అయామ్‌ సారీ

Special Story About Srishti Dixit And Team In Family - Sakshi

కొన్ని లక్షణాలు ఉంటేనే పురుషుడు. కొన్ని లక్షణాలు లేకుంటేనే ఆమె స్త్రీ! పాతుకు పోయిన నిర్ధారణ విధానం. పురుషుడు పెట్టుకున్న.. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఈ సమాజం. గట్టిగా మాట్లాడుతోందా.. స్త్రీ కాదు. మనసారా నవ్వుతోందా... స్త్రీ కాదు. సలహా ఇవ్వబోయిందా.. స్త్రీ కాదు! రిపోర్ట్స్‌ చూశారు సృష్టీ అండ్‌ టీమ్‌. స్త్రీగా లేనందుకు... ‘సారీ’ చెప్పారు.

సృష్టీ దీక్షిత్‌కు ఒక టీమ్‌ అంటూ లేదు! విడిగా యూట్యూబ్‌ కమెడియన్‌ ఆమె. నవ్వలేక చచ్చే సెటైర్‌లతో దవడల్ని చెక్కలు చేసేస్తారు. తాజాగా ఒక వీడియోను సృష్టించడం కోసం సహ కమెడియన్‌లతో టీమ్‌–అప్‌ అయ్యారు. ‘ఉమెన్‌ ఫైనల్లీ అపాలజైస్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌’ అనే వీడియో అది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు. 2 నిముషాల 39 సెకన్‌ల నిడివి. ఆ మాత్రంలోనే రెండున్నర గంటల సినిమా చూపించేశారు! స్త్రీలు ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే బాగుండదో పురుషులకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటికి తగ్గట్లు లేనందుకు వీళ్లు తమని తాము నిందించుకునే ధోరణిలో పురుషులకు ఈ వీడియోలో సారీ చెబుతుంటారు! అందరూ డిజిటల్‌ కమెడియన్‌లే కానీ, ఎవర్నీ నవ్వించడానికి చేసిన వీడియో కాదు ఇది. ‘మా రెక్కలు ఎందుకు కట్టేస్తారు?’ అని అడగడం.

‘మా నోటికి టేప్‌ ఎందుకు వేస్తారు?’ అని ప్రశ్నించడం. ఊరికే నిలబడి దారినపోయే వాళ్ల మీద ఇంకుచుక్కల్ని చల్లే స్టాండ్‌–అప్‌ కమెడియన్‌లు కాదు.. సృష్టీ దీక్షిత్, డాలీ సింగ్, కుషా కపిల, మల్లికా దువా, శ్రీజా చతుర్వేది, పవిత్రాశెట్టి, విపాసనా మల్హోత్రా, త్రినేత్రా హల్దార్, సురభీ బగ్గా, స్వాతీ సచ్‌దేవ, సోఫియా ఆష్రాఫ్, విదూసీ స్వరూప్‌! స్త్రీజాతి సమస్తాన్నీ ఒక ‘ఆదర్శ మహిళ’గా తీర్చిదిద్దే పనిలో నిరంతరం వీళ్లు మాటల్ని విడుదల చేస్తూ ఉంటారు. ‘మన మీదే ఈ విరుపులు’ పురుష పుంగవులకు అర్థమైపోతుంది. ఇప్పుడు వీళ్లంతా కలిసి చేసిన సింగిల్‌ లైన్‌ స్క్రిప్టు ‘ఉమెన్‌ ఫైనల్లీ అపాలజైస్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌’ కూడా పురుషుల కోసమే. 
అయామ్‌ సారీ.. నేను కూడా ఆలోచిస్తున్నందుకు! – మల్లికా దువా

వారం కాలేదు సృష్టీ ఇన్‌స్టాకు ఈ వీడియో వచ్చి. 7 లక్షల 50 వేల వ్యూస్, రెండు వేల కామెంట్స్‌ వచ్చాయి! వీడియోలో ఒక్కొక్కరూ స్క్రీన్‌ పైకి వచ్చి ‘అలా లేనందుకు సారీ’, ‘ఇలా ఉన్నందుకు సారీ’ అని మగవాళ్లకు చెప్పి వెళ్లిపోతుంటారు. మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘ఇలాంటి స్థితిలో జీవిస్తున్నందుకు సారీ’ అని ఒకరు కామెంట్‌ పెట్టారు. ‘హక్కుల సాధనకు సారీ చెప్పేపని లేదని నేర్పించిన స్త్రీవాదానికి మద్దతు ఇస్తున్నందుకు సారీ’ అని ఇంకొకరు అన్నారు. ‘మాటల్లో చెప్పలేకపోతున్నాను. కన్నీళ్లొస్తున్నాయి.
అయామ్‌ సారీ.. నేను నవ్వుతూ ఉంటున్నందుకు! – శ్రీజా చతుర్వేది

మీరంతా శక్తిమంతమైన, అందమైన, ఆత్మవిశ్వాసం గల అమ్మాయిలు. మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నేనూ మీతో పాటు కలిసి నడుస్తాను’ అని ఒక అమ్మాయి ఉద్వేగపడింది. ‘మనసు చెదిరిపోయింది. గట్‌ రెంచింగ్‌ వీడియో’ అని ఒకరన్నారు. ‘గే’ స్పందన కూడా ఉంది. ‘స్త్రీలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో.. ఒక భారతీయ పురుషుడిగా అర్థం చేసుకోగలుగుతున్నాను’ అని అతడి కామెంట్‌. ఇంకొక యూజర్‌ అయితే కాస్త కవితాత్మకంగా తిప్పి చెప్పారు. ‘‘ఈ వీడియోను వాచ్‌ చేసినందుకు, వాచ్‌ చేసి అభినందిస్తున్నందుకు నేను సారీ చెప్పడం లేదు’’ అన్నారు.
 

అయామ్‌ సారీ.. నేను ఎవరి అనుమతి లేకుండా మాట్లాడుతున్నందుకు! – పవిత్రాశెట్టి

ఏముంది ఇందులో.. స్త్రీల బలహీనత, వారి తిక్క తప్ప అని కామెంట్‌ చేసిన వాళ్లూ ఉన్నారు. ఎవరు ఏం అనుకున్నా ఇలాంటివి ఇంకా అనేకం రావలసిన పరిస్థితిలో ఉన్నాం. స్త్రీ తన అభిప్రాయాన్ని తెలిపితే ‘రేప్‌ థ్రెట్స్‌’ ఆమెకు డైరెక్టుగా మెజేస్‌ (డిఎం) అవుతున్న ఆధునిక అనాగరక కాలంలో ఉన్నాం. ‘స్త్రీగా పుట్టినందుకు సారీ చెబుతున్నా’ అని ఈ వీడియో చివర్లో ఒక యూట్యూబర్‌ అంటారు. స్త్రీ ఆవేదన అది. పురుషుడిలో ఆలోచన కలిగించేది.
అయామ్‌ సారీ.. స్త్రీగా పుట్టినందుకు, స్త్రీగా శ్వాసిస్తున్నందుకు! – సోఫియా అష్రాఫ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top