురకవి ఆళ్వార్‌ శిష్యులైన పరాంకుశ దాసుల వారిని అడిగారు.  

‘‘నాయనా, ఇదొక్కటే కాదు, ఆళ్వారులందరూ పాడిన అనేక పాశురాలు ప్రబంధాలు పోయినాయి. ... నీ పట్టుదల చూస్తుంటే మాగురువుగారు చెప్పిన మాట నీకు చెప్పాలనిపిస్తున్నది... నమ్మాళ్వారుల పాదాలమీద మనసు నిలిపి, ఆయన దివ్య విగ్రహం ముందు కూర్చుని ఏకాగ్రతతో ఈ పది పాశురాలను (ఈ దశకానికి కణ్ణినున్‌ శిరుత్తాంబు అని పేరు) పన్నెండు వేల సార్లు జపిస్తే, ఆ తపస్వికి ఈ తిరువాయ్‌ మొళి వరప్రసాదంగా లభించే అవకాశం ఉందని మాగురువుగారన్నారు’’.  ఓహో ఒక దారి దొరికిందనుకున్నారు నాథముని. వెంటనే ఆ పరాంకుశ దాసులను ఆచార్యులుగా స్వీకరించి వారు కణ్ణినున్‌ శిరుత్తాంబు ను ఉపదేశిస్తే, నమ్మాళ్వార్‌ జీవనకాలమంతా గడిపిన చింతచెట్టు కింద ఆయన విగ్రహం ముందు కూర్చుని ఆ దశకాన్ని మంత్రంగా పన్నెండు వేల సార్లు నిశ్చలమైన మనస్సుతో పంచేద్రియాల్ని ఏకోన్ముఖం చేసి జపించారు. బాహ్యస్మృతి కోల్పోయి, ప్రవహిస్తున్న కాలాన్ని గమనించకుండా సాగిన ఆయన తపస్సుకు మెచ్చి నమ్మాళ్వార్‌ సాక్షాత్కరించారు. 

‘‘నాయనా, నా వంటి ఆళ్వార్లు నాకన్న ముందూ, తరువాతా కొందరు జన్మించారు. పరంధాముని ఆజ్ఞతో మేమంతా వేదసారాన్ని మన స్థానిక భాష (తమిళం)లో నాలుగు వేల పద్యాల రూపంలో రచించే భాగ్యానికి నోచుకున్నాము. అందులో నా వంతు సామవేద సారాన్ని వేయి పద్యాలలో రచించినాను. మిగిలిన మూడు వేల పద్యాలలో రుగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదాల సారాన్ని కూర్చి మరికొందరు ఆళ్వారులు రచించారు. ఇదే దివ్య ద్రావిడ వేద ప్రబంధం, పరమాత్మ స్వరూప గుణవైభవాన్ని తెలిపి, ఆయనను ఆశ్రయించే విధానాన్ని వివరించి, పరమశుభమైన పరమపదాన్ని పొందే పద్ధతులు విశదీకరించిన అద్భుతమైన భక్తి సాహిత్యం ఇది.  ఈ పద్యాలు చదువుకోవడానికి ఏ ప్రతిబంధకాలు లేవు, నియమాలు లేవు, నిషేధాలు లేవు, హాయిగా చదువుకుని బాగుపడే అవకాశం అందరికీ సమానం గా ఉంది. 

ఇవి అందుకోవడానికి నీవు కఠోరమైన తపస్సు చేసి నాకు మహదానందం కలిగించావు నాయనా. భగవంతుడు మాతో సంశ్లేషించి, మాలో అపారమైన భక్తిని నింపి, అజ్ఞానాన్ని లేశమాత్రం కూడా లేకుండా తుడిచిపెట్టి మేము భక్తి పారవశ్యంలో ఉన్న సమయంలో మాచేత వ్రాయించిన ఈ నాలుగువేల పద్యాలనే నాలాయిర దివ్యప్రబంధం అంటారు. మేం ఆ పద్యాలు ఏ విధంగా, ఏదశలో, ఎప్పుడు వ్రాశామో మాకూ తెలియదు. అంత దివ్యమైన అత్యద్భుతమైన పాశురాలవి’’ అన్నారు నమ్మాళ్వార్‌.  ‘‘అదే స్వామీ ఏదీ ఆ పద్యామృతం, నాకు ఏ విధంగా లభిస్తుంది..’’ అని నాథముని ఆత్రంగా ప్రశ్నించారు. 
‘‘ఇన్ని వేల సంవత్సరాల కాలంలో భూమిమీద మరుగున పడిపోయినా అక్కడ పరమపదంలో నిత్యం ఈ నాలాయిర పాశురాల అనుసంధానం జరుగుతూనే ఉంది’’ అన్నారు నమ్మాళ్వార్‌. 

‘‘అయితే నాకు ఆ దివ్యప్రబంధాన్ని అనుగ్రహించండి స్వామీ’’ అని వేడుకున్నారు నాథముని. నాథముని తపన గమనించిన నమ్మాళ్వార్‌ ‘‘అంతకన్న కావలసిందేముంది. నేను రచించినవే కాకుండా మన ఆళ్వార్లు రచించిన అన్ని పాశురాలను ఇస్తాను తిరువాయ్‌ మొళి తో సహా నాలాయిర ప్రబంధాన్ని నీ ద్వారా ఈ ప్రపంచానికి, భావితరాలకూ చేరే అవకాశం లభించింది.’ అంటూ తమకూ నాథమునులకూ మధ్య తెరకట్టించి, ఆ పద్యాలను ఏకధాటిగా ఉపదేశించడం ప్రారంభించారు. (నమ్మాళ్వార్‌ విగ్రహం నోరు తెరిచి పద్యాలు ధారగా వెలువడ్డాయని కొందరు, మొత్తం నాలాయిర ప్రబంధం నమ్మాళ్వార్‌ దయతో నాథమునికి స్ఫురించిందని, ఆయన వాటిని తాళపత్రబద్ధం చేశారని మరికొందరు రచయితలు వ్రాశారు) తదేక దృష్టితో నాథముని తిరువాయ్‌ మొళి వేయిపద్యాలను, మరో మూడు వేల పద్యాలను కూడా చకచకా తాళపత్రాలమీద లిఖిస్తూపోయారు. 

ఆ సమయంలోనే నమ్మాళ్వార్‌ పరంధామానికి జీవుల్ని చేర్చగల మూడు రహస్యాల సిద్ధాంతాన్ని యోగరహస్యాలను నాథమునికి విశదం చేశారు. కాలగర్భంలో కలిసిపోయిన దివ్యప్రబంధం ఆళ్వార్‌ వరప్రసాదమై తపఃఫలంగా లభించింది. ‘‘కాని నేను వృద్ధుణ్ణి అయిపోతున్నానే, ఈ దివ్ర ప్రబంధాన్ని సామాన్యప్రజానీకానికి చేర్చడం సాధ్యమా’’ అనుకుని అదే మాట అడిగారు నమ్మాళ్వార్లను. ‘‘ఈ ఆళ్వార్‌ తిరునగరిలోనే మధుర కవి ఆళ్వార్‌ కు ఇచ్చిన భవిష్యదాచార్యుల విగ్రహం ఉంది. మరో 500 సంవత్సరాల లోపున ఒక ఆచార్యుడు అవతరిస్తాడు నాయనా’’. అని విగ్రహాన్ని చూపారు నమ్మాళ్వార్‌. అదే భవిష్యదాచార్యుల విగ్రహం.

నాథమునికి స్వప్నంలో వీరనారాయణపురం మన్ననార్‌ స్వామి కనిపించి ‘‘నీవు తెలుసుకున్న పాశురాలను నాకు వినిపించు’’ అని ఆదేశించారు, నాథముని ఆళ్వార్‌ తిరునగరి మూలదైవం శ్రీఆదినాథ స్వామికి ఈ స్వప్నవృత్తాంతం తెలిపి అనుమతి తీసుకుని మన్ననార్‌ ఆలయానికి తిరిగి వెళ్లారు. ఆత్మలకు శరీరాన్నిచ్చి పంచేంద్రియ జ్ఞానాన్నిచ్చి, సన్మార్గంలో నారాయణుడిని చేరడానికి శాస్త్రపరమైన మార్గదర్శకత్వాన్ని కూడా అందించినా ప్రయత్నాలు సంపూర్ణం కావడం లేదు. ఈ ఆళ్వార్‌ దివ్య ప్రబంధాలు మళ్లీ మాయం కాకుండా చూసుకోవలసి ఉంది. కనుక ఈ నాలుగువేల పాశురాలకు సంగీతాన్ని సమకూర్చి పాడుకోవడానికి వీలుగా అందరికీ అందిస్తే బాగుంటుందని నాథమునిని వీరనారాయణుడు ఆదేశించారు. వేదాలలో కీలకమైన ఉదాత్త అనుదాత్త స్వరిత లక్షణ సమన్వితంగా దివ్యమైన సంగీతాన్ని కూర్చి నాలాయిర దివ్యప్రబంధాలను గానం రూపంలో కూడా మళ్లీ సుస్థిరం చేశారు నాథముని. అంతేకాదు. నాలాయిర పాశురాలకు నాట్యానికి అనుగుణంగా రాగతాళాలను నిర్దేశించారు. ఈ ప్రక్రియను ఆరైయార్‌ సేవ అంటారు. శ్రీరంగం వెళ్లి ఆరైయార్‌ సేవను ప్రదర్శించారు. అనేక ఆలయాల్లో ఆరైయార్‌ సేవ ద్వారా పాశురాలు ప్రజల్లోకి వెళ్లాయి. 

అంతర్థానమైన నాలాయిర ప్రబంధం మళ్లీ ఇక్కడి నాథముని వల్ల అవతరించి, ఇక్కడే జనపదాల్లోకి వెళ్లింది కనుక ఈ మన్ననార్‌ కాట్టు మన్నార్‌ అయిందని అంటారు. (కాట్టు అంటే తమిళంలో కనిపించడం అని దివ్యప్రబంధాన్నిచూపిన ఆలయం అని అర్థం.)  నాథముని మనుమడే యామునాచార్యులు (ఆళవందార్‌). నమ్మాళ్వార్‌ చూపిన విగ్రహాన్ని తన మనవడికి ఇవ్వాలని, నాలాయర ప్రబంధాన్ని జనహృదయాలలోకి చేర్పించే కార్యక్రమం కొనసాగించాలని శిష్యులకు ఆదేశించి పరమపదించారు నాథముని.  తాతగారు ఇచ్చిన భవిష్యదాచార్య విగ్రహంలో పోలికలను యువ రామానుజునిలో గమనించిన వారు యామునాచార్యులవారే. 

పన్నిద్దరు (12) ఆళ్వార్లు వైష్ణవ మతంలో వాగ్గేయకారులు 12 మంది. వీరు మహాభక్తులు, తపస్వులు, దివ్యప్రబంధ రచయితలు, ఆ పాశురాలను స్వరలయబద్ధంగా గానం చేసిన వారు. వీరు ఈ భూమిపైన ఉన్న 106 దివ్య నారాయణ క్షేత్రాలలో ఆ పాశురాలతో మంగళాశాసనం చేసిన వారు. కనుక వీరిని ఆళ్వారులు అన్నారు. ఆళ్వారులు గానం చేసిన ఈ ఆలయాలను దివ్యదేశాలని అన్నారు. ఈ 106 నారాయణాలయాలకు తోడు పరమపదంలో ఉన్న రెండు ధామాలను కలిపి 108 దివ్యదేశాలని అంటారు. 106 దివ్యదేశాలను దర్శించి ఆళ్వారులు గానం చేసి ఆరాధించిన నారాయణ మూర్తులను సేవించి వైష్ణవమార్గాన్ని అనుసరిస్తే మిగిలిన రెండు పరంధామాలను చేరడం సులువు అని మరో ముక్తి మార్గాన్ని చూపిన వాడు రామానుజాచార్యుడు.     

కాట్టుమన్నార్‌ అభిమాన స్థలం కాట్టుమన్నార్‌  వైష్ణవ అభిమాన స్థలం. దివ్యదేశం కాకపోయినా ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాన్నిఆళ్వారుల ఆచార్యుల అవతార ప్రదేశాన్ని అభిమాన స్థలం అంటారు. ఇక్కడ నాథముని, ఆయన మనవడు యామునాచార్యులు (ఆళవందార్‌) జన్మించిన చోటు. వీరనారాయణ పెరుమాళ్‌ నెలకొని ఉండడం వల్ల ఇది వీరనారాయణ పురం అయింది. చోళ రాజు వీరనారాయణ చోళ రాజు పునర్‌నిర్మించిన ఆలయం. శ్రీమనన్నార్‌ (రాజగోపాలం) వేంచేసి ఉండడం వల్ల మన్నార్‌ కోయిల్‌ అయింది. కాట్టుం అంటే చూపించేది. నారాయణుడు మన్నన్‌ (రాజు) వలె లక్ష్మీదేవి చేయిపట్టుకుని వచ్చి నాథమునికి నమ్మాళ్వార్‌ ద్వారా నాలాయిరప్రబంధం తెలియజేయాలని సూచించినందుకు ఈ ప్రాంతానికి కాట్టుమ్‌ మన్నన్‌ ఆనార్‌ (కాట్టుమన్నార్‌) పేరు వచ్చింది. 

నాలాయిర గేయాలు, నాట్యగీతాలుగా మార్చి అరైయార్‌ సేవ అనే ప్రక్రియను సృష్టించి వాగ్గేయకారుడైనారు.  పోయిగై నుంచి తిరుమంగై ఆళ్వార్‌ దాకా సాగిన పన్నిద్దరాళ్వార్ల కాలం ముగిసిన తరువాత ఆచార్యపరంపర మళ్లీ నాథమునితో ప్రారంభమైంది. నాథముని మనవడు (ఆళవందన్‌) యమునై తురైవన్‌ ఇక్కడే జన్మించి ఈ నాలాయిర ప్రబంధాన్ని ప్రచారం చేశారు. రామానుజుడు ఆచార్యుడుగా వస్తాడని యమునాచార్యులు మళ్లీ తెలియజేస్తారు. ఆళవందన్‌ శిష్యులలో పెరియనంబి, తిరుకోష్టియూర్‌ నంబి, తిరుక్కచ్చినంబి ముఖ్యులు. కూరత్తాళ్వార్‌ ఇక్కడే సమారంభామ్‌ నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరామ్‌  అనే గురుంపర శ్లోకాన్ని సమర్పించారు.   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top